Thursday, January 9, 2025

వడ్డీలేని గృహ రుణాలు

- Advertisement -
- Advertisement -

‘హౌజింగ్ ఫర్ ఆల్’ అనేది తమ నినాదం
ఇళ్లు కొనే మధ్య తరగతి ప్రజల కోసం
వడ్డీ లేని ఇళ్ల రుణాలను ఇవ్వాలన్నదే సిఎం కెసిఆర్ ఆలోచన
తెలంగాణపై అహంకారం కాదు, చచ్చేంత మమకారం ఉంది

మనతెలంగాణ/హైదరాబాద్: అందరికీ ఇళ్లు ఉండాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని అందుకోసం ఇప్పటికే డబుల్ బెడ్‌రూం, గృహలక్ష్మీ పథకాలను అమలు చేస్తున్నామని వీటికి తోడు మరో కొత్త పథకం గురించి కూడా సిఎం కెసిఆర్ ఆలోచన చేస్తున్నారని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. వడ్డీ లేకుండా హోమ్ లోన్ ఇచ్చేలా ఈ కొత్త పథకాన్ని తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘హౌజింగ్ ఫర్ ఆల్’ అనేది తమ నినాదమని తప్పకుండా దానిని అమలు చేసి చూపిస్తామన్నారు. హెచ్‌ఐసిసిలో క్రెడాయ్ ఆధ్యర్యంలో జరిగిన రియల్ ఎస్టేట్ ప్రతినిధులు వ్యాపార వర్గాల సమావేశంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ నిరక్షరాస్యత అనేది ఉండకూడదు, అందరూ చదువుకోవాలి, డబుల్ బెడ్ రూమ్ స్కీమ్, గృహలక్ష్మీ పథకాలను కొనసాగిస్తూనే ఈ కొత్త పథకంపై ఆలోచన చేస్తున్నామన్నారు. ఇళ్లు కొనే మధ్య తరగతి ప్రజల కోసం వడ్డీ లేని ఇళ్ల రుణాలను ఇవ్వాలని సిఎం కెసిఆర్ ఆలోచన చేస్తున్నారని, దానిని తప్పకుండా అమలు చేస్తామన్నారు.  లోన్ కట్టే శక్తి ఉండి, వడ్డీని ప్రభుత్వం కడితే చాలనుకునే వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

ఆరున్నరేళ్లు మాత్రమే నికరంగా పరిపాలించాం
ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా తెలంగాణపై అహంకారం కాదు చచ్చేంత మమకారం ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రజలకు సంబంధం లేని అంశాలపై విపక్షాలు మాట్లాడుతున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన నాటికి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో 14వ స్థానంలో ఉండేదని, ప్రస్తుతం పంజాబ్ ను వెనక్కి నెట్టి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని కెటిఆర్ తెలిపారు. తెలంగాణ వచ్చి తొమ్మదిన్నరేళ్లు అయ్యిందని ఇన్ని సంవత్సరాల్లో కొవిడ్, ఎన్నికల వల్ల ఆరున్నరేళ్లు మాత్రమే నికరంగా పరిపాలించామన్నారు. ఇన్ని ఏళ్లలో తాము చేసిన అభివృద్ధి మీ ముందు ఉందని కెటిఆర్ చెప్పారు.

సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తున్న ప్రతిపక్షాలు
ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు అంశాలే లేవని చెప్పారు. అందుకే ప్రజలకు సంబంధం లేని అంశాలను ఎన్నికల్లో ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో రియల్ ఎస్టేట్‌పై అనేక అనుమానాలు ఉండేవని, ఆ అనుమానాలన్నీ ఇప్పుడు పటాపంచాలయ్యాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా చేపడుతున్నామని కెటిఆర్ తెలిపారు. పట్టణాలతో పాటు పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మా పాలనపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు అంశాలు లేవని, అందుకే ప్రజలకు సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తున్నామన్నారు.

రజనీకాంత్‌కు కూడా హైదరాబాద్‌లో మార్పు అర్థమయ్యిందని, కానీ, ఇక్కడున్న గజినీలకు అర్ధం కాలేదని ఆయన తెలిపారు. ఎపి నుంచి వేరుపడినప్పుడు హైదరాబాద్, రాష్ట్రం ఏమవుతుందోనన్న అనుమానాలు ఉండేవని, మార్పు 2014లోనే వచ్చిందని, ఆ మార్పుతో తెలంగాణ దేశంలో నెంబర్ 1 అయ్యిందని కెటిఆర్ తెలిపారు.

మాది 6.5 ఏళ్ల పాలన, వారిది 65 ఏళ్ల పాలన…
9.5 సంవత్సరాల్లో 2 ఏళ్లు కరోనాకే పోయిందని, అందులో ఒక ఏడాది ఎన్నికల పోరాటానికి పోగా కేవలం 6.5 సంవత్సరాలు మాత్రమే తాము పరిపాలన సాగించామని మాది 6.5 ఏళ్ల పాలన అని, వారిది 65 ఏళ్ల పాలన అని కెటిఆర్ అన్నారు. ఈ తక్కువ సమయంలో ప్రజల కనీస అవసరాలు అన్ని తీర్చగలిగామన్నారు. రైతులకు విద్యుత్, నీళ్లు వంటివి సమగ్రంగా అందించామన్నారు. సమగ్ర, సమీకృత, సమతుల్యత కలిగిన వృద్ధిగా తెలంగాణ పేరుగాంచిందన్నారు. దేశంలోనే తెలంగాణ ఓ మోడల్‌గా నిలిచిందన్నారు. 25 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంపై ప్రభావం చూపిన నేతల్లో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కెసిఆర్ పేర్లు నిలిచిపోతాయన్నారు. చంద్రబాబు ఐటి వృద్ధికి పాటు పడితే, రాజశేఖర్ రెడ్డి పేదల కోసం చేశారని, కానీ, కెసిఆర్ హయాంలో ఐటి సహా పేదల వరకు అన్ని రంగాల వృద్ధికి కృషి చేశారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలో 7.7 శాతం గ్రీన్ కవర్
సిఎం కెసిఆర్ నాయకత్వంలో పంజాబ్ , హర్యానాను దాటి తెలంగాణ వారి ధాన్యం వృద్ధిలో మొదటిస్థానంలో ఉందన్నారు. టిఎస్ ఐపాస్ తో 27 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 7.7 శాతం గ్రీన్ కవర్ పెరిగిందన్నారు. పల్లె, పట్టణాలు కెసిఆర్ పాలనలో వృద్ధి చెందాయన్నారు. డిసెంబర్ 3వ తేదీన తామే విజయం సాధిస్తామని, సోషల్ మీడియాలో ప్రచారం తప్ప ప్రజల్లో ఉంది భారసానేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు, 100 శాతం అక్షరాస్యత అనే నినాదాలతో తాము ముందుకు సాగుతామన్నారు.
ఎంజాయ్ చేయాలనుకుంటే మాకు హాలిడే ఇవ్వకండి
ఒకప్పుడు లంచం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ జరిగే పరిస్థితి లేదని, కానీ, ధరణి వచ్చాక రిజిస్ట్రేషన్ వెంటనే పూర్తి అవుతుందని కెటిఆర్ అన్నారు. ధరణిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తామని కెటిఆర్ తెలిపారు. ఎలుకలు ఉన్నాయని ఇళ్లు కాల్చుకొము, అలాగే ధరణి కూడా అంతేనని ఆయన తెలిపారు. మీరు హాలిడేస్ ఎంజాయ్ చేయాలంటే మాకు హాలిడే ఇవ్వకండి, అభివృద్ధి చేసే పార్టీకి ఓటు వేయాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. సిఎం పీఠం కోసం కొట్లాడకుండా, సొంతంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వంతోనే వృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. జాతీయ పార్టీల్లో నిర్ణయాలు డిల్లీలో తీసుకోవాలని కెటిఆర్ ఎద్దేవా చేశారు.

బెంగుళూరును తలదన్నేలా హైదరాబాద్ అభివృద్ధి
ఉద్యోగ కల్పనలో బెంగుళూరును తలదన్నేలా హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. మంచినీటి సమస్యను పరిష్కరించామని, షీ టీమ్స్ ఏర్పాటు చేశామని, రోడ్లను అభివృద్ధి చేశామని పార్క్‌లు, ప్లె ఓవర్‌లను నిర్మించామన్నారు. 2047 నాటికి ఎపి, తెలంగాణ, హిందూ, ముస్లిం లాంటి బేధాలు లేకుండా సమగ్ర అభివృద్ధి ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. రెన్యువబుల్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నామని, ఎలక్ట్రిక్ వెహికల్ షటిల్ సర్వీస్ ద్వారా పొల్యూషన్ తగ్గించవచ్చన్నారు. అందులో భాగంగా గ్రీన్ బిల్డింగ్స్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు. దీంతోపాటు 977 అర్బన్ పార్క్‌లను ఏర్పాటు చేశామని వాటిని ఇంకా పెంచుతామని ఆయన తెలిపారు.

2047 సంవత్సరానికి వరల్డ్‌క్లాస్ నగరంగా…
వేస్ట్ వాటర్ పాలసీ తెచ్చి కాలుష్యాన్ని నియంత్రణకు కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను మరింత సేఫ్ సిటీ గా మారుస్తామన్నారు. సైబర్ క్రైమ్ నియంత్రణకు మరిన్ని కఠిన చట్టాలు తీసుకొస్తామన్నారు. తెలంగాణలో ఏ ప్రాంతం నుంచి అయినా కేవలం ఒక గంటలో హైదరాబాద్ చేరుకునేలా ఒక ట్రాన్స్‌పోర్ట్ సిస్టంను సిద్ధం చేస్తున్నామన్నారు. వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో పూర్తి స్థాయిలో దీనిని అమల్లోకి తీసుకొస్తామన్నారు.

హైదరాబాద్‌లో వరదలు రాకుండా, డ్రైనేజీ నిర్వహణ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను ఒలింపిక్స్ పోటీల కోసం సిద్ధం చేయాలన్నది తమ కల అని 2047 సంవత్సరానికి హైదరాబాద్‌ను వరల్డ్ క్లాస్ నగరంగా చూడాలన్నది తన విజన్ అని కెటిఆర్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News