హైదరాబాద్: కృష్ణానదీయాజమాన్య బోర్డు త్రిసభ్యకమిటి సమావేశం గురువారం జరగనుంది.జలసౌధలో సాయంత్రం జరగనున్న ఈ సమావేశానికి తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొననున్నారు.రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వేసవిలో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తికోసం నీటిని వినియోగించుకోవద్దని గతంలో కృష్ణారివర్‌బోర్డు రెండు రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు లేఖలు కూడా రాసింది.
809అడుగుల పైన ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 34టిఎంసిల నీరు ఉందని ,కనిష్ట వినియోగపు మట్టాన్ని పరిగణలోకి తీసుకుంటే నికరంగా 5.2 టిఎంసిలు మాత్రమే అందుబాటులో ఉందని బోర్డుతెలిపింది. మే నెల వరకూ తాగునీటి అవసరాలకోసం 3.5టిఎంసీల నీరు కావాలని తెలంగాణ ప్రభుత్వం , ఏపికి అవసరాలకు 6టిఎంసిలు కావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం విజ్ణప్తులు చేసినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. రెండు రాష్ట్రాల నీటిఅవసరాలు , జలాశయంలో లభ్యతనీరు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.