Wednesday, January 22, 2025

దేవుడి సొత్తు పరుల పాలు

- Advertisement -
- Advertisement -

పోట్లి మహరాజ్ దేవాలయ భూమిలో అక్రమంగా
కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ నిర్మాణం
15 ఏళ్లుగా నామమాత్రం అద్దె చెల్లిస్తూ కొనసాగింపు
లోకాయుక్తను ఆశ్రయించిన భజన మండలి అధ్యక్షుడు
మున్సిపల్ మాజీ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త పలుకుబడితో ఆధిపత్యపోరు
దేవాదాయ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం: ఆలయ ఈఓ నరేందర్

మన తెలంగాణ/తాండూరు: దేవుడి సొత్తు పరుల పాలవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాండూరు పట్టణంలోని నడిబొడ్డున వినాయక చౌక్‌లోని పోట్లి మహారాజ్ దేవాలయం భూమిలో అక్రమంగా పాఠశాల నిర్మా ణం చేపట్టారు. దేవాలయానికి సంబంధించిన సుమారు 2 ఎకరాల స్థలం ఉండగా అందులో 16000 ఎస్‌ఎఫ్‌టి పీట్లలో కృష్ణవేణి కాన్సెప్ట్ ప్రైమరీ పాఠశాల నిర్మాణం చేపట్టారు. 2007-/2008లో పాత భవనం స్థలంలో కొత్త భవ నం నిర్మించి అప్పటి నుంచి నెలకు రూ.8500 చెల్లిస్తూ కొనసాగిస్తున్నారు.

కొత్త భవనం నిర్మాణం సమయంలో దేవదాయ శాఖ (ఎండోమెంట్) నుంచి, మున్సిపల్ కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా అక్రమ నిర్మాణం చేపట్టారు. పాఠశాల భవన నిర్మాణంతోపాటు మరో 30వేల ఎస్‌ఎఫ్‌టి ఫీట్ల స్థలంలో మైదానాన్ని విద్యార్థులకోసం ఉపయోగిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం గుడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలిగే విధంగా పాఠశాల యాజమాన్యం వ్యవహరిస్తుంది. గుడికి వచ్చే భక్తులు లోపలికి రాకుండా పాఠశాల నిర్వాహకులు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. గుడిపై మైకు పెట్టనివ్వకుం డా, కనీసం గుడిలో గంట కూడా కొట్టనివ్వడం లేదు. ఇలా పాఠశాల భవన నిర్మాణం చేపట్టినప్పటి నుంచి కొనసాగుతుంది.

10 ఏళ్ల క్రితం ఎండోమెంట్ అధికారులు ట్రిబునల్ కోర్టుకు వెళ్లారు. అయితే ఆలయ భజన మండలి అధ్యక్షులు ప్రభాకర్ మహారాజ్ అక్రమ పాఠశాల నిర్మాణంపై 2014లో లోకాయుక్తను ఆశ్రయించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పాఠశాల భవన నిర్మాణం చేపట్టారని, గుడి ప్రాంగణాన్ని అక్రమంగా ఉపయోగిస్తున్నారని లోకాయుక్తను ఆశ్రయించారు. అయితే పాఠశాలలో పాట్నర్‌గా ఉంటు న్న మాజీ మున్సిపల్ చైర్మన్ తనకు ఉన్న రాజకీయ , ఆర్థిక పలుకుబడితో ఆదిపత్యం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అనుమతి లేకుండా పాఠశాల భవన నిర్మాణం చేపట్టడమే కాకుండా ఖాళీగా ఉన్న స్థలాన్ని కూడా అక్రమంగా వాడుకుంటున్నారని ఆలయ పాలకమండలి ఆరోపిస్తుంది.

ట్రిబునల్ కోర్టులో ఉన్న కేసును ముందుకు సాగకుండా పాఠశాల యాజమాన్యం అడ్డువేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాల భవన నిర్మాణానికి, మైదానానికి కలుపుకుని ఎకరం పైగా భూమిని పాఠశాలకు ఉపయోగించుకుని నెలకు కేవలం రూ.8500 చెల్లిస్తున్నారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం చూస్తే ప్రతి నెలా సుమారుగా రూ.2.5 లక్షల నుండి రూ.3 లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఫైర్ స్టేషన్ అనుమతి సైతం లేకుండానే పాఠశాలను నడిపేందుకు విద్యాశాఖ అధికారులు ఎలా అనుమతించారని పాలక మండలి ప్రశ్నిస్తోంది. ఈ విషయంపై దేవదాయ శాఖ కమీషనర్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పాలక మండలి పేర్కొంటుంది. అయితే దేవాలయం స్థలంలో అక్రమంగా పాఠశాలను నిర్మించి రాజకీయ, అర్థిక బలంతో దేవాలయ సొత్తును తమ జెబులు నింపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. దేవుని భూమిని వ్యాపారంగా ఉపయోగించుకుని లాభాలను ఆర్జిస్తూ ట్రిబునల్ కోర్టులో ఉన్న కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

కృష్ణవేణి కాన్సెఫ్ట్ స్కూల్‌కు ఫైర్ అనుమతి లేదు: ఫైర్ స్టేషన్ ఎస్‌ఐ నాగార్జున

పాఠశాలకు తమ నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. 2017 నుంచి ఆన్‌లైన్ విధానం అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి కృష్ణవేణి కాన్సెప్ట్ పాఠశాలకు ఎలాంటి ఫైర్ ఎన్‌ఓసి ఇవ్వలేదు. పాఠశాలలు ప్రారంభించాక పూర్తి స్థాయిలో తగిన చర్యలు తీసుకుంటాం.

దేవాదాయ చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం: పోట్లి మహరాజ్ ఆలయ ఈఓ నరేందర్
దేవదాయశాఖ నిబంధనల ప్రకారం కిరా యిదారులు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. పోట్లీ మహారాజ్ దేవాలయం ఆవరణలో నిర్మించిన కృష్ణ వేణికాన్సెప్ట్ స్కూల్ నిర్మాణానికి కేవలం రూ.8500 మాత్రమే చెల్లిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం చెల్లించిన అద్దెలో సగం దేవదాయశాఖకు వెళ్లగా అందులో సగం తిరిగి పాఠశాల నిర్మాణం కోసం తీసుకుంటున్నారు. గతంలో ఏవిధంగా నిర్ణ యం తీసుకున్నారో తెలియదు. ప్రస్తుతం పాఠశాల భవన నిర్మాణానికి సుమారుగా లక్ష నుండి రూ.2లక్షల అద్దె రావాల్సి ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదే విధంగా దేవాలయానికి సంబంధించిన దుకాణాలకు సంబంధించి కూడా నిబంధనల ప్రకారం అద్దె పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News