Monday, December 23, 2024

జల జగడాలు.. జారుకుంటున్న జలాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రాల మధ్యన నదీజలాలకు సంబంధించిన జగడాలు ఆగడం లేదు. ఉన్ననీటిని సమర్ధవంతంగా వినియోగించుకోవటంలో సామరస్యపూర్వకమైన విధానాలు కొరవడటంతో ఎంతో విలువైన నదీజాలు వృధాగా సముద్రంలోకి జారుకుంటున్నాయి.తెలుగు రాష్ట్రాలకు కూడా ఇందులో మినహాయింపేమీ లేదు. పోరు నష్టం పొందు లాభం అన్నది ఏమాత్రం వంటబట్టించుకోవటం లేదు. రాష్ట్రాల మధ్యన తలెత్తే నీటి వివాదాలను సామరస్యపూర్వంగా పరిష్కరించేందకు పెద్దన్న పాత్రవహించాల్సిన కేంద్ర ప్రభుత్వం తనకేమి పట్టనట్టు వ్యవహరిస్తోంది. అవసరమైతే మరింత వివాదాలు రాజేసి పబ్బం గడుపుకోవాల్నన రీతిలో వ్యవహరిస్తోందన్న విమర్శలను కూడా ఎదుర్కొంటోంది.

కృష్ణానదీజలాలకు సబంధించి తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల మధ్యన నీటి కేటాయింపుల మేరకు వాటాలు పంపిణీ చేసి రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత పెంపుదలకు కృషి చేయాల్సిన కృష్ణానదీ యాజమాన్యబోర్డు ప్రేక్షక పాత్ర వహిస్తోంది. నిస్పాక్షింగా వ్యవహరించాల్సిన బోర్డు వివిధ అంశాల్లో ఏదో ఒక రాష్ట్రానికి కొమ్ముకాస్తోందన్న సందేహాలకు తావిచ్చేలా వ్యవహరిస్తోందంటున్నారు. బోర్డు నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల కింద ఏటా కోట్లాది రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాలే భరిస్తున్నా , ఆమేరకు బోర్డు పనితీరును మెరుగు పరుచుకోవటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతిఏటా జూన్ నుంచి ప్రారంభమయ్యే వాటర్ ఇయర్ మే చివరినాటితో ముగిస్తుంది. ఈ ఏడాది కూడా ఈ నెలాఖరుతో నీటి సంవత్సరం ముగియనుంది. జూన్ నుంచి కొత్త నీటి సంవత్సరం ప్రారంభం కానుంది. వచే ఏడాది నీటి పంపకాలకు సంబంధించి బుధవారం బోర్డు 17వ సమావేశం నిర్వహించనున్నారు .జలసౌధలో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ, ఏపికి చెందిన నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొననున్నారు.

ఈ నేపధ్యంలో ఈ ఏడాది ఎగువ నుంచి కృష్ణానదీ ఎగువ నుంచి ఎంత నీటిని తెలుగు రాష్ట్రాలకు మోసుకు వచ్చింది. ఏ ప్రాజెక్టుకు ఎంత నీరు చేరుకుంది, అందులో ఎంత నీటిని రెండు రాష్ట్రాలు ఉపయోగించుకున్నాయి అన్నది పరిశీలిస్తే తెలంగాణ, ఏపి ఉపయోగించుకున్న నీటికంటే వృధాగా సముద్రం పాలయిన నీరే అధికంగా ఉండి అధికారులను సైతం విస్మయ పరుస్తోంది. కృష్ణానది నుంచి ప్రకాశం బ్యారేజి మీదుగా 1327టిఎంసీలు వృధాగా సముద్రంలోకి కలిసిపోయాయి. బచావత్ అవార్డు మేరకు కృష్ణానదీజలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 811టిఎంసీలు కేటాయింపులు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఎగువన కర్ణాటక నుంచి కృష్ణానది ద్వారా జూరాల ప్రాజెక్టుకు 1231టిఎంసీలు చేరుకున్నాయి. కృష్ణానదికి ప్రధాన ఉపనదిగా ఉన్న తుంగభద్ర నది ద్వారా కూడా భారీగానే నీరు చేరింది. తుంగభద్ర ప్రాజెక్టులోకి 601టిఎంసీల నీరు చేరుకుంది. డ్యాం దిగువన తుంగభద్ర ద్వారా తెలుగురాష్ట్రాలకు 804టిఎంల నీరు చేరింది. ఇటు కృష్ణా , అటు తుంగభద్ర నదుల ద్వారా ఈ ఏడాది శ్రీశైల ప్రాజెక్టులోకి 2035టిఎంసీల నీరు చేరుకుంది. శ్రీశైల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధం 215టిఎంసీలు కాగా, ఈ ప్రాజెక్టులోకి అంతకు పదింతల నీరు చేరింది.రిజర్వాయర్ పది సార్లు నిండేంత నీరు చేరుకుంది.

దిగువన నాగార్జున సాగర్ లోకి కూడా 1710టిఎంసీల నీరు చేరుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిలువ సామర్ధం 312టిఎంసీలు కాగా ,రిజర్వాయర్ సామర్ధం కంటే ఐదు రెట్లకు పైగానే నీరు చేరుకుంది. దిగువన పులిచింతల ప్రాజెక్టు సామర్ధం 45టిఎంసీలు కాగా, ఈ ప్రాజెక్టులోకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 1284టిఎంసీల నీరు చేరింది. ఈ నీరంతా నేరుగా దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజికి ఉరకలెత్తింది.మూసి , పాలేరు , మున్నేరు తదితర వాగులు వంకల నీరు కూడా కలవటంతో ప్రకాశం బ్యారేజిలోకి కృష్ణానది ద్వారా 1518టిఎంసీల నీరు చేరింది. ఈస్ట్ చానల్ ,వెస్ట్ చానల్ ,గుంటూరు కాలువల ద్వారా ఏపి 190టిఎంసీలు మాత్రమే వాడుకోగా, మిగిలిన నీరంతా వృధాగా సముద్రంలోకి జారుకుంది.2021జూన్ నుంచి 2022మే వరకూ కూడా కృష్ణానదీజలాలు ప్రకాశం బ్యారేజి మీదుగా 501టిఎంసీలు వృధాగా సముద్రంలోకి చేరిపోయాయి.

గోదావరి నుంచి 6232టిఎంసీలు వృధా:
కృష్ణానదీజలాల దారిలోనే గోదావరి నది నుంచి కూడా ఈ ఏడాది రికార్టు స్థాయిలో నీరు సముద్రంలో కలిసి పోయింది. ఈ నీటి సంవత్సరంలో ధవళేశ్వరం ఆనకట్ట వద్దకు 6434టిఎంసీలు చేరుకున్నాయి. ఇందులో ప్రధాన కాలువల ద్వారా వినియోగించుకున్న నీటిమి మినహాయిస్తే 6232టిఎంసీల నీరు వృధాగా సముద్రం పాలయింది. గత ఏడాది కూడా 2502టిఎంసీల మేరకు గోదావరి జలాలు సముద్రంలో కలిసి పోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News