Monday, January 20, 2025

అధికారపక్షం చేసిన ఆరోపణలపై కెటిఆర్, హరీశ్ రావుల ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

అధికార సభ్యులతో పాటు సిఎం వ్యాఖ్యలకు
సమాధానం ఇచ్చిన మాజీ మంత్రులు

మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యుత్ శాఖపై గురువారం అసెంబ్లీ జరిగిన స్వల్పకాలిక చర్చలో మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్ రావులు అధికారపక్షం చేసిన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార సభ్యులతో పాటు సిఎం చేసిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు. సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీ ప్రజలు కరెంట్ బిల్లులు కట్టలేదు. ఇక బిఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్, టిడిపి, ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందని రేవంత్ వ్యాఖ్యానించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిద్దిపేట, గజ్వేల్, ఓల్ట్ సిటీ ప్రజల మీద సిఎం రేవంత్ అక్కసు వెళ్లగక్కే ప్రయత్నం చేశారని హరీశ్ రావు ఆరోపించారు. సిద్దిపేటలో, గజ్వేల్, ఓల్ట్ సిటీలో కాంగ్రెస్ గెలవలేదన్న బాధలో రేవంత్ ఉన్నారని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. అక్కడ గెలవలేదన్న బాధతోనే అక్కడి ప్రజలు బిల్లులు కట్టలేదని పేర్కొనడం వాస్తవం కాదని హరీశ్ రావు పేర్కొన్నారు. అక్కడ ఏదన్నా ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉందో, ఒక ఇండస్ట్రీయలిస్ట్ ఎవరన్నా కట్టకపోతే, ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప తమ నియోజకవర్గ ప్రజలను బద్నాం చేయడం సబబు కాదని సిఎంం రేవంత్‌కు ఎమ్మెల్యే హరీశ్‌ రావు సూచించారు.
తెలంగాణ సాధన కోసమే నాడు పొత్తులు
బిఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్, టిడిపితో, ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందని రేవంత్ వ్యాఖ్యానించారు. అవును మేం పొత్తు పెట్టుకున్నాం. నిజంగా టిఆర్‌ఎస్ పార్టీ 2004లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని, తెలంగాణ ఇస్తామని కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో పెట్టి, రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేశారు కాబట్టే ఆ రోజు టిడిపితో పొత్తు పెట్టుకున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు. మేం టిడిపితో, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఈ రాష్ట్ర, దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి తెలంగాణ సాధించామని హరీశ్ రావు పేర్కొన్నారు. తమ ప్రయత్నం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇవాళ మేం సక్సెస్ అయ్యామని, రాష్ట్రాన్ని సాధించాలన్న వ్యూహంలో భాగంగానే పొత్తులు పెట్టుకున్నామని హరీశ్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం పార్టీలు మారారనని, మేం అలా చేయలేదని, మేం ఇతర రాజకీయ పార్టీలతో తెలంగాణ కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను సిఎం రేవంత్ అవమానపరిచారని, విజ్ఞులైన ప్రజలు మా అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌ను గెలిపించారని హరీశ్‌ రావు పేర్కొన్నారు.
కడపలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎందుకు పెట్టారు ?
తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటిఆర్ అన్నారు. నీళ్లు, బొగ్గు లేని రాయలసీమలో, బొగ్గు లేని విజయవాడలో థర్మల్ పవర్ కేంద్రాలు నెలకొల్పుతారన్నారు. తెలంగాణలో ఆ రోజు విద్యుత్ కేంద్రాలు కట్టకుండా, రాష్ట్రం ఏర్పడే నాటికి 27 వందల మెగావాట్ల లోటు నష్టాలతో తమకు అప్పజెప్పారని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, నిర్వాకాన్ని వైట్ పేపర్‌లో చాలా గొప్పగా స్పష్టంగా చెప్పిందన్నారు. తమకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే 2014 నాటికి ఆరు గంటల కరెంట్ మాత్రమే ఇచ్చామని, అంతటి అసమర్థత, చేతకానితనం మాది అని వారే ఒప్పుకున్నారని కెటిఆర్ తెలిపారు. కడపలో రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎందుకు పెట్టారు ? అక్కడ బొగ్గు ఉందా..? నీళ్లు ఉన్నాయా..? విజయవాడలో బొగ్గు ఉందా..? ఇవాళ బాగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఆ రోజు విద్యుత్ కేంద్రాలు కట్టకుండా, రాష్ట్రం ఏర్పడే నాటికి 27 వందల మెగావాట్ల లోటు నష్టాలతో తమకు అప్పజెప్పారని కెటిఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ బిడ్డలుగా గట్టిగా కొట్లాడినం..
మానకొండూరు నియోజకవర్గంలోని నేదునూరు, చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లిలో ఆనాడు యూపిఏ ప్రభుత్వం గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని భూసేకరణ చేసిందని కెటిఆర్ ఆరోపించారు. టిఆర్‌ఎస్ పార్టీగా ఆనాడు ఒక్క దగ్గర ధర్నా చేయదని, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలేదని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న గ్యాస్ ఆధారిత కేంద్రాలు ఎందుకు పెట్టడం లేదని నిరసన వ్యక్తం చేశామని కెటిఆర్ తెలిపారు. బొగ్గు లేని విజయవాడలో థర్మల్ పవర్ కేంద్రం ఎందుకు పెడుతారు..? బొగ్గు, నీళ్లు లేని రాయలసీమలో ఎందుకు పెడుతారు..? అని ఆనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ బిడ్డలుగా గట్టిగా కొట్లాడినం, నిరసనలు వ్యక్తం చేశామని కెటిఆర్ స్పష్టం చేశారు.
ఆ రెండు ప్రాజెక్టులను ఇప్పుడు టేకాఫ్ చేయండి..
ఈ దేశంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలమైందా..? నేదునూరులో గ్యాస్ అలకేషన్ అయ్యిందా..? ఆనాడు యూపిఏలో జైపాల్ రెడ్డి పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండి, గ్యాస్ అలకేషన్ చేయలేదు. గ్యాస్ అలకేషన్ చేయలేదు కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు టేకాఫ్ కాలేదు. ఇప్పుడు టేకాఫ్ చేయండి మీది ప్రభుత్వం. నేదునూరు, శంకర్‌పల్లిలో ఇప్పుడు ఆ ప్రాజెక్టులు పెడుతామని ప్రభుత్వం హామీ ఇవ్వాలి. ఈరోజు నోటికొచ్చినట్టు అవమానిస్తున్నారు. అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీని, ఇక్కడ మేం మాట్లాడుతుంటే మమ్మల్ని సిఎం అవమానిస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News