Monday, December 23, 2024

జవాబు చెప్పండి?

- Advertisement -
- Advertisement -

(1) విభజన చట్టం హామీలు ఏమయ్యాయి (2) కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సంగతేంటి (3) గుజరాత్ పక్షపాతమెందుకు (4) కేంద్ర విద్యాలయాల కేటాయింపులో వివక్ష (5) మెడికల్ కాలేజీ నిరాకరణ (6) బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ ఏమైంది (7) పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వడం లేదు (8) హైదరాబాద్‌పై వివక్షకు ఐటిఐఆర్ రద్దు పరాకాష్ట కాదా (9) ఐటి అభివృద్ధికి మీరు చేసిందేమిటి (10) పోవడంతో యువతకు దక్కని ఉద్యోగాలపై ఏం చెబుతారు (11) సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఎందుకు ఇవ్వలేదు (12) పాలమూరురంగారెడ్డికి జాతీయ హోదా హామీని ఎందుకు అమలు చేయరు (13) కృష్ణ నీటి వాటాపై బ్రజేష్ ట్రిబ్యునల్‌కు నివేదించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారు (14) కర్నాటక ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం, తెలంగాణ పట్ల అన్యాయం కాదా (15) రాజ్యాంగబద్ద నిధులివ్వడం మినహా తెలంగాణకు ప్రత్యేకించి చేసిందేమిటి (16) మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు గ్రాంటు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సును ఎందుకు బుట్టదాఖలు చేశారు (17) వేల కోసం రక్షణశాఖ భూముల అభ్యర్థనను ఏడేళ్లుగా ఎందుకు తొక్కిపెడుతున్నారు (18) అధికారంలో గల రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళనకు వేల కోట్లు ఇస్తూ, మూసీ అభివృద్ధికి మూడు పైసలైనా ఎందుకు కేటాయించలేదు (19) వేల కోట్ల వరద సాయం అందించి హైదరాబాద్‌కు మొండిచేయి (20) ఫార్మా సిటీకి ఎందుకు సాయం చేయరు (21) కారిడార్‌ను ఎందుకు మంజూరు చేయడం లేదు (22)తెలంగాణ చేనేత రంగంపై ఎందుకీ శీతకన్ను (23) ధాన్యం కొనుగోలుపై ఢిల్లీ వేదికగా విజ్ఞప్తి చేసినా ఎందుకు పట్టించుకోలేదు (24) బోర్డును ఎందుకివ్వడం లేదు (25)పెట్రోల్‌పై సెస్‌ను తొలగించి ధరలను తగ్గిస్తారో లేదో తెలంగాణ గడ్డమీద నుంచి స్పష్టం చేస్తారా (26)ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో పెడుతున్నామని చెప్పి గుజరాత్‌కు ఎందుకు తరలించారు (27) ఆర్బిట్రేషన్ సెంటర్‌కు ఒక్క పైసా ఇవ్వకుండా, గుజరాత్‌లో మరో సెంటర్‌ను ఎందుకు పెట్టారు?

తెలంగాణకు అన్నిటా అన్యాయంపై అమిత్ షాకు కెటిఆర్ 27ప్రశ్నలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న 27 అన్యాయాలపై నిలదీస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు బహిరంగ లేఖ రాశారు. శనివారం నాడు అమిత్ షా రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా మంత్రి ఈ లేఖను సంధించారు. నిజంగా అమిత్‌షాకు రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కెటిఆర్ సవాల్ విసిరారు. సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణపై బిజెపి పార్టీ కక్షపూర్వకంగా వ్యవహరిస్తోందని బహిరంగ లేఖలో కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కేంద్రం కడుపు నింపుతున్నా (పన్నుల రూపంలో నిధులు) మా (తెలంగాణ) కడుపు కొట్టడం మాత్రం మానలేదని తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతిసారి వచ్చుడు.. స్పీచులు దంచుడు.. విషం చిమ్ముడు.. మళ్లీ పత్తా లే కుండా పోవుడు’ ఇదే బిజెపి కేంద్ర నాయకులకు అలవాటుగా మారిందని కెటిఆర్ దుయ్యబట్టారు. ఇంకెంతకాలం రాష్ట్రంపై ఈ నిర్లక్ష్య ధోరణి అని నిలదీశారు.

తెలంగాణకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చని కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌కు మాత్రం ఇ వ్వని హామీలు కూడా ఆగమేఘాల మీద అమలు చే యడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని ప్రశ్నించడం బిజెపికే చెల్లిందని ఆ లేఖలో కెటిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి తెలంగాణ గడ్డపై అమిత్ షా అడుగుపెడుతున్న వేళ.. చట్టంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రజల సాక్షిగా కేంద్రం దృష్టికి తేవడంతో పాటు, వాటి కోసం తెగేదాక కొట్లాడటం మా (టిఆర్‌ఎస్) బాధ్యత అని అన్నారు. అందుకే తెలంగాణ సమాజం ముక్తకంఠంతో నినదిస్తున్న అనేక కీలక అంశాలు మీ దృష్టికి తీసుకువస్తున్నానని కెటిఆర్ పేర్కొన్నారు. ఎన్ని చెప్పినా, ఎంత ప్రశ్నించినా మీ తెలంగాణ వ్యతిరేక వైఖరిలో మార్పు రాదని రాష్ట్ర ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారన్నారు. గుజరాత్‌పై వల్లమాలిన ప్రేమను.. తెలంగాణపై అదే సవతి తల్లి ప్రేమను ఇలాగే కొనసాగిస్తే బిజెపి పార్టీ తెలంగాణ ప్రజాక్షేత్రంలో అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కెటిఆర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజం మీ నుంచి అనేక ప్రశ్నలకు జవాబులు కోరుతున్నట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు.

1.విభజన చట్టంలో రాష్ట్రానికి కొన్ని నిర్దిష్టమైన హామీలను పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ అంటే ప్రేమ ఉన్నట్టు చెప్పుకున్న మీ పార్టీ అధికారంలోకి వచ్చినంక ఆ హామీలను నెరవేర్చేందుకు చేసిన ప్రయత్నం ఏమిటి? విభజన చట్టంలో చెప్పిన ఏ ఒక్క హామీ అయినా మీ ప్రభుత్వం నెరవేర్చిందా?

2.కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలన్నది దశాబ్దాల డిమాండ్. ఇదే విషయాన్ని ఎన్నో సార్లు మేం అడిగితే దేశంలో కోచ్ ఫ్యాక్టరీలకు డిమాండ్ లేదని కేంద్రంలోని మీ ప్రభుత్వం చేతులు దులుపుకున్నది వాస్తవం కాదా?

3. కాని నిన్న మొన్ననే రూ. 20వేల కోట్లతో మీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం తెలంగాణ పై మీకున్న చిన్నచూపుకు నిదర్శనం కాదా? మీ గుజరాత్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఎలా వస్తుంది? మా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టరో చెప్పగలరా?

4.తెలంగాణ రాష్ట్రానికి ఎన్‌డిఎ ఆధ్వర్యంలోని కేంద్రం ఇచ్చిన ఒక్క విద్యా సంస్థ పేరైనా మీరు చెప్పగలరా? ఐఐఎం, ఐసర్, ఎన్‌ఐడి, ట్రిబుల్ ఐటీ, గిరిజన విశ్వవిద్యాలయం, నవోదయ విద్యాలయాల్లో ఏ ఒక్కటి కూడా తెలంగాణకు ఎందుకు కేటాయించలేదో సమాధానం చెప్పగలరా?

5.గుజరాత్‌లో ఓ మెడికల్ విద్యార్థికి అడ్మిషన్ సమయంలో అన్యాయం జరిగిందని బాధపడిన ప్రధాన మంత్రి మోడీ అన్న వార్తలు చూసాము. అర్హత కల విద్యార్థికి అన్యాయం జరిగితే ప్రధాని స్పందించడం బాగుంది. కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదు. ఫలితంగా లక్షలాది తెలంగాణ బిడ్డలు మెడిసిన్ చదువుకోలేకపోతున్నారు. మరి మా బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ప్రధానమంత్రి మోడీకి, మీకు ఎందుకు బాధ కలగడం లేదు?

6.విభజన చట్టం ప్రకారం కేంద్రం బయ్యారంలో ఉక్కు ప్యాక్టరీ ని ఏర్పాటుచేయాలి. తెలంగాణ బాగుపడితే చూడలేని మీ కక్షపూరిత వైఖరితో న్యాయంగా దక్కిన ఆ హామిని ఎందుకు తుప్పు పట్టించారో చెపుతారా?

7.కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలుస్తున్నది. విభజన చట్టంలో ఉన్న పారిశ్రామిక రాయితీలను తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు?

8.ఐటి రంగంలో హైదరాబాద్ సాధిస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలన్న మీ పార్టీ, ప్రభుత్వ కుట్రలకు ఐటిఐఆర్ రద్దు పరాకాష్ట కాదా?

9.ఐటిఐఆర్ ను రద్దు చేసిన మీరు అందుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం అద్వర్యంలో హైదరాబాద్ నగరంలో ఐటి అభివృద్ధి కోసం చేపట్టిన ఒక్క కార్యక్రమాన్ని అయినా చెప్పగలరా?

10.ఐటిఐఆర్ పోవడంతో ఇక్కడి యువతకు దక్కకుండా పోయిన ఉద్యోగాలపై ఏం సమాధానం చెబుతారు ?

11.దేశ ఐటి రంగలో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో ఐటి అభివృద్ధి కోసం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పారక్స్ ఎందుకు ఇవ్వడంలేదు?

12.పాలమూరురంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014 ఎన్నికల సభలో సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు గడిచినా మీరు ఇచ్చిన హామీనే ఎందుకు అమలు

13.తెలంగాణకు దక్కాల్సిన 575 టిఎంసిల సాగునీటి వాటాల కేటాయింపులపై తెలంగాణ కోరుతున్న విధంగా బ్రిజేష్ కూమార్ ట్రిబ్యునల్‌కు రెఫర్ చేయకుండా 8 ఏళ్లుగా ఎందుకు తాత్సారం చేస్తున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు అనే ఒక శిఖండి సంస్థను ఏర్పాటు చేసి, తెలంగాణకు సాగునీటి జలాల హక్కులు దక్కకుండా తాత్సారం చేస్తున్న మీరు, మీ వివక్షపూరిత తీరుపై ఏం చెప్తారు?

14. 2014లో జరిగిన ఎన్నికల సభలో సుష్మా స్వరాజ్ పాలమూరురంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తామంటూ పేర్కొన్న మీ పార్టీ ప్రకటించిన హామీకి ఎందుకు కట్టుబడి ఉండడం లేదు. ఈ విషయంలో పాలమూరురంగారెడ్డి రైతన్నలకు ఏ సమాధానం చెప్తారు? మరోవైపు పక్కనున్న కర్నాటక అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇస్తానని ప్రకటించడం తెలంగాణ రైతాంగం మీకున్న వివక్ష పూరిత వైఖరికి నిదర్శనం కాదా?

15.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి దక్కాల్సిన నిధులు కాకుండా ప్రత్యేకంగా రాష్ట్రానికి చేసిన సహాయం ఏమిటో సమాధానం చెప్పాలి?

16.మిషన్ కాకతీయ, భగీరథ వంటి దేశ చరిత్రలో ఎన్నడూ ఎరుగని విప్లవాత్మక ప్రాజెక్టులకు రూ.24 వేల కోట్లు గ్రాంట్ ఇయ్యమంటూ సాక్షాత్తూ నీతి ఆయోగ్ రికమెండ్ చేసినా ఇప్పటిదాకా పైసా విదల్చని మీ పక్షపాత వైఖరిపై ఏం చెప్తారు?

17.స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములు అడిగితే ఏడేళ్లుగా తొక్కిపడుతూ నగర పౌరులను అవస్ధలకు గురిచేస్తున్నది నిజం కాదా?

18. దేశంలో మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని నది ప్రక్షాళన ప్రాజెక్టుకు వేల కోట్లు కేటాయించుకుంటూ, మా మూసీ ప్రక్షాళన, అభివృద్ధికి మూడు పైసలు కూడా కేటాయించనిది నిజం కాదా?

19.హైదరాబాద్ నగరంలో చరిత్రలో ఎన్నడూ ఎరగని వరదల్లో మునిగితే గుజరాత్‌కు వేల కోట్ల వరద సాయం అందించి, హైదరాబాద్‌కు మొండిచేయి చూపించి, నయాపైసా ఇవ్వకుండా, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని హైదరాబాద్ వస్తున్నారు? ఇది మీకు సిగ్గుచేటు కాదా?

20.కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రపంచానికి తన ఫార్మా రంగం బలంలో అండగా నిలిచి, వ్యాక్సిన్ల తయారీతో భారత దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన హైదరాబాద్ ఫార్మా రంగానికి అయువు పట్టుగా నిలిచేలా మేము ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీకి ఎందుకు సహాయం అందించడం లేదు?

21.ఇకో సిస్టం దిక్కులేని చోటకు డిఫెన్స్ ఇండస్త్రియల్ కారిడార్ తరలించి, అగ్రగామి ఎయిరోస్పేస్, డిఫెన్స్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న తెలంగాణకు ఢిపెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయడం

22. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్ పార్కు కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్ర టెక్స్ టైల్ రంగానికి చేయూత ఇయ్యకుండా, ఒక్క మెగా పవర్ లూం టెక్స్ టైల్ క్లస్టర్ కూడా ఇవ్వకుండా శీతకన్ను వేసింది నిజం కాదా?

23. రాష్ట్ర రైతులు తమ ధాన్యాన్ని పంజాబ్ మాదిరే కొనుగోలు చేయాలని, ఢిల్లీ వేదికగా కోరినా ఎందుకు కొనుగోలు చేయడం లేదు?

24.మీ ఎంపి ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్‌పై ప్రజలకు రాసిచ్చిన హామీని తుంగలో తొక్కి ఇప్పటికీ నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు ఇవ్వాల్సిన పసుపు బోర్డు ఎందుకిస్తాలేరో చెప్పగలరా?

25. దేశ ప్రజల నడ్డి విరిచేలా పెంచుతున్న పెట్రో ధరల పైన అసలు కారణమైన సెస్సులను రద్దు చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని మా ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన డిమాండ్ విషయంలో మీ వైఖరి స్పష్టం చేస్తారా? మీరు దేశ ప్రజానీకంపై మోపిన సెస్సుల భారాన్ని రద్దు చేసి పెట్రో ధరలను తగ్గిస్తారో లేదో తెలంగాణ గడ్డ మీద నుంచి స్పష్టం చేస్తారా?

26. హెల్త్ ఆర్గనైజేషన్ వారి ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ హైదరాబాద్‌లో పెట్టబోతున్నామని మీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కానీ దాన్ని సైతం గుజరాత్‌కు తీసుకెళ్లిన మీ గుజరాత్ పక్షపాత వైఖరి కాదా?

27. హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్‌కు ఒక్కపైసా సహాయం చేయకపోగా, పోటీగా గుజరాత్‌లో మరో సెంటర్‌ను పెట్టిన మాట వాస్తవం కాదా? కెటిఆర్ నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News