Monday, December 23, 2024

చదవండి.. సాధించండి

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కొలువుల కుంభమేళా!
ఇచ్చిన హామీలకు మించి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
యువత ఆకాంక్షల బంగారు భవిత కోసమే ప్రభుత్వం
కష్టపడి చదవండి! కలల్ని నిజం చేసుకోండి!!
యువతకు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఆత్మీయ లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తెలంగాణ రాష్ట్రం దేశ చరిత్రను సరికొత్తగా లిఖించబోతుందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఎన్నో ఆంక్షల నడుమ స్వరాష్ట్రంలో స్వపరిపాలనను మొదలుపెట్టి తొమ్మిది ఏండ్ల వ్యవధిలో సుమారు రెండు లక్షల 25వేల పైచిలుకు ఉద్యోగాల కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని పేర్కొన్నారు. వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ ఇవాళ దేశంలో నవశకానికి నాంది పలికిందన్నారు.ఈ విషయాన్ని చెప్పడానికి తనకు ఎంతగానో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావాన్ని అందిపుచ్చుకుందన్నారు. ఈ మేరకు రాష్ట్ర యువతకు రాసిన ఆత్మీయ లేఖలో కెటిఆర్ స్పష్టం చేశారు.

మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదు, సంఘర్షణకు ప్రతిరూపమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఉద్యమకాలంలో, అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్నదన్నారు. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ హామీకి అనుగుణంగా 1లక్షా 35వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను మొదటిసారి అధికారంలోకి రాగానే కెసిఆర్ నాయకత్వంలో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ప్రజల ఆశీస్సులతో మరోసారి అధికారంలోకి వచ్చాక, 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత నిబద్ధతతో వేగంగా చేపట్టామని వివరించారు.

ఇప్పటికే సుమారు 32వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చామని కెటిఆర్ తెలిపారు. గురుకుల విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను అతి త్వరలో విడుదల చేయబోతున్నామన్నారు. మొత్తంగా రెండు లక్షల 25వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను అతితక్కువ సమయంలో భర్తీ చేసి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవబోతుందన్నారు. ఉద్యోగాల భర్తీలో స్థానికులకే అధిక ప్రాధాన్యం దక్కాలన్న ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడానికి సిఎం కెసిఆర్ ఎనలేని కృషి చేశారని కెటిఆర్ తెలిపారు. ఇందుకు అడ్డంకిగా ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల సవరించడంతో ఆఫీస్ సబార్డినేట్ నుండి ఆర్‌డిఒ వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కుతున్నాయన్నారు.

ఉద్యమ స్పూర్తి ఫలించింది
సిఎం కెసిఆర్ తెచ్చిన కొత్త జోనల్ వ్యవస్థతో తెలంగాణ ఉద్యమ స్పూర్తి ఫలించిందన్నారు. దీంతో పాటు విద్యార్థులు, యువకుల కోరిక మేరకు కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం వమోపరిమితిని సడలించిందన్నారు. తద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పాల్గొనేందుకు మరింత మందికి అవకాశం దక్కిందన్నారు. నిరుద్యోగ యువత కోసం ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే, ఏళ్ళ తరబడి ప్రభుత్వ వ్యవస్థతో కలిసి పని చేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులను క్రమబద్ధీకరించామన్నారు. త్వరలోనే మరో 10 వేల మంది ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరించనున్నామన్నారు.
ఉద్యోగ ప్రకటనల జారీతో పాటు వేగంగా వాటిని భర్తీ చేసేందుకు గతంలో లేని భిన్నమైన నియామక ప్రక్రియను టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్నదన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో మాత్రమే కాకుండా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ , గురుకుల విద్యా సంస్థలతో ప్రత్యేక బోర్డుల ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వికేంద్రీకరించామన్నారు. ఫలితంగా సంవత్సరాల పాటు సాగే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సమూలంగా మారి నియామకాలు వేగంగా జరుగుతున్నాయని కెటిఆర్ వెల్లడించారు.

పారదర్శత కోసమే ఇంటర్వూ విధానానికి స్వస్తి
తెలంగాణ ఏర్పడక ముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలు భర్తీ చేసిన ఉద్యోగాల నియామక ప్రక్రియ పై సైతం ఎన్నో ఆరోపణలు, వివాదాలు నడిచాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఉద్యోగాన్ని అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని ఎంతో గర్వంగా చెబుతున్నానని అన్నారు. ఎలాంటి వివక్షకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతో గ్రూపు వన్ ఉద్యోగాలలోనూ ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలికామని కెటిఆర్ తెలిపారు. అందుకే ఇప్పటిదాకా టిఆర్‌ఎస్ ప్రభుత్వం నింపిన ఉద్యోగాల భర్తీలో పారదర్శకత అంశంపై ఎవరికీ ఎలాంటి అనుమానం లేదన్నారు. అందుకే గతానికి భిన్నంగా ఇప్పటిదాకా ఈ అంశంపై ఒక్క వివాదం నెలకొనలేదని కెటిఆర్ తెలిపారు.

యువత కోస అద్భుతమైన ఆవిష్కరణలు
కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే గాక, ప్రైవేట్ రంగంలోనూ భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం మెరుగుపరిచిందన్నారు. ఇప్పటిదాకా సుమారు 17 లక్షలమందికి పైగా ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదేనని అన్నారు. ఇవే కాకుండా అద్భుతమైన ఆవిష్కరణల ఆలోచనలతో ఉన్న ఔత్సాహిక యువత కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా స్టార్టప్ ఇకో సిస్టంను తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పరిచిందన్నారు. వినూత్నంగా ఆలోచించే యువతకు అండగా ఉండేందుకు టి-హబ్, టి-వర్క్, వి-హబ్, టిఎస్‌ఐసి వంటి వేదికలను ఏర్పాటు చేసిందన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల నేపథ్యంలో సిఎం కెసిఆర్ సూచన మేరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత స్థాయిలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువత కోసం కోచింగ్ సెంటర్లను ఇతర వసతులను ఏర్పాటు చేశారన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల తరఫున నిరుద్యోగులకు శిక్షణా తరగతుల నిర్వహణ కూడా ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్నదన్నారు. నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడే లైబ్రరీల బలోపేతానికి సైతం కొన్ని సంవత్సరాలుగా మా ప్రభుత్వం చేస్తున్న కృషి ఇవాళ ఫలించింది. నిరుద్యోగ యువత ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని కోరుతున్నానని కెటిఆర్ పేర్కొన్నారు.

పనికిమాలిన ప్రచారాన్ని పట్టించుకోకండి
రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగపర్వం నడుస్తున్నదని కెటిఆర్ అన్నారు. కెసిఆర్ ఆశయానికి అనుగుణంగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువతకు తానిచ్చే సలహా ఒక్కటేనని… పనికిమాలిన ప్రచారాలను పట్టించుకోవద్దన్నారు. అవకాశవాద, అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా లక్ష్యం మీదనే గురి పెట్టాలని సూచించారు. సానుకూల దృక్పథంతో సాధన చేసి, స్వప్నాలను సాకారం చేసుకోవాలని అభిలాషించారు. కాలం మళ్లీ తిరిగి రాదన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఏకాగ్రతతో అభ్యసించి.. లక్ష్యాన్ని చేరుకోండన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు అత్యధిక జీతాలను చెల్లిస్తున్నదని గుర్తు చేశారు.

ఆ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోవాలన్నారు. ఇందుకోసం ఆత్మవిశ్వాసం, పట్టుదల, ప్రణాళికతో చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించండన్నారు. దీంతో ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోవాలన్నారు. ఇప్పటిదాకా ఒక ఎత్తు. ఇప్పుడు ఇంకోఎత్తు అని అన్నారు. ప్రాణం పెట్టి చదవండి.. మీ తల్లిదండ్రులు, మిమ్మల్ని నమ్మకున్న ఆత్మీయుల స్వప్నాలను నిజం చేయాలన్నారు. తెలంగాణ యువతకు ఆకాశమే హద్దన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అని కెటిఆర్ అన్నారు. మీ ప్రయత్నాలు సఫలం కావాలని ఒక సోదరుడిగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని ఆదివారం విడుదల చేసిన ఒక ఆత్మీయ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News