రైతు భరోసా రూ.15వేలు ఇస్తామని
రూ.12వేలకు కుదించారు
మేము రూ.10వేలు ఇస్తే బిచ్చం
అన్నారు కెసిఆర్ రైతుబంధువు..
రేవంత్ రెడ్డి రైతు రాబంధువుగా
మిగిలిపోతారు ఇప్పుడు రాహుల్
గాంధీకి తెలంగాణకు వచ్చే
దమ్ముందా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై
దుష్ప్రచారం కాంగ్రెస్ సర్కార్‌పై
కెటిఆర్ ఫైర్ నేడు రైతాంగానికి
సంఘీభావంగా నిరసనలకు పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువు అయ్యిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇస్తామని పచ్చి మోసానికి సిఎం రేవంత్ తెరదీశారని ఆరోపించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75 ఏళ్ల సంబరాల సందర్భంగా..దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్నది రైతన్నలే అనే సందేశాన్ని ఇస్తూ ప్రభుత్వం 15 వేలు ఇస్తామని చెప్పి 12 వేలే అంటోందని విమర్శించారు. దానికి కూడా సవాలక్ష కండీషన్లు పెట్టారని పేర్కొన్నారు. జనవరి 26న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా మోసానికి అధికారికంగా తెరలేపున్నదని ఆరోపించారు. రైతాంగం కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించదని అన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ తప్పుడు హామీలిచ్చిందని మండిపడ్డారు.
రైతుబంధు కింద రూ.10 వేలు ఇస్తే అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి బిచ్చం అన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి..? అని ప్రశ్నించారు. రైతు భరోసా రూ.12 వేలకు కుదించి సంబరాలు చేయాలని కాంగ్రెస్ అంటోందని, ఎందుకు సంబరాలు చేయాలని అడిగారు. రైతన్నలకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి కోతలు పెట్టినందుకా అని నిలదీశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం మాయమాటలు చెప్పి మోసం చేసినందుకు పాలాభిషేకాలు చేయాలా..? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పలువురు పార్టీ నేతలతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో పలు సందర్భాలలో రైతు భరోసాపై పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు, ప్రసంగాలతో పాటు వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ చెప్పిన ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే.. వెంటనే వస్తానని రాహుల్‌గాంధీ అన్నారని, ఇప్పుడు తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. రాహుల్ ఎక్కడున్నారని అడిగారు. రాహుల్ గాంధీకి తెలంగాణకు వచ్చే దమ్ము ఉందా..? అని ప్రశ్నించారు. దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ అన్నారని, అధికారంలోకి రాగానే రాష్ట్రం అప్పులపాలైందని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగోలేనిది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు అని, కాంగ్రెస్ నేతల మానసిక పరిస్థితి అని ఎద్దేవా చేశారు. సరిదిద్దాల్సిన స్థానంలో కూర్చొని రాష్ట్రం గురించి తక్కువగా మాట్లాడతారా..? అని నిలదీశారు. వందరోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ రైతులకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలపై నిలదీస్తే దివాళా కోరు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వందరోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని మోసం చేశారని అన్నారు.
మోసం అనే పదం చిన్నదైపోతది
రైతుబంధు,రైతు రుణమాఫీ కోసం కెసిఆర్ లక్ష కోట్లు రైతులకు నేరుగా ఖాతాల్లో వేశారని కెటిఆర్ తెలిపారు. కెసిఆర్ రైతుబంధువుగానే ఉంటారు.. రేవంత్‌రెడ్డి రాబందుగా చరిత్రలో మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి తెలంగాణకు వచ్చే దమ్ము ఉందా..? అని ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీని రైతన్నలు పాతరేస్తారని కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ చేసిన దానికి మోసం అనే పదం చిన్నదైపోతదని, దగా, నయవంచన పదాలు కూడా సరిపోవని విమర్శించారు. కాంగ్రెస్ అబద్దాలకు డిక్షనరీలో కొత్త పదాలు కనిపెట్టాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రైతాంగానికి చేసిన ఈ ద్రోహం.. తెలంగాణ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.
హామీలు అమలు చేయమంటే తప్పుడు కేసులు పెడుతున్నారు
రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని సిఎం చెప్పారని, అది తన మాట కాదు.. సోనియాగాంధీ మాట అని ఆనాడు రేవంత్‌రెడ్డి చెప్పారని కెటిఆర్ గుర్తు చేశారు. రైతు భరోసా గురించి రేవంత్‌రెడ్డి చెబితే నమ్మడం లేదని.. వరంగల్ డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీతో చెప్పించారని పేర్కొన్నారు. అది డిక్లరేషన్ కాదు.. రైతులకు ఇచ్చిన గ్యారెంటీ అని రైతు భరోసా గురించి ఆనాడు రాహుల్ చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయమంటే తప్పుడు కేసులు పెడుతున్నారని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల పరిస్థితి ఏంటీ..? అని నిలదీశారు. ఎవరిని మోసం చేయడానికి ఇన్ని హామీలిచ్చారో చెప్పాలని ధ్వజమెత్తారు.
హైడ్రా, మూసీ పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సిఎం రేవంత్‌రెడ్డి నాశనం చేశారని మండిపడ్డారు. విధ్వంసకరమైన ఆలోచనలతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు.హైడ్రా, మూసీ పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటే పెట్టుబడులు పెట్టడానికి, అప్పులు ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తారు..? అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ హయాంలో ఏటా రూ.41 వేల కోట్ల అప్పు చేస్తే, ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షా 38 వేల కోట్ల అప్పులు చేసిందని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం అప్పులు చేస్తే అభివృద్ధి చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్ల అప్పులతో ఏం అభివృద్ధి చేసిందని అడిగారు. అప్పులు తెచ్చిన డబ్బులు ఢిల్లీకి మూటలుగా పోతున్నాయా..? అని ప్రశ్నించారు. కొత్త పెట్టుబడులు రావడం లేదు.. ఉన్న కంపెనీలు పోతున్నాయని పేర్కొన్నారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కూడా అప్పులు, ఇతర అంశాలపై అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. ఉద్యోగుల పిఆర్‌సి ఎగ్గొట్టేందుకు అబద్దపు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పడానికి సిగ్గనిపిస్తలేదా..? అని మండిపడ్డారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్దమా..? అని కెటిఆర్ సవాల్ విసిరారు. హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని మరోసారి స్పష్టం చేశారు.తాను కడుపు కట్టుకుంటే రూ.40 వేల కోట్లు వస్తాయని రేవంత్ రెడ్డి అన్నారని, మరి ఏమైందని అడిగారు. ప్రభుత్వ ఖర్చులన్నీ పోను నెలకు రూ.1,734 కోట్ల మిగులు ఉందని, వాస్తవాలు ఇలా ఉంటే.. రూ.4 వేల కోట్ల లోటు ఉందని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, కుట్ర అని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు
రైతాంగానికి సంఘీభావంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బిఆర్‌ఎస్ శ్రేణులకు కెటిఆర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు తెలుపుతామని అన్నారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వరో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు భరోసాపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. హార్టికల్చర్ రైతులకు రైతు భరోసా ఇస్తారా..ఇవ్వరా..? ప్రభుత్వం స్పష్టత లేదని అన్నారు. ఉద్యోగులకు భూమితో సంబంధం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గండం దాటేందుకు రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. రైతుబంధు పథకం ఉండాలా.. వద్దా..? అనేది రైతులు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోండి, నిలదీయండి అని కెటిఆర్ పిలుపునిచ్చారు.