ఫోన్ ట్యాపింగ్‌పై కెటిఆర్, హరీశ్‌రావు మౌనమెందుకు?
దర్యాప్తులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం
ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటివరకు సమీక్ష జరపలేదు పోలీసుల పనుల్లో జోక్యం చేసుకోను
నిపుణులు చెప్పినట్లే కాళేశ్వరంపై ముందుకు వెళ్తాం 52 టిఎంసిలు సముద్రం పాలు ఎత్తిపోసిన ఆ
నీళ్లకు కరెంటు బిల్లులు కట్టాం విద్యుత్‌కు సంబంధించిన విషయాలన్నీ త్వరలో బయటపెడతా
జర్నలిస్టులకు కేటాయించిన భూముల కబ్జాపై నివేదిక తెప్పించుకుంటా త్యాగాలు, పోరాటాలు
గుర్త్తొచ్చేలా రాష్ట్ర చిహ్నం, గీతం రూపకల్పన బాధ్యత అందెశ్రీకి అప్పగింత.. సంగీత దర్శకుడి
ఎంపికతో నాకు సంబంధం లేదు ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిట్‌చాట్
మనతెలంగాణ/హైదరాబాద్: అన్నింటికీ సిబిఐ విచారణ చేయించాలని కోరే మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావులు ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఎందుకు కోరడం లేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయబోదని, అలాంటి వెదవ పనులు తాము చేయబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ 23లోని సిఎం అధికారిక నివాసం నిర్మాణ పనులు పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగొచ్చని, అందుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఎస్‌ఐబి అధికారులు కేంద్ర నిఘా సంస్థలతోనే నేరుగా మాట్లాడతారు తప్ప, తనతో కాదన్నారు.
1980, 90ల నుంచి సేకరించిన డేటా అంతా ఉందో లేదో? బ్యాకప్ కూడా ఉందో లేదా దానిని కూడా మాయం చేశారో అంతా దర్యాప్తు అధికారులకు తెలుస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. కనపడకుండా పోయిన హార్డ్‌డిస్క్‌లు, ధ్వంసం అయిన డేటా బాక్ అప్ ఎక్కడ ఉందో విచారణ అధికారులు తేల్చాల్సి ఉందన్నారు. తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల విష యంలో ఫోన్ ట్యాపింగ్ జరగొచ్చని, గత ప్రభుత్వం దానిని దుర్వినియోగం చేసిందని సిఎం రేవంత్ అన్నారు.
ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటివరకు సమీక్ష జరపలేదు
అధికార మార్పిడి తర్వాత చోటు చేసుకున్న అధికారుల బదిలీల్లో ఎస్‌ఐబి కార్యాలయంలో కొన్ని వస్తువులు మిస్ అయినట్లు గుర్తించారని, ఈ క్రమంలోనే ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిందని ఆయన తెలిపారు. ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటివరకు సమీక్ష జరపలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారని ఆయన చెప్పారు. పోలీసుల పనిలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో తనకు తెలుసునన్నారు.
త్యాగాలు, పోరాటాలు గుర్తొచ్చేలా రాష్ట్ర చిహ్నం, గేయం
రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తమ పాలనలో ప్రత్యర్థి పార్టీలకు విమర్శించే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయన్నారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం అన్నారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు గుర్తొస్తాయని ఆయన వెల్లడించారు. అవే గుర్తుకు వచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నట్లు సిఎం ప్రకటించారు. రాచరికం ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికారిక చిహ్నం ఉండబోతుందన్నారు. అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదని ఆయన వెల్లడించారు. సమ్మక్క, సారక్క – నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకి అద్దం పట్టేలా ఈ చిహ్నం ఉంటుందని, పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం ఉంటుందని సిఎం రేవంత్ తెలిపారు. రాష్ట్ర గీత రూపకల్పన బాధ్యతలు అందెశ్రీకి అప్పగించామని, రాష్ట్ర చిహ్న రూపకల్పన బాధ్యతలు ఫైన్ ఆర్ట్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన నిజామాబాద్ బిడ్డకు అప్పగించినట్టు సిఎం రేవంత్ వివరించారు.
సంగీతం గురించి అందెశ్రీకే….
తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందెశ్రీకే అప్పగించినట్లు సిఎం రేవంత్ తెలిపారు. సంగీత దర్శకుడు కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు. ఏ సంగీత దర్శకుడిని పెట్టి గేయ రూపకల్పన చేయాలన్నది తన పని కాదన్నారు. సంగీత దర్శకుడు ఎంపిక విషయంలో తనకేం సంబంధం లేదని సిఎం తెలిపారు. ఎవరితో సంగీతం చేయించుకోవాలో అందెశ్రీ నిర్ణయానికే వదిలేశానని సిఎం రేవంత్ స్పష్టం చేశారు.
నిపుణుల ఆధారంగానే కాళేశ్వరంపై ముందుకు….
కాళేశ్వరం విషయంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ నివేదిక ఆధారంగానే ముందుకు వెళతామని చెప్పారు. మేడిగడ్డపై జ్యుడీషియల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. కాళేశ్వరం సమస్య 32 పళ్లలో ఒక పన్ను విరిగితే వచ్చేది కాదని, విరిగింది వెన్నెముక అని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కాళేశ్వరంలో నీటిని నిల్వ చేసి విడుదల చేసే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. కాళేశ్వరం కరెంట్ బిల్లులు అన్నీ సముద్రంలో వదిలిన నీళ్లలాంటివని ఆయన చెప్పుకొచ్చారు. 52 టిఎంసిల నీళ్లు సముద్రం పాలయ్యాయని, సముద్రంలోకి వెళ్లిన నీటికి కరెంట్ బిల్లులు కట్టామన్నారు.
కెసిఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు మాట్లాడాలి…
కెసిఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించాల్సి ఉందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఏ వ్యవస్థను ఇప్పటి వరకు దుర్వినియోగ పరచలేదన్నారు. పక్కనున్న ఎపిలో ఎంత మంది అధికారులను మార్చారు? తెలంగాణలో ఎంతమందిని మార్చారో చూస్తే మీకే అర్థమవుతుందన్నారు. ఏ ఒక్క అధికారిపైనా ఎలాంటి ఆరోపణ రాలేదని సిఎం పేర్కొన్నారు. ఒకవేళ అధికారులు తమకు అనుకూలంగా పని చేసి ఉంటే, ప్రతిపక్షాలు చూస్తూ కూర్చోవు కదా అని ఆయన తెలిపారు.
విద్యుత్‌కు సంబంధించిన విషయాలన్నీ బయటపెడతా…
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈదురు గాలుల కారణంగా చెట్లు పడిపోవడం, విద్యుత్ వినియోగం పెరగడం, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడంతో విద్యుత్ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. పునరుద్ధరణ విషయంలో కొంత సమయం తీసుకొని ఉండవచ్చు అన్నారు. గతంలో ఎన్నడూ లేనంత విద్యుత్ డిమాండ్ తెలంగాణలో పెరిగిందని, అందుకు అనుగుణంగా ఎక్కడా సమస్యలు రాకుండా చేసినట్లు ఆయన చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత విద్యుత్‌కు సంబంధించిన అన్ని విషయాలు బయటపెడతానని ఆయన స్పష్టం చేశారు.
జర్నలిస్ట్‌లకు కేటాయించిన భూముల కబ్జాపై నివేదిక తెప్పించుకుంటా
జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన భూముల్లో కబ్జా అంశంపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. జేఎన్జే సొసైటీకి భూమి అప్పగింతపై మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డితో నివేదిక తెప్పించుకుంటానని ఆయన తెలిపారు. తాజాగా హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్‌లో జర్నలిస్టుల స్థలాలపై పెట్టిన సైన్ బోర్డులను కొందరు భూకబ్జాదారులు అక్రమంగా తీసేశారని విలేకరులు సిఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన పరిశీలన చేస్తానని, నివేదిక కూడా తెప్పించుకొని తగిన చర్యలు చేపడతామని సిఎం రేవంత్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల పట్ల సానుకూలంగా వ్యవహారిస్తుందన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుంటామని సిఎం రేవంత్ తెలిపారు.