Thursday, January 23, 2025

నా రాజీనామా సవాల్‌ను మరోసారి విసురుతున్నా : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హుజూర్‌నగర్‌లో ఒక సారి బిజెపి నేతలకు తన రాజీనామా సవాల్ విసిరానని, మరోసారి కూడా సిరిసిల్ల వేదికగా విసురుతున్నానని మంత్రి కెటిఆర్ అన్నారు. గత 8 సంవత్సరాల్లో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3 లక్షల 68 వేల కోట్లు చెల్లిస్తే కేంద్రం నుంచి తెలంగాణకు మాత్రం రూ. లక్షా 68వేల కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయని, మిగిలిన రూ.2లక్షల కోట్లు ఎటు పోయాయని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఖర్చు చేసింది నిజం కాదా అని నిలదీశారు. ఎవరి నిధులు ఎవరు వాడుతున్నారో తెలపాలన్నారు.

తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి ఇస్తే తిరిగి ఇచ్చేది 45 పైసలు మాత్రమేనని, మిగతా 55 పైసలతో కేంద్రం షోకులు చేస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇది తప్పని నిరూపిస్తే.. తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మరోసారి సవాల్ విసురుతున్నానన్నారు. గుజరాతీల చెప్పులు మోయడం తప్ప.. ఇలాంటి వాటికి బిజెపి నేతలు జవాబు చెప్పరని విమర్శించారు. మసీదులు కూల్చాలి, మందిరాలు కట్టాలనే బండి సంజయ్ నాలుగేళ్లుగా కరీంనగర్ ఎంపిగా ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని కెటిఆర్ నిలదీశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏ అసెంబ్లీ నియోజక వర్గంలోనైనా నీవు చేసిన అభివృధ్ధి ఏమైనా ఉందా అని అన్నారు.

కొత్తగా ఏర్పడిన సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఎందుకు తేలేదన్నారు. మాజీ ఎంపి బి వినోద్‌కుమార్ ప్రతిపాదించిన ట్రిపుల్ ఐటి ప్రతిపాదన ఏమైందన్నారు. ప్రధాని మోడీ ద్వారా ఇప్పటి వరకు కనీసం పది రూపాయల చందా అయితా తెలంగాణకు బండి తెచ్చారా అని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. సభలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్, జడ్పి చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, ఎంఎల్‌సి ఎల్ రమణ, ఎంఎల్‌ఏలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News