రెబల్ స్టార్ కృష్ణంరాజు పేరు వినగానే వెండి తెరపై నిండైన రూపం, గంభీరమైన స్వరం, ఆకాశం ఎర్రబడిందా అనిపించినట్టుగా ఉండే కళ్లు గుర్తుకు వస్తాయి. కృష్ణంరాజు నటన ఒక ఎత్తయితే .. ఆయన నవ్వు ఒక ఎత్తు. తెలుగు తెరను ఎంతమంది మహానటులు పలకరించిన వెళ్లినా ఆయన నవ్వుకంటూ ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక ఆయన డైలాగ్ డెలివరీ కూడా ప్రత్యేకమే. ఉద్వేగం, రౌద్రానికి సంబంధించి సన్నివేశాలలో కృష్ణంరాజు తన నట విశ్వరూపం చూపించేవారు. ఆయన తన విలక్షణ నటనతో రాజసం ఉట్టిపడే రెబల్‌స్టార్‌గా పేరుగాంచారు.
కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో 1940 జనవరి 20న ఆయన జన్మించారు. ఆయనకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు ప్రసీది,- ప్రకీర్తి-, ప్రదీప్తి ఉన్నారు. 1966లో ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన ‘చిలకా గోరింక’ చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు కృష్ణంరాజు. 187కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ‘అవేకళ్లు’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కృష్ణంరాజు 1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో ’తాండ్రపాపారాయుడు’ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.
మాస్, యాక్షన్ సినిమాలతో స్టార్‌డమ్…
కృష్ణంరాజు హీరోగా నిలదొక్కుకోవాలనుకునే సమయానికి పోటీ మామూలుగా ఉండేది కాదు. ఒక వైపున ఎన్టీఆర్. ఏఎన్నార్ మరో వైపున కృష్ణ, శోభన్ బాబు ఎవరి జోనర్‌లో వారు దూసుకుపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో తాను నిలదొక్కుకోవాలంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన జోనర్ కావలి. అందుకనే వాళ్లకి భిన్నంగా కృష్ణంరాజు మాస్ యాక్షన్ సినిమాలను ఎక్కువగా ఎంచుకోవడం మొదలుపెట్టారు. గ్రామీణ నేపథ్యంలోని రౌడీయిజంలోనే హీరోయిజం చూపించే పాత్రలకు కృష్ణంరాజు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. కృష్ణంరాజు దశాబ్దాల పాటు నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. భక్త కన్నప్ప, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు, విశ్వనాథనాయకుడు, బావ బావమరిది, ధర్మాత్ముడు, జీవన తరంగాలు, కృష్ణవేణి, హంతకులు దేవాంతకులు, రంగూన్ రౌడీ, కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు, టూ టౌన్ రౌడీ, పల్నాటి పౌరుషం వంటి సినిమాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేకమైనవిగా కనిపిస్తాయి. పీసీ రెడ్డి, వి. మధుసూదనరావు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావుల దర్శకత్వంలో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. ఇక ఆయన సరసన నాయికలుగా చాలామంది నటించినప్పటికీ హిట్ పెయిర్‌గా చూసుకుంటే జయసుధ, జయప్రద, రాధిక కనిపిస్తారు. కృష్ణంరాజు కెరీర్ ఆరంభం చాలా సినిమాల్లో విలన్‌గా నటించారు. అతను చివరికి హీరోగా రూపాంతరం చెందారు. ఆ రోజుల్లోనే లక్షలాదిగా యువకుల హృదయాలను గెలుచుకున్నాడు. కృష్ణంరాజులోని రెబలిజానికి జేజేలు పలికింది యూత్. అందుకే ఆయనను రెబల్ స్టార్ అనే బిరుదుతో సత్కరించారు. కృష్ణంరాజు చివరిసారిగా ప్రభాస్ సినిమా ‘రాధే శ్యామ్’లో నటించారు.
సొంత బ్యానర్ ఏర్పాటు…
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ .. ఈ ముగ్గురూ కూడా హీరోగా ఒక స్థాయికి వచ్చిన తరువాత సొంత బ్యానర్‌లను ఏర్పాటు చేసుకొని సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. కానీ కృష్ణంరాజు అలా కాదు. హీరోగా సరైన బ్రేక్ కోసం చాలా కాలం ఎదురు చూసిన తర్వాత ఆయన గోపీకృష్ణ మూవీస్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. సొంత నిర్మాణ సంస్థ ద్వారానే కృష్ణంరాజు నిలదొక్కుకున్నారు. అప్పట్లో ఆ బ్యానర్‌లో ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్. ఆయన సినిమాల్లో పాటలు కూడా బాగుంటాయనే పేరు ఉండేది.
తీరని కోరిక…
అబ్బాయ్ ప్రభాస్‌ని డైరెక్ట్ చేయాలన్నది పెదనాన్న కృష్ణంరాజు కోరిక. ప్రభాస్ కథానాయకుడిగా ఆయన గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ లో సోలోగా ఓ సినిమా తీయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ఒక్క అడుగు’ అనే టైటిల్‌ని కూడా చాలా కాలం క్రితం ప్రకటించారు. ‘బాహుబలి’ ప్రారంభానికి ముందే ఈ సినిమా ప్రారంభమవుతుందని అన్నారు. కానీ ఇప్పటివరకూ పట్టాలెక్కించలేకపోయారు.. మూడు, నాలుగేళ్ల క్రితం ఈ సినిమా గురించి కృష్ణంరాజు స్వయంగా వెల్లడించారు. ప్రభాస్ కటౌట్ కు అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ అయ్యిందని… చక్కని సామాజిక సందేశంతో కూడుకున్న సినిమా అవుతుందని… ‘ఒక్క అడుగు’తో వేయి అడుగుల పడేలా కథాంశం కుదిరిందని చెప్పారు. కృష్ణంరాజు స్వయంగా ఈ కథను సిద్దం చేసుకున్నట్లు వెల్లడించారు. కానీ ఇప్పటివరకూ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.
నంది అవార్డు అందుకున్న మొదటి ఉత్తమ నటుడు…
రెబల్ స్టార్ కృష్ణంరాజు 56 సంవత్సరాల సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగులో మొట్టమొదటి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్న ఘనత ఆయనకే దక్కింది. టాలీవుడ్ లో మొదటి సారిగా నంది అవార్డులను ప్రవేశపెట్టిన సంవత్సరం 1964. ఆ ఏడాది అక్కినేని నటించిన ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రానికి మొదటి సారిగా ఉత్తమ చిత్రం కేటగిరిలో రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్తమ పురస్కారమైన నంది అవార్డు దక్కింది. అయితే ఉత్తమ నటుడి పురస్కారాల్ని మాత్రం 1977 నుంచి మొదలు పెట్టారు. ఆ ఏడాది మొట్టమొదటి సారిగా ఉత్తమ నటుడి కేటగిరిలో నంది అవార్డు అందుకున్న మొట్టమొదటి హీరోగా కృష్ణంరాజు చరిత్రలో నిలిచిపోయారు. ఆ ఏడాది కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణంరాజు స్వీయనిర్మాణంలో నటించిన ‘అమరదీపం’ చిత్రంలోని ఆయన అద్భుత నటనకు గాను నంది అవార్డు అందుకున్నారు.
Krishnam Raju passed away at 83
రాజసం ఉట్టిపడే రెబల్‌స్టార్
- Advertisement -
- Advertisement -
- Advertisement -