కుదరని నీటి వాటాలు.. ఆగని వివాదాలు !
50శాతం నీటికి తెలంగాణ పట్టు
హైదరాబాద్‌కు తాగునీటిలో 20శాతమే పరిగణలోకి
రేపు కృష్ణాబోర్డు కీలక సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీజలాల్లో వాటాలు కుదరటంలేదు. తెలుగు రాష్ట్రాల మధ్యన వివాదాలు ఆగటం లేదు. గత జూన్ నుంచి ప్రారంభమైన నీటి సంవత్సరం ఈ నెలాఖరుతో ముగిసిపోనుంది. నీటి సంవత్సరం అంతా రెండు రాష్ట్రాల మధ్యన విదాదాలతోనే గడిచిపోయింది. తిరిగి జూన్ నుంచి కొత్త నీటి సంవత్సరం ప్రారంభం కాబోతోంది. కనీసం ఈసారైన కృష్ణానదీజలాల వినియోగంలో తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యన పరస్పర ఆమోదయోగ్యమైన నీటి ఒప్పందాలు కుదురుతాయన్న అశాభావం రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖల అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. కృష్ణానదీయాజమాన్య బోర్డు జూన్ నుంచి ప్రారంభమయ్యే వాటర్ ఇయర్‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల వినియోగంపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు బుధవారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసింది. జలసౌధలో జరగనున్న ఈ సమావేశంలో కృష్ణానదీజలాల వినియోగంతోపాటు, రూల్‌కర్వ్‌పై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు నుంచి తాగునీటికి, సాగునీటికి నీటి కేటాయింపులు, జలవిద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రాధాన్యతలు కూడా చర్చకు రానున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదీజలాల్లో మహారాష్ట్ర, కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటిని కేటాయిస్తూ తీర్పునిచ్చింది. బచావత్ చేసిన ఆవార్డు మేరకు ఉమ్మడి ఏపికి 811టిఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. 2014లో జరిగిన ఏపి పునర్‌విభజనచట్టం మేరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో నీటికేటాయింపులు ప్రధాన అంశాలుగా మారాయి. రెండు రాష్ట్రాల మధ్యన 201516లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం కృష్ణానదీజలాల వినియోగంలో ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్యన 66:34 నిస్పత్తిలో నీటికేటాయింపులు కుదుర్చుకున్నాయి. బచావత్ చేసిన 811టీఎంసీల నీటి కేటాయింపుల్లో తెలంగాణకు 299టిఎంసీలు, ఏపికి 512టింసీలు వినియోగించుకునేలా తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందమే ఇప్పటివరకూ కొనసాగుతూ వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నీటి అవసరాలు పెరగటంతో తాత్కాలిక ఒప్పదం కొనసాగింపు ఇక కుదరదని తెలంగాణ రా్రష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ కృష్ణానదీజలాల్లో సమాన వాటా నీటికి పట్టుబట్టింది.
గతంలో జరిగిన కృష్ణా బోర్డు సమావేశాల్లోనూ ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించింది. బుధవారం జరగబోయే బోర్డు సమావేశంలో 50:50 నీటివాటాలే ప్రధాన చర్చనీయాంశంగా మారనుంది.మరో వైపు గ్రేటర్ హైదరాబాద్ నగర జనాభా పెరిగిపోతోంది. నగర ప్రజల దాహార్తి తీర్చటం ప్రధానాంశంగా మారింది. కృష్ణానదీజలాలనుంచి తాగునీటి అవసరాలకు వినియోగించుకునే నీటిలో 20శాతం నీటిని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రం కృష్ణాబోర్డు సమావేశాల్లో ప్రతిపాదించింది. దీనిపై కూడా ఈ సారి సామావేశంలో స్పష్టత రావాల్సివుంది.కృష్ణానదికి వరదల సమయంలో వృధాగా సముద్రంలోకి పోతున్న సందర్బాల్లో రెండు రాష్ట్రాలు వినియోగించుకునే నదీజలాలను ఆయా రాష్ట్రాల నీటి వాటాల్లో లెక్కించ రాదని ఆంధప్రదేశ్ రాష్ట్రం ప్రతిపాదించింది. అయితే ఏ రాష్ట్రం ఎంత నీటిని వినియోగించుకున్నది పక్కాగా రికార్డు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ చెబుతూ వస్తోంది.
రూల్‌కర్వ్ పైనే బోర్డు దృష్టి
కృష్ణానదీజలాల వినియోగానికి సంభందించి రూల్‌కర్వ్ నిర్ణయంపైనే కృష్ణాబోర్డు దృష్టి పెట్టింది. ఈ సారి సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం జరిగిపోవాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు నుంచి దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటి అవసరం ఉన్నప్పుడు మాత్రమే జలవిద్యుత్ ఉత్పత్తి జరగాలని ఏపి పట్టుపడుతోంది.అయితే తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అవసరాల్లో విద్యుత్ అతి ప్రాధాన్యతా పరమైన అంశంగా మారింది. ఈ నేపధ్యలో జలవిద్యుత్ ఉత్పత్తికే తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యత ఇస్తోంది. కృష్ణాబోర్డు సమావేశంలో జలవిద్యుత్ ఉత్పత్తి అంశం కూడా కీలకం కానుంది. గోదావరి నుంచి కృష్ణాబేసిన్‌కు నీటిమళ్లింపు అంశం కూడా చర్చకు రానుంది.