Wednesday, January 8, 2025

లీగల్ వార్

- Advertisement -
- Advertisement -

క్వాష్ పిటిషన్ కొట్టివేతతో సుప్రీంను ఆశ్రయించిన
కెటిఆర్, రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసిన సర్కార్
లీగల్ టీంతో సంప్రదింపులు జరిపిన అనంతరం
సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కెటిఆర్ ఏ క్షణమైనా
అరెస్టు అంటూ వదంతులు

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఫార్ములా ఈ- రేసు వ్యవహారంలో ఎసిబి నమోదు చేసిన కేసును కొట్టి వేయాలంటూ కెటిఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు కెటిఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, బిఆర్‌ఎస్ పార్టీ వ్యూహాలను పదును పెట్టాయి. ఫార్ములా ఈ- రేసు వ్యవహారంలో ఎసిబి నమోదు చేసిన కేసు వ్యవహారం బిఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సర్కార్‌గా ఒక పార్టీ నేతలు ఆరోపణలు చేస్తే మరో పార్టీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కెటిఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లానున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ కేసులో ముందుగానే కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై కెటిఆర్ ఒకవేళ పిటిషన్ వేస్తే తమ వాదనలూ వినాలని ప్రభుత్వం అందులో కోరింది. అలాగే హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన నేపథ్యంలో నందినగర్‌లోని కెటిఆర్ నివాసం వేదికగా గులాబీ నేతలు భవిష్యత్ వ్యూహరచనలో పడ్డారు. లీగల్ టీంతో కెటిఆర్ సంప్రదింపులు జరిపారు.

ఈ కేసులో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పు అనంతరం తనను కలిసిన నేతలతో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఫార్ములా – ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలను తాను పలుమార్లు స్పష్టంగా చెప్పానని, తప్పిదాలు ప్రశ్నిస్తున్నందుకే ప్రభుత్వం కక్ష గట్టి అక్రమ కేసు పెట్టిందని కెటిఆర్ నేతలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక దృష్టి మరల్చే ప్రయత్నంలో భాగంగా అక్రమ కేసులు పెడుతోందని, జరగబోయే అన్నింటికీ సిద్ధంగానే ఉన్నానని కెటిఆర్ నేతలతో అన్నట్లు సమాచారం. ప్రజల పక్షాన పోరాడాలని, కాంగ్రెస్ గ్యారంటీలు, హామీల అమలు పైనే దృష్టి సారించాలని బిఆర్‌ఎస్ నాయకత్వానికి చెప్పినట్లు తెలిసింది. ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో ప్రభుత్వం ముందస్తుగా సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కెటిఆర్ ముందస్తు బెయిల్ కోసమైనా, లేకపోతే హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళితే, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న తర్వాతే సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేయనుంది.

సుప్రీంకు కెటిఆర్
ఫార్ములా- ఈ కార్ రేస్ కేసులో కెటిఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కెటిఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు మంగళవారం కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. బిఆర్‌ఎస్ న్యాయవాదుల బృందం కేసును సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. బుధవారం లేదా గురువారం కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందని కెటిఆర్ తరఫు న్యాయవాదులు తెలిపారు.

ఏ క్షణమైనా కెటిఆర్ అరెస్టు..?
ఫార్ములా ఈ- రేసు కేసు వ్యవహారంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసిన నేపథ్యంలో ఏక్షణమైనా కెటిఆర్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఎసిబి కెటిఆర్‌కు రెండు సార్లు నోటీసులు ఇచ్చింది. ఈనెల 6న రావాలని కెటిఆర్‌కు ఎసిబి నోటీసులు ఇవ్వగా.. విచారణ కోసం ఎసిబి కార్యాలయానికి వెళ్లారు. అయితే న్యాయవాదితో విచారణకు రావడంతో పోలీసులు లోపలికి అనుమతించలేదు. న్యాయవాది ఉంటేనే విచారణకు వస్తానని కెటిఆర్ పట్టుబట్టిన విషయం తెలిసిందే. చివరకు ఎసిబికి కెటిఆర్ లిఖితపూర్వకంగా లేఖ రాసి, విచారణకు హాజరుకాకుండాను వెనుతిరిగి వెళ్లిపోయారు. దీంతో కెసిఆర్‌కు ఎసిబి మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 9న విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో ఎసిబి పేర్కొంది.

ప్రస్తుతం క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఇడి, ఎసిబి నోటీసులపై కెటిఆర్ స్పందన ఎలా ఉండబోతుంది.. విచారణకు హాజరు అవుతారా.. లేదా..? అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కెటిఆర్ అరెస్టు అయితే తర్వాత కేసును న్యాయపరంగా ఎదుర్కోవడంతో పాటు పార్టీ వ్యవహారాలు ఎవరు చూసుకుంటారనే చర్చ పార్టీ వర్గాలో జరుగుతున్నట్లు సమాచారం. కెటిఆర్ అరెస్టు అయితే ఎన్ని రోజులు జైలులో ఉండాల్సి వస్తుంది…? ఈ కేసులో త్వరగా బెయిల్ లభిస్తుందా..లేదా..? తదితర అంశాలను బేరీజు వేసుకుని ముందుగానే బిఆర్‌ఎస్ పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News