Sunday, December 22, 2024

లోక్‌సభ స్థానాల పునర్విభజనలో దక్షిణాదికి తీరని అన్యాయం: కెటిఆర్ ఆందోళన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనాభా ప్రాతిపదికన 2026 తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన జరిగిన పక్షంలో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల తర్వాత బిజెపి తిరిగి అధికారం చేపడితే పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కేంద్రంలోని ప్రభుత్వం చేపడుతుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కెటిఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించిన కొత్త పార్లమెంట్ భవనంలో 888 మంది లోక్‌సభ సభ్యులు , 284 మంది రాజ్యసభ సభ్యులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. భవిష్యత్తులో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సీట్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందనడానికి ఇదే సూచనగా చెప్పవచ్చు. ప్రస్తుతం లోక్‌సభ సభ్యుల సంఖ్య 543 ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు లోబడి గతంలో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశాయని, ఇదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పాలిట శాపంగా పరిణమించే అవకాశం ఉందని కెటిఆర్ మంగళవారం ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీవ్రంగా నష్టపోతాయని ఆయన తెలిపారు.

పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సంఖ్యలో లోక్‌సభ సీట్లు పెరిగే అవకాశం ఉందని, కాని ఉత్తరాది రాష్ట్రాలు దీని వల్ల పెద్ద సంఖ్యలో సీట్లు పొందవనున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రతిష్టాకరంగా చేపట్టిన జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సంపూర్ణంగా మద్దతునిచ్చినందుకు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరగనుండగా ఈ కార్యక్రమాన్ని ఏమాత్రం పట్టించుకోని ఉత్తరాది రాష్ట్రాలు ప్రయోజనం పొందనున్నాయని ఆయన పేర్కొన్నారు.

దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రగతిశీల విధానాల కారణంగా నష్టపోనున్నాయని ఆయన తెలిపారు. జనాభా నియంత్రణలోనే కాక అన్ని రకాల మానవ అభివృద్ధి సూచికలలో సైతం దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. దేశ జనాభాలో 18 శాతం మాత్రమే ఉన్న దక్షిణాది రాష్ట్రాలు జిడిపికి 35 శాతం వాటా అందచేస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయని ఆయన తెలిపారు. లోక్‌సభ స్థానాల పునర్విభజనలో జరగనున్న అన్యాయానికి వ్యతిరేకంగా రాజకీయాలకతీతంగా గళమెత్తాలని వివిధ పార్టీల నాయకులు, ప్రజలకు కెటిఆర్ పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News