తాత్కాలిక ఒప్పందాలు ఇంకెంత కాలం
తెలంగాణకు సగం నీటి వాటా ఇవ్వాల్సిందే
అపెక్స్ కమిటీలో తేల్చుకోవాలని నిర్ణయం
హైదరాబాద్: సాగు నీటి సంవత్సరం వచ్చేసింది. 202314 సంవత్సరానికి గాను కృష్ణానదీజలాల పంపిణీపై తెలుగు రాష్ట్రాల మధ్య రాజీ కుదరటం లేదు. నదీజలాల్లో సింహభాగం వాటా తమకే దక్కాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టు బడుతోంది. కృష్ణానదీయాజమాన్య బోర్డులో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీకి సంబంధించి ఏపి ప్రభుత్వం ఎప్పటికప్పుడు మడత పేచీలు పెడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన కొత్తల్లో తాత్కాలిక ప్రాతిపదికన కుదుర్చుకున్న ఒప్పందాలనే ఇంకా కొనసాగించాలని వితండవాదానికి దిగుతోంది.
తెలుగు రా్రష్ట్రాలు విడిపోయాక 2015లో కృష్ణానదీజలాల వినియోగానికి సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికన సామరస్య పూర్వకంగా రెండు రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ ఒప్పందం అప్పటి సాగు నీటి సంవత్సరానికి మాత్రమే అయినప్పటికీ ఏనిమిదేళ్లుగా తాత్కాలిక ఒప్పందం ఏటేటా కొనసాగుతూనే ఉంది. ఇది ఇంకేంత కాలం అని తెలంగాణ ప్రభుత్వం నిలదీస్తోంది. కృష్ణానదీజలాల్లో సగం నీటి వాటాం తెలంగాణకు ఇవ్వాల్సిందే అని పట్టుపడుతోంది. ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్‌లోనే తేల్చుకోవాలన్న అభిప్రాయంతో ఉంది. కృష్ణానదీ పరివాహకంగా ఉన్న మహారాష్ట్ర , కర్ణాటక , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి జస్టిస్ బచావత్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ మూడు రాష్ట్రాలకు నీటి పంపిణీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఏపికి కృష్ణానదీజలాల్లో 811టిఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి.
2014లో ఉమ్మడి ఏపి నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక 2015లో కృష్ణానదీజలాల్లో రెండు రాష్ట్రాలకు నీటి పంపిణీపై 66 శాతం ఏపికి , 34శాతం తెలంగాణకు నీటిని వినియోగించుకోవాలన్న తాత్కాలిక ఒప్పందం కుదిరింది. 811టిఎంసీల నీటిలో తెలంగాణ 299టిఎంసీలు, ఏపి 512 టిఎంసీలు వినియోగించుకునేలా తాత్కాలిక ప్రాతిపదికగా రెండు రాష్ట్రాలు అంగీకారం కుదుర్చుకున్నాయి. అయితే ఎనిమిదేళ్లు గడిచిపోయినా ఇదే ఒప్పదం ఇంకా కొనసాగుతుండటం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యతరం చెబుతోంది.
కృష్ణానదీజలాల్లో సమాన వాటా కావాల్సిందే అని ఇప్పటికే కృష్ణానదీ యాజమాన్యో బోర్డు సమావేశాల్లో తెల్చిచెప్పింది. గత నెలలో జరిగిన 17వ బోర్డు సర్వసభ్య సమావేశంలోనూ ఇదే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. మినిట్స్‌లోనూ ఇదే రికార్డు చేసింది. 20232024 జూన్‌మే మధ్య అమలయ్యే సాగు నీటి సంవత్సరానికి సంబంధించి గత నెలలో బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపైన కృష్టాబోర్డు మినిట్స్ రికార్డు చేసి ఇటీవల రెండు రాష్ట్రాలకు పంపింది. దీనిపై ఏపి మళ్లీ పేచిలు పెట్టింది. తాము జూన్‌తో ప్రారంభమైన నీటి సంవత్సరానికి సంబంధించి 811టిఎంసీల వాటాలో 66:34 నిస్పత్తికే అంగీకరించామని, 50:50 నిస్పత్తిలో నీటి వాటాలకు అంగీకరించలేదని ఆంధప్రదేశ్ ప్రభుత్వం మాట మార్చి నాలుక మడతేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. తాము అంగీకరించని వాటిని మినిట్స్‌లో ఏలా నమోదు చేస్తారని కృష్టానదీయాజమాన్య బోర్డు అధికారులపైన గుస్సా అవుతోంది.
వాటాలు తేలేదాక ప్రాజెక్టులు అప్పగించేది లేదు!
కృష్ణానదీజలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేదాక కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించరాదని తెలంగాణ ప్రభుత్వం స్థిరమైన అభిప్రాయంతో ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నాయి. వీటిలో శ్రీశైలం ప్రాజెక్టు నీటినిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టగా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి నిర్వహణ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య 2015లో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ప్రకారం కృష్ణానదీజలాల్లో తెలంగాణ రాష్ట్రం 299టిఎంసీలను వినియోగించుకుంటుండగా, ఆంధ్రప్రదేశ్ 512టిఎంసీలను ఉపయోగించుకుంటోంది.
ఈ ఒప్పందం ఒక్క సంవత్సరానికి మాత్రమే కుదుర్చుకున్నప్పటికీ ఏపి ప్రభుత్వం ప్రతి సారి బోర్డు సమావేశాల్లో వితండ వాదనలు చేస్తూ తన పంతం నెగ్గించుకుంటోంది. ఏనిమిదేళ్లుగా ప్రతిఏటా 512టిఎంసీల నీటిని వినియోగించుకుంటోంది. అంతే కాకుండా అనుమతి లేని ప్రాజెక్టులకు కూడా తన వాటాలకు మించి నీటిని వాడుకుంటోంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో లేని ప్రాజెక్టులకు కూడా నీటిని అక్రమంగా తరలించుకుపోతోంది. అక్రమ ప్రాజెక్టులకు , బేసిన్ పరిధిలో లేని ప్రాజెక్టులకు కృష్ణానదీజలాలను తరలిచటం పట్ల ఏపిని కట్టడి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కృష్ణాబోర్డుకు పలు మార్లు ఫిర్యాదులు చేసిన ఫలితం లేకుండా పోతోంది. ఏపి ప్రభుత్వం అక్రమ నీటి వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి , అపెక్స్ కౌన్సిల్‌లోనే సమాన నీటి వాటాలను తేల్చుకోవాలన్న అభిప్రాయంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈ అంశం పట్ల గట్టిపట్టుదలతో ఉంది.