వరుసగా మూడు రోజుల పాటు కొనసాగనున్న విచారణ
ఇప్పటికే రెండు సార్లు వాదనలు వినిపించిన తెలంగాణ అధికారులు
మన తెలంగాణ / హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదం, నీటి కేటాయింపులపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ (ట్రిబ్యూనల్ 2) మంగళవారం నుంచి విచారణ చేపట్టనున్నది. మరుసగా మూడు రోజుల పాటు 15, 16, 17 వ తేదీల్లో విచారణ కొనసాగనున్నది. ట్రిబ్యూనల్ ఎదుట ఇప్పటికే తెలంగాణ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. మంగళవారం నుంచి జరిగే విచారణ సందర్భంగా తిరిగి తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించేందుకు సన్నద్దం అవుతున్నారు. కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో పట్టుదలతో ఉంది.
ఒక్క చుక్కబోట్టును కూడా వదులుకోబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కృష్ణా నదీ జలాల విచారణ సందర్భంగా జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం తరపున ఎలాంటి అంశాలను లేవనెత్తాలనే విషయంపై న్యాయనిపుణులు, నీటిపారుదల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. అంతే కాకుండా సందర్భాన్ని బట్టి తాను స్వయంగా హాజరు అయ్యేందుకు ప్రయత్నిస్తానని కూడా మంత్రి వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఈసారి మూడు రోజుల పాటు జరిగే విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించనున్నది.