రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను, అన్యాయాలను ఎండగడతాం కెసిఆరే
స్వయంగా ముందుండి పోరాడుతానని ప్రకటించడంతో శ్రేణుల్లో
ఉరకలెత్తుతున్న ఉత్సాహం రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది
బిఆర్‌ఎస్సే వరంగల్ సభకు లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు చెబుతున్న
సందేశం ఇదే రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ
ధన్యవాదాలు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సందర్భంగా వరంగల్‌లో జరిగిన బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు, సభను విజయవంతం చేయడంలో కీలకపాత్ర వహించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సభను లక్షల సంఖ్యలో ప్రజలు సభకు హాజరై, కెసిఆర్ నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించారని కొనియాడారు. ఆదివారం సభ ద్వారా భారత రాష్ట్ర సమితి మరోసారి అధికారంలోకి రాబోతోందని స్పష్టమైందని అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద బహిరంగ సభల్లో ఒకటిగా ఈ రజతోత్సవ సభ నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్ ప్రజా బలాన్ని ఈ సభ మరోసారి నిరూపించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ట్రాఫిక్ నిర్వహణలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం విఫలమైనప్పటికీ, లక్షలాది మంది ప్రజలు ముందే సభ ప్రాంగణానికి చేరుకోవడం తెలంగాణ ప్రజల నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.
భారీ ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ, సభ విజయవంతంగా పూర్తి కావడం గర్వకారణమని తెలిపారు. ఆదివారం జరిగిన ఈ సమావేశం రజతోత్సవ సమావేశాల కార్యక్రమాలకు కేవలం ప్రారంభం మాత్రమేనని అన్నారు. కెసిఆర్ స్వయంగా తానే ముందుండి పోరాడతాను అని ప్రకటించడంతో, భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని కెటిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని, ఇకపై ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని వెంటాడుతామని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యపరిచేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను, దోపిడీ చర్యలను మీడియా ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే అరాచకాలను, వారి ప్రచారాలను ఎక్కడికక్కడ ఎదుర్కొని ప్రజల్లో స్పష్టత తీసుకురావాలని, మరింత చురుకుగా ముందుకు సాగాలని తెలిపారు.
పార్టీ శ్రేణులతో కెటిఆర్ టెలి కాన్ఫరెన్స్
బిఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ నాయకులతో పాటు పార్టీ శ్రేణితో వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున స్పందించి సభ విజయవంతం కావడంలో మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రత్యేక కృషి చేసిన వరంగల్ జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు హుస్నాబాద్ మాజీ ఎంఎల్‌ఎ, పార్టీ కార్యకర్తలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభా ప్రాంగణం వద్ద గత నెల రోజులుగా నాయకులు, కార్యకర్తలు చేసిన కృషి ఫలితంగా ఈ సభ ఎంతో విజయవంతంగా జరిగిందని పేర్కొన్నారు. నాయకులందరి నిబద్ధత, కృషి వల్లనే ఇంత భారీ సభ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముగిసిందని ప్రశంసించారు.
స్థానిక శాసనసభ నియోజకవర్గాల ఇంచార్జ్‌లు, జిల్లా అధ్యక్షుల సమన్వయంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి కార్యకర్త సురక్షితంగా తమ ఇండ్లకు చేరుకున్నారని, ఇందుకోసం శ్రమించిన ప్రతి నాయకునికి, కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు ప్రతి ఒక్కరూ సభ విజయవంతం కావడానికే పని చేశారని కెటిఆర్ అభినందించారు. ఈ భారీ బహిరంగ సభను పక్కా ప్రణాళికతో, ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతం చేయగలిగామని పేర్కొన్నారు. సభ విజయవంతం కావడానికి కృషి చేసిన భారత రాష్ట్ర సమితి నాయకులకు, పార్టీ శ్రేణులకు, దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించిన సీనియర్ నాయకులకు, సోషల్ మీడియా వారియర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వీరందరి కృషితో ఈ చారిత్రాత్మక సభ మరువలేని ఘట్టంగా నిలిచిందని చెప్పారు. అదేవిధంగా, మంచి కవరేజ్‌తో సభా కార్యక్రమాలను ప్రజలకు అందించిన మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.