హైదరాబాద్:యాసంగి సీజన్‌లో ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి అవసరాలపై చర్చించి నీటివాటాలను నిర్ణయించేందుకు ఈ నెల 17న కృష్ణానదీ యాజమాన్యబోర్డు త్రిసభ్యకమిటీ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ , ఆంధప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఈఎన్సీలులతోపాటు కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శి పాల్గొనే ఈ సమావేశం హైదరబాద్‌లోని జలసౌధ బోర్డు కార్యాలయంలో జరగనుంది. ఈ నీటి సంవత్సరం కృష్ణానదీ జలాల్లో తెలుగు రాష్ట్రాలు ఎంత నీటిని వినియోగించుకున్నదీ చర్చించి లెక్కతేల్చటంతోపాటు రెండు రాష్ట్రాలకు
ఆ నీటిని మినహాయించి ప్రస్తుతం శ్రీశైలం ,నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాల అవసరాల మేరకు నీటి కోటాలపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతే కాకుండా వేసవిలో తెలంగాణ ,అంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అసరాలను కూడా చర్చించనున్నారు. బోర్డు సభ్యకార్యదర్శి డి.ఎం రాయపురే అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ఈఎన్సీలు హాజరు కావాలని ఈ మేరకు బోర్డు కార్యాలయం సమాచారం అందజేసింది.