హైదరాబాద్: భారత సంస్కృతి కళలు చాలా గొప్పగా ఉన్నాయని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా తెలిపారు. హైదరాబాద్‌లో తనకు చాలా గొప్పగా స్వాగతం పలికారని, తన హృదయంలో ఈ దేశానికి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నారు. నమస్తే ఇండియాతో ఆమె ప్రసంగం మొదలుపెట్టారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్ల గురించి నిర్వహించిన మీడియా సమావేశంలో క్రిస్టినా ప్రసంగించారు. తెలంగాణలో చాలా దేవాలయాలను సందర్శించానని పేర్కొన్నారు. భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం ఎంతో గొప్పగా ఉందని, ఎన్నో భాషలు ఉన్న అంతా కలిసి మెలిసి ఒక్కటిగా ఉండడం అనేది స్ఫూర్తినిస్తుందని మెచ్చుకున్నారు. మిస్ వరల్డ్ కూడా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని తెలిపారు. ఇక్కడ ట్రెడిషన్ చాలా బాగా నచ్చిందన్నారు.
72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదికగా మారింది. మిస్ వరల్డ్ పోటీల్లో 140 దేశాల నుంచి అందాల బామలు పాల్గొంటారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడారు. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణను అవకాశంగా తీసుకోవాలని, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ సిఎం రేవంత్ రెడ్డి ఆలోచన నుంచి వచ్చిందని, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించవచ్చన్నారు. సుమారు 140 దేశాల వారు ఇక్కడికి వస్తారని ప్రపంచం దృష్టి తెలంగాణ రాష్ట్రంపై పడుతుందని వివరించారు. అందాల పోటీ లు అంటే ఇంకో కోణంలో చూడొద్దని ఇది ఎంతో మంది అమ్మాయిలకు, మహిళలకు, మనోధైర్యం, సంకల్పం ఇస్తుందని జూపల్లి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా, టిజిటిడిసి చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ హాజరయ్యారు.