Wednesday, November 6, 2024

బావమరిది పేరిట భారీ అవినీతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సకుటుంబ సపరివార అవినీతి కథా చిత్రం నడుస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. అమృత్ టెండర్లలో సిఎం కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మున్సిపాలిటీల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందిచిన అమృత్ పథకంలో సిఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి చేశారని ఆరోపించారు. సిఎం తన అధికారాన్ని ఉపయోగించి తన బావమరిదినికి పనులు అప్పగించారని అన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ నేతలు మధుసూదనాచారి, వద్దిరాజు రవిచంద్ర, మహమూద్ అలీ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులతో కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం, సిఎం రేవంత్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి బావమరిది సూదిని సృజన్ రెడ్డికి చెందిన శోదా కంపెనీకి అర్హతలు లేకున్నా వేలకోట్ల రూపాయలు పనులను కట్టబెట్టారని ఆరోపణలు చేశారు. ఈ స్కాం రూ. 8,888 కోట్లు ఉంటుందని, ఈ కుంభకోణంపై విచారణ జరిపిస్తే రేవంత్ రెడ్డి సిఎం పదవి పోతుందని వ్యాఖ్యానించారు.

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ చట్టం సెక్షన్ 7,11,13 ప్రకారం సిఎం, ప్రజాప్రతినిధులు తన కుటుంబ సభ్యుల కోసం ఆశ్రిత పక్షపాతం చూపుతూ అధికార దుర్వినియోగం చేస్తే ప్రాసిక్యూట్ చేయవచ్చని చెబుతోందని అన్నారు. ఈ చట్టం ప్రకారం గతంలో సోనియా గాంధీ కూడా పదవి కోల్పోయారని చెప్పారు. కర్ణాటక మాజీ సిఎం యడ్యూరప్పకు ఇదే పరిస్థితి వచ్చిందని, మహారాష్ట్ర మాజీ సిఎం అశోక్ చవాన్ కూడా రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. ఈ చట్టం ప్రకారమే సిఎం రేవంత్‌కు ప్రాసిక్యూట్ తప్పదని పేర్కొన్నారు. ఇండియన్ హ్యూమ్ పైప్(ఐహెచ్‌పి) అనే కంపెనీని పిలిపించి బెదిరించి.. ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారని ఆరోపించారు. పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయినా రేవంత్ రెడ్డి బావమరిది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారని, ఇందులో టెండర్ దక్కించుకున్న సదరు కంపెనీతో రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీ జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకు తెరలేపారని అన్నారు.

రూ.1,137 కోట్ల కాంట్రాక్టు గెలుచుకున్న తర్వాత ఆ కంపెనీ 20 శాతం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి బావమరిది మాత్రం 80 శాతం పని చేస్తోందని తెలిపారు. ఐహెచ్‌పీని శిఖండిలా వాడుకొని రేవంత్ రెడ్డి, సృజన్ రెడ్డి అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. రూ.2 కోట్ల లాభం ఉన్న సృజన్‌రెడ్డి కంపెనీ రూ.వెయ్యి కోట్ల పనులు ఎలా చేస్తుందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఇంత పెద్ద భారీ కుంభకోణానికి రేవంత్ రెడ్డి పాల్పడ్డారని మండిపడ్డారు. తాను బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించిన పురపాలక శాఖ కేంద్రంగా రేవంత్ రెడ్డి ఈ కుంభకోణాన్ని చేశారని పేర్కొన్నారు.
బావమరిది కళ్లల్లో ఆనందం కోసం అవినీతికి తెరలేపారు
సిఎం రేవంత్‌రెడ్డి బావమరిది, తమ్ముళ్లకు అమృతం, ప్రజలకు విషం అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు తయారయ్యాయని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బావమరిది కళ్లల్లో ఆనందం, ఇళ్లలో లంకె బిందెల కోసం రేవంత్ రెడ్డి ఐహెచ్‌పిసి అడ్డం పెట్టుకొని అవినీతికి తెర లేపారని విమర్శించారు. అమృత్ పథకం కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పథకం అని, ఫిబ్రవరిలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టడం లేదని ధ్వజమెత్తారు. అమృత్ టెండర్లలలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతి పాల్పడ్డారని, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు లేఖ రాశానని పేర్కొన్నారు.

సిఎం రేవంత్ ప్రమేయం లేకుండా సాధ్యం కాదు
ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ఈ కుంభకోణం సాధ్యం అవుతుందా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. సిబిఐ, ఇడి, సివిసి ఎవరైనా విచారణ చేసుకోవచ్చని, ప్రజాధనం కాపాడుకోవాలని అన్నారు. సిఎం కూడా దీనికి సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపిలు ఉన్నారని, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారని, ఈ కుంభకోణంపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కు కాకపోతే కేంద్రం టెండర్లు రద్దు చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆధారాలు బయటపెడుతున్నా కేంద్రం మౌనంగా ఉంటే రేవంత్ రెడ్డితో పూర్తి అవగాహన ఉన్నట్లేనని అన్నారు. కేంద్రం విచారణ జరిపిస్తే అన్ని అంశాలు బయటకు వస్తాయని వివరించారు. కాంగ్రెస్ సిఎంపై బిజెపికి ప్రేమ లేకపోతే కేంద్రం విచారణకు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. ఇక నుంచి కాంగ్రెస్ కుంభకోణాలను వరుసగా బయటపెడతామని అన్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, ఫోర్త్ సిటీలో అవకతవకలు, హైడ్రాను అడ్డం పెట్టుకొని ఎలా బెదిరింపులకు పాల్పడుతున్నారో తదితర అంశాలతో పాటు ప్రభుత్వ అక్రమాలన్నీ బయటపెడతామని కెటిఆర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News