Thursday, December 26, 2024

అటవీ ఆక్రమణలను అడ్డుకున్నాం

- Advertisement -
- Advertisement -

Koyapochagud Locals attacking forest officials

మనతెలంగాణ/ హైదరాబాద్ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడలో జరుగుతున్న ఘటనలకు తమను బాధ్యులుగా చిత్రీకరించటం తగదని అటవీశాఖ స్పష్టం చేసింది. పులుల అభయారణ్యం, రక్షిత అటవీ ప్రాంతానికి చెందిన భూమిని స్థానికులు ఆక్రమించే ప్రయత్నం చేస్తే, చట్ట పరిధిలోనే అడ్డుకున్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని నెలలుగా కోయపోచగూడకు పక్కనే, కవ్వాల్ టైగర్ రిజర్వు అటవీ ప్రాంతంలో 25 ఎకరాల పరిధిలో చెట్లు నరికివేస్తూ, చదును చేస్తున్నారని, వద్దని వారించిన అటవీ శాఖ అధికారులు, సిబ్బందిపై స్థానికులు దాడులు చేశారని తెలిపారు. పోడు భూముల సమస్యకు, తాజా ఆక్రమణలకు అసలు సంబంధమే లేదని అటవీశాఖ తెలిపింది.

రాష్ట్రంతో పాటు, మంచిర్యాల జిల్లాలో కూడా ఇప్పటికే సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికి తాము వెళ్లలేదని, కేవలం కొత్తగా అడవిని నరికి, ఆక్రమించే ప్రయత్నాలను మాత్రమే అడ్డుకున్నామని అటవీ శాఖ స్పష్టం చేసింది. అడవులు ఆక్రమణలకు గురికాకుండా కాపాడటం, వన్యప్రాణుల ఆవాసాలను కోల్పోకుండా చూడటం తమ విధినిర్వహణలో భాగమని గుర్తుచేశారు. గతేడాది నవంబర్ నుంచి వివిధ దఫాలుగా అడవి ఆక్రమణల ప్రయత్నాలు జరుగుతున్నాయని, అటవీశాఖతో పాటు రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు అనేక మార్లు కోయపోచగూడతో పాటు, ఆక్రమణ ప్రాంతానికి వెళ్లి కౌన్సిలింగ్ చేశామని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ సిపి వినోద్‌కుమార్ తెలిపారు.

విధి లేని పరిస్థితుల్లో మాత్రమే ఆక్రమణదారులను అడ్డుకుని, చట్ట పరిధిలో కేసులు పెట్టాల్సి వస్తోందని ఆయన తెలిపారు. కొన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు స్థానికులను రెచ్చగొట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. తాజాగా ఆక్రమిత భూముల్లో రెండు రోజల కిందట గుడిసెలను రాత్రికి రాత్రి ఏర్పాటుచేశారని, తొలగించేందుకు వెళ్లిన తమపై మహిళలను, చిన్న పిల్లలను అడ్డుగా పెట్టి దాడులు చేశారని జన్నారం డివిజనల్ అటవీ అధికారి మాధవరావు తెలిపారు. సిబ్బంది కళ్లలో కారం చల్లడంతో పాటు, కర్రలతో విచక్షణారహితంగా దాడులు చేశారని అన్నారు. చాలా మంది సిబ్బందిని గాయపరచటంతో పాటు, అటవీ శాఖ జీపును కూడా ధ్వంసం చేశారని తెలిపారు.

కోయపోచగూడ పక్కనే ఉన్న కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోకి గ్రామస్థులు చొరబడి, కొత్తగా పోడు కోసం అడవిని చదును చేయటంతోనే సమస్య మొదలైందని మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివాని డోగ్రా తెలిపారు. గతంలో అక్కడా ఎలాంటి పోడు వ్యవసాయం లేదని, తాజాగా ఆడవి ఆక్రమించే ప్రయత్నాలనే తమ సిబ్బంది నివారిస్తున్నారని ఆమె అన్నారు. గతంలో ఎలాంటి చొరబాటు లేని, అటవీ భూమిని కొత్తగా ఆక్రమించాలనే దురుద్దేశ్యంతో కొందరు, స్థానిక మహిళలను ముందు పెట్టి సమస్య సృష్టించారని తెలిపారు. అటవీ చట్టాలను ఉల్లంఘించి, ఆక్రమించేవారిపై, వాళ్ల వెనుక ఉన్నవారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని జిల్లా డిఎఫ్‌ఓ చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News