Wednesday, January 22, 2025

రాజకీయంగా ఎదుర్కోలేకనే మాపై కుట్రలు

- Advertisement -
- Advertisement -

గృహ ప్రవేశం దావత్‌ను రేవ్ పార్టీగా
చిత్రీకరించారు అక్రమ కేసులతో
మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర
మిల్లీ గ్రాము డ్రగ్స్ దొరక్కపోయినా కేసు
ఎలా పెడతారు? చిల్లర ప్రయత్నాలకు
బెదరం కాంగ్రెస్ వైఫల్యాలపై
పోరాడుతూనే ఉంటాం: కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాజకీయంగా తమను ఎదుర్కోలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం తమ కుటుంబ సభ్యులు, బందువులపై కేసులు బనాయించి తమమానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామనే కుట్రలతో తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిడపడ్డారు. చిల్లర ప్రయత్నాలు, కేసులకు భయపడమని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ ఘటనపై ఆదివారం నందినగర్‌లోని నివాసంలో బిఆర్‌ఎస్ పార్టీ నేతలతో కలిసి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వరుస వైఫల్యాలు చెందిందని విమర్శించారు. ఇచ్చిన 6 గ్యారెంటీలను రేవంత్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

11 నెలల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. 11 నెలల కాంగ్రెస్ వైఫల్యాలను బయటపెడుతున్నామని చెప్పారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గాలికొదిలేశారని విమర్శించారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేకపోతున్నారని మండిపడ్డారు. తమ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు. తమ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. మూసీ ప్రక్షాళన స్కాం, సిఎం బావమరిది స్కాం, ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన హామీల అమలుకు ప్రతిపక్ష పార్టీ తాము ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇరకాటపెడుతూనే ఉన్నామని, అందుకే తమపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయినా తాము ఇలాంటి బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు

ఆది ఫామ్‌హౌజ్ కాదు… నా బావమరిది ఇల్లు

జన్వాడలో తన బావమరిది ఇళ్లు కట్టుకున్నారని, అసలు అది ఫామ్‌హౌజ్ కాదు…తన బావమరిది ది రాజ్ పాకాల ఇల్లు అని కెటిఆర్ తెలిపారు. గృహప్రవేశం చేసిన రోజున అందరినీ పిలిచి దావత్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆ ఫంక్షన్‌ను నిర్వహించారని చెప్పారు. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి దావత్ చేసుకోవడం కూడా తప్పేనా..? అని ప్రశ్నించారు. దానికి కూడా అధికారులు, పోలీసుల అనుమతి తీసుకోవాలా..? అని అడిగారు. ప్రజల్లో తమను నెగిటివ్ చేసే ప్రయత్నంలో భాగంగానే రేవ్ పార్టీ అని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ దొరకలేదని ఎక్సైజ్ అధికారులు చెప్పారని తెలిపారు.ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీలత, సిఐ మీడియాతో మాట్లాడిన వీడియోలను కెటిఆర్ మీడియాకు చూపించారు. ఉదయం ఎక్సైజ్ కేసు.. సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మారిపోయిందని అన్నారు.

పోలీసుల సోదాలలో ఒక్క మిల్లీ గ్రామ్ డ్రగ్ అయినా దొరికిందా..? అని ప్రశ్నించారు. అసలు డ్రగ్స్ ఎవరు, ఎక్కడ తీసుకున్నారో తెలుసుకోండి అని సూచించారు. 14 మందికి యూరిన్ టెస్ట్ నిర్వహిస్తే 13 మందికి నెగిటివ్ వచ్చిందని, ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఆ ఒక్కరు ఎక్కడ డ్రగ్స్ తీసుకోన్నారో శోధించాలని అన్నారు. తమ కుటుంబ సభ్యులు ఫంక్షన్‌కు వస్తే.. పలువురు మహిళలు, పలువురు పురుషులు అని వార్తలు రాశారని, వారంతా తమ కుటుంబ సభ్యులు, బంధువులు అని పేర్కొన్నారు. ఆ పార్టీలో 70 ఏళ్ల వయసు ఉన్న తమ అత్తమ్మతో పాటు 2 ఏళ్ల వయసు ఉన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారని, దానిని రేవ్ పార్టీ అని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీలో 4 లీటర్ల మద్యం మాత్రమే ఉండాలట, ఈ విషయం తమకు తెలియదని, కానీ ఏడెనిమిది బాటిళ్లు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారని, దీనిని పట్టుకుని ఎన్‌డిపిఎస్ సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు, వినియోగిస్తున్నట్లు ఎన్‌డిపిఎస్ 27,28 సెక్షన్ల కింద కేసులు పెట్టారని, ఇందులో సరఫరా చేస్తున్నది ఎవరు..వినియోగిస్తున్నది ఎవరు అని అడిగారు. ఇవన్నీ పైనుంచి వచ్చిన ఆదేశాలతో అధికారులు తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. తనను, తన పార్టీ ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు కేసులు పెడితే బయటపడే వాళ్లం కాదు అని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన రోజే చావుకు తెగించి వచ్చామని, ఇలాంటి బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదని హెచ్చిరించారు.

కొండను తవ్వి ఎలుకను పట్టారు

బాంబులు బాంబులు అంటే ఏదో అనుకున్నామని, కానీ ఇదేనా..? అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఫ్యామిలీ పార్టీ ఫామ్‌హౌస్‌గా చిత్రీకరించారని మండిపడ్డారు. తాను అదే పార్టీలో ఉండి అక్కడి నుంచి ముందే వెళ్లినట్లుగా మీడియా చాలా దుర్మార్గంగా ప్రచారం చేసిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఎర్రవెళ్లిలో తమ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌తో సమావేశమయ్యాయని, అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చి తిని పడుకున్నారని పేర్కొన్నారు. వాస్తవం ఇలా ఉంటే, తన పట్ల దుర్మార్గంగా ఇలా ప్రచారం చేయవచ్చా..? అని మీడియాను ప్రశ్నించారు. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నంత మాత్రాన తాము పబ్లిక్ ప్రాపర్టీ కాదు అని పేర్కొన్నారు. రాజ్ పాకాల అనే అతను ఏ తప్పు చేశారని దాదాపు 22 గంటలకు పైగా ఆయనను, ఆయన సోదరుడి ఇళ్ల వద్ద సోదాల పేరుతో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు.

కెసిఆర్ నేర్పిన ఉద్యమ బాటలోనే నడుస్తాం

తమ పార్టీ అధినేత కెసిఆర్ నేర్పిన ఉద్యమ బాటలోనే నడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగుడుతూనే ఉంటామని కెటిఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీసులను పోలీసులే కొట్టే పరిస్థితి వచ్చిందని, 39 మంది పోలీసులను సస్పెండ్ చేశారని, ముందు ఆ విషయాలు చూసుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి చేయాల్సిన పని చేయకుండా ఇవేం పనులు అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News