హైదరాబాద్: మిషన్ భగీరథకు ఫండ్స్ అడిగామని, ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. పీర్జాదిగూడలో మంత్రి కెటిఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పారిశుద్ధ కార్మికులు, హెల్త్ కార్మికులు, పోలీసులను జీవితాంతం మరిచిపోలేరన్నారు. కరోనా ప్రభావితం చేయని మనిషి, రంగం లేదన్నారు. కరోనా సంక్షోభంలో కూడా తెలంగాణలో సంక్షేమం ఆగలేదన్నారు. రెండేళ్ల కింద అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఇచ్చిన హామీ మేరకు పీర్జాదిగూడ నుంచి మూసీ వరకు వరద కాలువ నిర్మిస్తున్నామని, రూ.110 కోట్ల ఖర్చుతో వరద కాలువ నిర్మాణం చేపట్టామన్నారు.
సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటున్నామని, అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో రూ.240 కోట్లతో మంచినీటి సరఫరా చేస్తున్నామని, ప్రతి ఇంటికి రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తున్నామన్నారు. కొత్త ఆస్పత్రులు నిర్మించబోతున్నామని, హైదరాబాద్ నలువైపులా పది వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామని, దేశంలో ఎక్కడా లేని విధంగా మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నామని కెటిఆర్ స్పష్టం చేశారు.
టిఆర్‌ఎస్ పేదల పక్షపాతి ప్రభుత్వమని కొనియాడారు. వరంగల్‌కు హైవేకి సమాంతరంగా మరో రోడ్డు మంజూరు చేస్తున్నామని, ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇస్తామన్నారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ గుజరాత్‌కే ప్రధానా? తెలంగాణకు ప్రధాని కాదా? అని ప్రశ్నించారు. ఎన్ని ఉత్తరాలు రాసినా… ఎన్ని సార్లు విన్నవించుకున్న కేంద్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ఈ దేశంలో లేదన్నట్లుగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఉపయోగపడే ఒక్క అంశం బడ్జెట్లో లేదన్నారు.