Saturday, November 23, 2024

శ్రీలత ప్రస్థానం స్ఫూర్తిదాయకం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీలో స్థానం సంపాదించుకున్న నిరుపేద కోయ తెగకు చెందిన గిరిజన విద్యార్థిని కారం శ్రీలతకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల, మున్సిపల్ శాఖలమంత్రి కె.తారకరామారావు అండగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడి గూడెంకి చెందిన శ్రీలత ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే అద్భుత ప్రతిభను కనబరుస్తుంది. పేదరిక పరిస్థితులను దాటుకుని ఇంటర్మీడియట్లో 97 శాతం మార్కులను ఆమె సాధించింది. నాగర్‌కర్నూల్ లోని గిరిజన గురుకుల సంక్షేమ జూనియర్ కళాశాలలో చదివి ఐఐటీ-జేఈఈ పరీక్ష ద్వారా ఐఐటి వారణాసిలో ఇంజనీరింగ్ సీట్ సాధించింది. వ్యవసాయ కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులు ఆమె ఫీజులు చెల్లించే పరిస్థితిలో లేరు. ఇప్పటిదాకా పూర్తిస్థాయి ప్రభుత్వ విద్యను అభ్యసించిన శ్రీలతకి ఐఐటి ఫీజులు చెల్లించేందుకు మార్గం లేక తన ఉన్నత విద్యాభ్యాసానికి అడ్డంకిగా మారింది.

శ్రీలత పరిస్థితి మంత్రి కెటిఆర్ దృష్టికి రాగా.. స్పందించిన ఆయన తన సొంత నిధులతో శ్రీలత ఐఐటి విద్య పూర్తయ్యేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రగతిభవన్ లో శ్రీలతను అభినందించారు. ఆమె విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు ఆమె కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. నిరుపేద పరిస్థితుల్లో అనేక సవాళ్లు దాటుకొని ఐఐటీలో సీటు సాధించిన శ్రీలత ప్రస్థానం లక్షలాది మందికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్భంగా కెటిఆర్ అన్నారు. ప్రజ్ఞాపాటవాలు ఎవరి సొత్తు కాదని, కృషితో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చనే విషయాన్ని శ్రీలత నిరూపించిందని అన్నారు. శ్రీలత లాంటి ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆడబిడ్డకి అండగా నిలవడం తనకు అత్యంత సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఐఐటి విద్యకు అవసరమైన డబ్బులను అందించారు. ఐటీలోనూ మరింత ప్రతిభ చాటాలని అభినందించారు. మంత్రి కెటిఆర్ అండగా నిలవడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News