అగ్నిపథ్ ఆందోళనపై కెటిఆర్ హాట్ కామెంట్స్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆర్మీలో స్వల్పకాలిక సర్వీసుల పేరుతో వచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లలో ఆందోళనకారులు పలు రైళ్లకు, బస్సులకు నిప్పు పెట్టారు. ఇప్పటివరకు వందల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆందోళనలపై మంత్రి కెటిఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మోడీ సర్కార్ నాడు రైతులతో పెట్టుకున్నారని, నేడు జవాన్‌లతో పెట్టుకున్నారని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగ శాతం భారీగా పెరిగిందని, అగ్నివీర్ స్కీమ్‌ను వారు వ్యతిరేకించడంతో పాట ఆందోళనను ఉధృతం చేశారని మంత్రి కెటిఆర్ స్పందించారు. ‘అగ్నివీర్ స్కీమ్‌కు వ్యతిరకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మక నిరసనలు దేశంలోని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనం. తొలుత దేశంలో రైతులతో పెట్టుకున్నారు. ఇప్పుడు దేశంలోని జవాన్ అభ్యర్థులతో పెట్టుకుంటున్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ నుంచి ప్రతిపాదిత నో ర్యాంక్ నో పెన్షన్ వరకు’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కెటిఆర్ ట్వీట్ చేశారు.