నేడు ఇరు రాష్ట్రాల ఈఎన్సీల భేటీ
రేపు మళ్ళీ సమావేశం కానున్న కృష్ణా బోర్డు
ఏపి నీటి తరలింపు నియంత్రించాలన్న తెలంగాణ
మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ప్రత్యేక సమావేశం సోమవారం నాడు అసంపూర్తిగా ముగిసింది. కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జలసౌధలో జరిగిన ప్రత్యేక సమావేశంలో నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తమ వాటాకు మించి నీటిని వాడుతున్నందున వెంటనే నిలువరించాలని నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కృష్ణా బోర్డు ఛైర్మన్‌ను కోరారు. శ్రీశైలం నుంచి ఉన్న పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి తదితరాల ఔట్ లెట్ల నుంచి ఏపీ నీటి వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలన్నారు. సాగు, తాగునీటి అవసరాల కోసం తమకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పది టీఎంసీల చొప్పున అందుబాటులో ఉంచాలని కోరారు.
దాంతో సముద్రంలోకి వృధాగా పోయే వరద నీటిని తాము వినియోగించుకున్నామని ఏపీ ఈఎన్సీ అంటూ దానిని పరిగణలోకి తీసుకోరాదని సూచించారు. దాంతో పంటలకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏపి, తెలంగాణ రాష్ట్రాలు నాగార్జునసాగర్, శ్రీశైలం నీటిని వినియోగించుకునే అంశంపై సమగ్రంగా చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కెఆర్‌ఎంబి) చీఫ్ ఇంజినీర్లకు సూచించింది. దీంతో మంగళవారం నాడు ఏపి, తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు.
బుధవారం నాడు కెఆర్‌ఎంబి త్రిసభ్య కమిటీ ప్రత్యేకంగా సమావేశమై నీటి విడుదల అంశంపై తుది నిర్ణయాన్ని వెలువరించనున్నది. సోమవారం నాటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగంపై తెలంగాణ చీఫ్ ఇంజనీర్లు త్రీవ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపి ఇప్పటికే ఎక్కువ నీటిని వాడుకుంటుందని, శ్రీశైలం నుంచి ఏపీ నీటి వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని తెలంగాణ చీఫ్ ఇంజనీర్లు బోర్డును కోరారు. దాంతో సాగర్ కింద పంటల దృష్ట్యా నీటి అవసరాలపై ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు మంగళవారం నాడు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలన్న కేఆర్‌ఎంబీ సూచించింది.
నేడు ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు భేటీ
కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ ఆదేశాల మేరకు మంగళవారం ఏపి, తెలంగాణ నీటిపారుదల శాఖ ఛీఫ్ ఇంజనీర్లు సమావేశం కానున్నారు. కృష్ణా బేసిన్‌లో ఇరురాష్ట్రాలకు ఉన్న నీటి కేటాయింపులు, ఇప్పటి వరకు జరిగిన నీటి వినియోగాలకు సంబంధించి గణాంకాల వివరాలతో అధికారులు పరస్పరం చర్చించుకునే అవకాశం ఉంది.