బిఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ క్రిశాంక్‌ను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓయూలో నీటికొరత, కరెంట్ కొరత వల్ల హాస్టల్స్ మూసివేస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల పేరుతో నకిలీ లెటర్ సృష్టించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన బిఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ క్రిశాంక్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతితో పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు ముందుగా ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు, తర్వాత ఓయూ పోలీస్ స్టేషన్‌కు క్రిశాంక్‌ను పోలీసులు తరలించారు. ఫేక్ లెటర్‌కు సంబంధించి క్రిశాంక్‌ను ఓయూ పోలీసులు విచారిస్తున్నారు.
ఆదివారం, సోమవారం క్రిశాంక్‌ను పోలీసులు విచారణ చేయనున్నారు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. నీటి, కరెంట్ కొరత అంటూ ఫేక్ లెటర్‌ని సోషల్ మీడియాలో క్రిశాంక్ సర్క్యూలెట్ చేశారు. ఓయూ ఖ్యాతిని అప్రతిష్ఠపాలు చేశారని క్రిశాంక్‌పై ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్టు చేశారు. క్రిశాంక్ కాల్ డేటా, వాట్సాప్ మెస్సేజ్‌లపై ఓయూ పోలీసులు అరా తీస్తున్నారు. కాగా.. క్రిశాంక్ భద్రతపై ఆయన భార్య సర్వే సుహాసిని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసు మొత్తం బహిర్గతంగా ఉందని అలాంటప్పుడు పోలీస్ కస్టడీ అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు.
కేసును ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారని నిలదీశారు. సోమవారం బెయిల్ పిటిషన్ విచారణకు రాబోతున్నదని అప్పటి వరకు ఎందుకు ఎదురు చూడటం లేదని పోలీసులను ఆమె ప్రశ్నించారు. సెలవు రోజై ఆదివారం క్రిశాంక్‌ను పోలీసులు కస్టడీకి తీసుకోవడం ఏంటి అని నిలదీశారు. క్రిశాంక్ సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఏముందని, గతంలో మాదాపూర్ పోలీసులు ఓ కేసులో ఫోన్‌ను స్వాధీనం చేసుకుని తిరిగి దాన్ని కోర్టులో కూడా సమర్పించలేదని తెలిపారు. తనభర్తను విడిచిపేట్టే వరకు తాను పోరాటం చేస్తానని క్రిశాంక్ భార్య సర్వే సుహాసిని తెలిపారు.