Wednesday, January 22, 2025

శ్రీకృష్ణ జన్మభూమి వివాదం కేసు హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించి మథుర భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.షాహీ ఈద్గా దర్గా మసీదు కాంప్లెక్స్‌లో సర్వే చేపట్టాలంటూ గురువారం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిలుపుదల చేయాలంటూ దాఖలయిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించేందుకు నిరాకరించింది.ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఈ కేసులో హిందూ పక్షం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలు కొనసాగుతాయని, స్టే విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. కాగా శ్రీకృష్ణుడు జన్మించినప్రదేశంలో మసీదును నిర్మించారని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. దీనిపై సర్వే చేపట్టాలని చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు దాఖలయిన పిటిషన్లను పరిశీలించిన స్థానిక కోర్టు సర్వే చేపట్టాలంటూ గత ఏడాది డిసెంబర్‌లో తీర్పు ఇవ్వగా ముస్లిం పక్షం దాన్ని అలహాబాద్ హైకోర్టులో సవాలు చేసింది. సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు సర్వే చేపట్టేందుకు గురువారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఈ ఆదేశాలను ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో న్యాయమూర్తులు సంజయ్ ఖన్నా, ఎస్‌విఎన్ భట్టిలతో కూడిన బెంచ్‌ఈ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ కేసును క్రిస్మస్ సెలవుల తర్వాత విచారిస్తామని, జనవరి 9న విచారణ తిరిగి మొదలవుతుందని జస్టిస్ ఖన్నా అన్నారు. ఈ లోగా హైకోర్టు గనుక ఉత్తర్వులు ఇస్తే ముస్లిం కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని కూడా ఆయన చెప్పారు. ఈద్గా కాంప్లెక్స్‌కు సంబంధించి అలహాబాద్ హైకోర్టులో డజనుకు పైగా పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. మధురలో దాదాపు 13.37 ఎకరాల స్థలంలో ఉన్న శ్రీకృష్ణుడి ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మసీదును నిర్మించాడని తరఫున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్నిశ్రీకృష్ణ విరాజ్‌మాన్‌కు చెందినదిగా ప్రకటించాలని వారు కోరుతున్నారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు షాహీ ఈద్గా దర్గా కాంప్లెక్స్ సర్వేకు గురువారం అనుమతిచ్చింది. కోర్టు పర్యవేక్షణలు ముగ్గురు అడ్వకేట్ కమిషనర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది. ఇందుకు తగిన విధి విధానాలను ఈ నెల 18న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News