తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల కృష్ణంరాజు మృతి
పోస్టు కొవిడ్ సమస్యతో గత నెల 5న ఎఐజి ఆసుపత్రిలో చేరిక
చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున
3.25 గంటలకు తుదిశ్వాస విడిచిన రెబల్‌స్టార్
వెల్లడించిన ఎఐసి ఆసుపత్రి వైద్యులు
రేపు మొయినాబాద్ దగ్గర కనకమామిడి ఫామ్ హౌస్‌లో అంత్యక్రియలు
మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి ప్రముఖ నటుడు ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు(83) తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల మృతి చెందినట్లు ఎఐజీ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. పోస్ట్ కోవిడ్ సమస్యతో గత నెల 5వ తేదీన ఎఐజీ ఆస్పత్రిలో చేరిన కృష్ణంరాజు చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతికి గల కారణాన్ని ఏఐజీ దవాఖాన వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి. కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారని, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారని వైద్యులు పేర్కొన్నారు. గుండె కొట్టుకునే వేగంతో చాలా కాలంగా సమస్య ఉందని, రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగిందని తెలిపారు. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతోనూ బాధపడుతున్నారని, పోస్ట్ కోవిడ్ సమస్యతో గత నెల 5వ తేదీన దవాఖానలో చేరగా, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర నిమోనియా ఉన్నట్టు గుర్తించామని అన్నారు. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడం వల్ల హాస్పిటల్‌లో చేరిన నాటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించామని వివరించారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గమనిస్తూ తగిన వైద్యం చేశామని, ఆదివారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల కృష్ణంరాజు కన్నుమూశారని వైద్యులు తెలిపారు.
రేపు అంత్యక్రియలు
కాగా, కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం 1 గంటలకు చేవెళ్ల మొయినాబాద్ దగ్గర కనకమామిడి ఫామ్ హౌస్‌లో అంత్యక్రియలు జరుగుతాయని పేర్కొన్నారు.
Krishnam Raju dies of heavy cardiac attack: AIG Doctors