Tuesday, April 15, 2025

ఆ రెండు పార్టీలకు కర్రు కాల్చివాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్, బిజెపి పార్టీలకు కర్రు కాల్చివాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో నిర్వహించనున్న పార్టీ రజతోత్సవ సభలో భాగంగా ఆదివారం మల్కాజిగిరిలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. మంచి నేతలను ఎన్నుకుంటే మంచే జరుగుతుందని, రేవంత్ రెడ్డి లాంటి మోసగాళ్లను ఎన్నుకుంటే గోల్డ్ కాదు కదా రోల్ గోల్డ్ కూడా రాదని అన్నారు. తెలంగాణ ప్రజలకు నష్టం కలిగినా సరే ఢిల్లీ నేతలకు కావాల్సింది సీట్లు కాపాడుకునేందుకు మూటలు మోసే వాళ్లేనని విమర్శించారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి తప్ప మంత్రులు ప్రజలు ఎవరు సంతోషంగా లేరని అన్నారు.

తెలంగాణకు శ్రీరామరక్ష కెసిఆర్ నాయకత్వమేనని, గులాబీ జెండాకు ప్రజలు అండగా నిలబడాలని కేటీఆర్ కోరారు. తెలంగాణపై కెసిఆర్ కు ఉన్న ప్రేమ, కడుపునొప్పి ఢిల్లీ నేతలకు ఎందుకు ఉంటుందని విమర్శించారు. కాంగ్రెస్, బిజెపిల ఆలోచన వైఖరి ఒకటేనని, భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా ఈ రెండు పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి మల్కాజిగిరి నుంచి భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్, బిజెపి నాయకులు కేటీఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. అంతకుముందు కేటీఆర్ మల్కాజిగిరిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు మేకల సునీత రాము యాదవ్, విజయశాంతి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు, రావుల అంజయ్య, రాము యాదవ్, జేఎస్ వెంకన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News