Monday, December 23, 2024

రేవంత్ ఆర్‌ఎస్‌ఎస్ ఏజెంట్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ తీరుపై రైతు వేదికల్లో తీర్మానాలు
* ప్రతి రైతు వేదికలో వెయ్యి మందికి తగ్గకుండా రైతుల సంతకాలతో తీర్మానం
* కెసిఆర్‌ది మూడు పంటల నినాదం… కాంగ్రెస్‌దేమో మూడు గంటల కరెంట్ విధానం
* రాహుల్‌గాంధీ లీడర్ కాదు.. రీడర్, ఆయనకు ఎడ్లు తెల్వయి… వడ్లు తెల్వయి
* రాష్ట్రంలో ఉన్నది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు… చంద్రబాబు కాంగ్రెస్
* గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి అనే గాడ్సె చొచ్చిండు
* రైతులను చైతన్యవంతం చేస్తాం… కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బయటపెడతాం
రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
జగిత్యాల ః కరెంట్ విధానంలో కాంగ్రెస్ పార్టీ దుర్నీతిపై రైతు వేదికల ద్వారా తీర్మానాలు చేస్తామని, రైతులను చైతన్యవంతం చేసి కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని బయటపెడతామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎల్.రమణ తండ్రి ఎల్. గంగారాం ఇటీవల మృతి చెందగా రమణను పరామర్శించేందుకు ఆదివారం జగిత్యాలకు వచ్చిన కెటిఆర్ పరామర్శ అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.వ్యవసాయం, రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉన్న అవగాహన రాహిత్యం ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాటల్లో స్పష్టమైందన్నారు.

రాష్ట్రంలో ఐదు దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ వ్యవసాయానికి సరిపడా కరెంట్, సాగు నీరు ఇవ్వకపోగా, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించకుండా వ్యవసాయ రంగాన్ని అధోగతి పాలు చేసిందన్నారు. పంటలు ఎండిపోయి, పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలై రైతుల ఆత్మహత్యలకు కారణమైందన్నారు.సిఎం కెసిఆర్‌ది ఏడాదిలో మూడు పంటల సాగు నినాదమైతే, కాంగ్రెస్ పార్టీది మూడు గంటల విధానమని మంత్రి అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరఫరా చేస్తే సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడితే ఆ పార్టీ నేతలు కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. 2014కు ముందు పల్లెలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు వెళ్లిన బంధువులు, కుటుంబ సభ్యులు స్నానం చేద్దామన్నా కరెంట్ ఉండేది కాదన్నారు.

స్నానం కోసం ఐదు, పది నిమిషాలు కరెంట్ ఇవ్వాలని అధికారులను బ్రతిమిలాడితే తప్పా ఇచ్చే వారు కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ హాయాంలో రోజుకు ఆరు గంటల కరెంట్ ఇస్తామని చెప్పి కనీసం మూడు గంటలైనా సక్రమంగా ఇవ్వలేదన్నారు. ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచక రైతులను ఆరిగోస పెట్టుకున్నారని, ఎరువుల దుకాణాల ఎదుట రైతులు తమ చెప్పులను వరుసలో పెట్టి పడిగాపులు కాసింది నిజం కాదా.. ఎండాకాలంలో కరెంట్ లేక, సాగు నీరందక పంటలు ఎండిపోతే విద్యుత్ సబ్‌స్టేషన్‌ల ఎదుట రైతులు ఆందోళన చేసింది… విద్యుత్ అధికారులను గదిలో బంధించి వాస్తవం కాదా అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాతే రైతుల్లో తేజస్సు…
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రైతుల్లో కొంత తేజస్సు కనిపిస్తోందని, దానిని నాశనం చేయాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని మంత్రి కెటిఆర్ అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు అభివృద్ది చేశామని, కొత్తగా ప్రాజెక్టులు నిర్మించి సాగు నీటి సమస్యలను దూరం చేశామన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను తీసుకొచ్చామన్నారు. భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రం తర్వాత వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దేశంలో 28 రాష్ట్రాలుండగా కాంగ్రెస్, బిజెపి పాలిస్తున్న రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నారా చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

మూడు ఎకరాలు ఉంటే 3 గంటల కరెంట్ సరిపోతుందని మాట్లాడిన రేవంత్‌రెడ్డి మాటల వెనుక ఆంతర్యమేమిటని, ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలుగా చెప్పుకుంటున్న జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎందుకు మాట్లాడరని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ రాబంధులుగా వ్యవహరించి రాచి రంపాన పెడుతోందని, మూడెకరాలకు మూడు గంటల కరెంట్ చాలని అంటున్న కాంగ్రెస్ సన్నాసుల మాట విందామా.. రైతుల గురించి నిరంతరం ఆలోచించే కెసిఆర్ పక్కన నిలబడదామా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు.
రాహుల్ గాంధీ లీడర్ కాదు… రీడర్
రాహుల్‌గాంధీ లీడర్ కాదు… రీడర్ అని, రాహూల్‌కు పబ్‌లు, క్లబ్‌లు తప్పా ఎడ్లు తెల్వయి… వడ్లు తెల్వయని మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.80 వేల కోట్లు అయితే లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి పునరుజ్జీవ పథకంలో భాగంగా కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పికి నీటిని తరలిస్తున్నామని, 160 కిలోమీటర్ల మేర వరద కాల్వ నిండు కుండను తలపిస్తోందన్నారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మహత్యం కాదా అని ప్రశ్నించారు.

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రివర్స్ పంపింగ్ ద్వారా ఇప్పటికే ఎస్‌ఆర్‌ఎస్‌పిలోకి మూడు, నాలుగు టిఎంసిల నీరు చేరింది వాస్తవం కాదా… ?, కాళేశ్వరం నీటితో చెరువులు, కుంటలు నింపింది నిజం కాదా అని కాంగ్రెస్ నేతలను మంత్రి సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఓ చిల్లర పార్టీ… చిల్లర నాయకులని, ఐదు దశాబ్దాల దిక్కు మాలిన కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడ్డారని, ఇది చాలదన్నట్లు తాము అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంట్ ఇస్తామంటూ వారి నిజ స్వరూపాన్ని బయటపెట్టారన్నారు. కాంగ్రెస్ దుర్నీతిని ఎండగడతామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల పాటు రైతుల తీర్మాణాలు…
సోమవారం నుంచి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల్లో 24 గంటల కరెంట్‌పై రైతులతో తీర్మానాలు చేయిస్తామన్నారు. ప్రతి రైతు వేదికలో వెయ్యి మంది రైతులకు తగ్గకుండా సంతకాలతో తీర్మాణాలు చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుడతామన్నారు. రైతాంగాన్ని చైతన్యవంతం చేస్తామని, కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని బయటపెడతామన్నారు. సబ్‌స్టేషన్‌ల చుట్టూ తిరుగుతూ లాగ్‌బుక్‌లంటూ కాంగ్రెస్ నేతలు కొత్త రాజకీయం చేస్తున్నారని, 24 గంటల కరెంట్‌పై ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రమ్మంటూ కెటిఆర్ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.

2004కు ముందుకు చంద్రబాబు పాలనలో కరెంట్ ఎలా ఉండేది.. 2014కు ముందు కాంగ్రెస్ పాలనలో ఎలా ఉంది… 2014 తర్వాత కరెంట్ ఎలా ఉంటుందో తెలంగాణలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. ఇది రాజకీయ సమస్య కాదని, రైతుల సమస్య అన్నారు. రైతు సంక్షేమం కోసం కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయంటూ ఇతర రాష్ట్రాల రైతులు మెచ్చుకుంటున్నారని, ఆప్‌కా బార్ కిసాన్ సర్కార్ అంటూ కెసిఆర్‌కు మద్దతుగా నిలుస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అర్ధం చేసుకోలేకపోతున్నారని అన్నారు.
గాంధీభవన్‌లో గాడ్సె రూపంలో రేవంత్ దూరాడు
రేవంత్‌రెడ్డి గాడ్సె రూపంలో గాంధీభవన్‌లో దూరాడని, బిజెపితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోడీ తీరును ఎండగడుతూ రేవంత్‌రెడ్డి ఏనాడు మాట్లాడలేదన్నారు. రేవంత్‌రెడ్డి పూర్వశ్రమంంలో ఆర్‌ఎస్‌ఎస్, ఎబివిపి కార్యకర్త అని, ఆ అనుబంధంతోనే బిజెపితో లోపాయికారి ఒప్పందం చేసుకుని డ్రామాలు ఆడుతున్నాడన్నారు. బిజెపికి బిఆర్‌ఎస్ బి టీం అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని, ఎవరికి ఎవరు బి టీం అనేది ప్రజలందరకీ తెలుసునన్నారు. వైఎస్ హాయంలో ఉచిత విద్యుత్ తెచ్చింది తామేనని, ఉచిత విద్యుత్ తమ పేటెంట్ అని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారని, అయితే రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలని ఎలా మాట్లాడతాడని ప్రశ్నించారు. ఇక్కడ వైఎస్ కాంగ్రెస్ లేదని, దానిని వైఎస్ కొడుకు జగన్ ఆంధ్రాకు తీసుకెళ్లాడన్నారు.

ఇక్కడ ఉన్నది ఒరిజినల్ కాంగ్రెస్ కాదని, చంద్రబాబు కాంగ్రెస్ అని అన్నారు. ఆనాడు చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ అంటే చంద్రబాబు వద్ద శిష్యరికం చేసిన ఈ చోటా చంద్రబాబు మూడు గంటల కరెంట్ అంటున్నాడన్నారు. రేవంత్‌రెడ్డి మాటలపై రాష్ట్ర వ్యాప్తంగా తీర్పు కోరదామని, 24 గంటల ఉచిత విద్యుత్ అనే సింగిల్ పాయింట్ ఏజెండాతో ప్రజల దగ్గరకు వెళదామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయని, వ్యవసాయానికి కీడు చేసే కాంగ్రెస్ కావాలో, మేలు చేసే బిఆర్‌ఎస్ కావాలో వారే తీర్పు చెబుతారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జెడ్‌పి చైర్‌పర్సన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News