Sunday, December 22, 2024

రుణమాఫీ తీరు చూస్తుంటే ‘చారాణా కోడికి బారాణా మసాలా’ అన్నట్లుంది

- Advertisement -
- Advertisement -

ఊరించి ఏడు నెలలు ఏమార్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ తీరు చూస్తే ‘చారాణా కోడికి బారాణా మసాలా’ అన్నట్లు ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. రుణమాఫీ ప్రక్రియపై కెటిఆర్ ఎక్స్ వేదికగా హస్తం పార్టీపై ఘాటుగా స్పందించారు. రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలు అయ్యాయని ఆరోపించారు. అన్నివిధాలా అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేవారు లేరని, రైతన్నలు తమ గోడు చెప్పుకుందామంటే వినేవారు లేరని పేర్కొన్నారు. అర్హులైన లబ్దిదారులు రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలని ప్రశ్నించారు. నలభై లక్షల మందిలో మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా..? ముప్పై లక్షల మందిని మోసం చేసినందుకా..? అని నిలదీశారు.

రైతు భరోసా డబ్బులు ఇంకా వేయలేదు : రెండు సీజన్లు అయినా రైతుభరోసా ఇంకా ప్రారంభించలేదని, జూన్‌లో వేయాల్సిన రైతుభరోసా నిధులను జులై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలేదని కెటిఆర్ ఆక్షేపించారు. కౌలు రైతులకు ఇస్తానన్న 15 వేల రూపాయలు కూడా ఇవ్వలేదని, రైతు కూలీలకు ఇచ్చిన 12 వేల రూపాయల హామీ ఇంకా అమలు చెయ్యలేదని మండిపడ్డారు. మభ్యపెట్టే పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్, ఇప్పుడేమో ఫండ్స్ డైవర్షన్…జె తెలంగాణ అని పేర్కొన్నారు.

రాష్ట్రం అభివృద్ధి చెందిందడానికి నీతి ఆయోగ్ నివేదిక నిదర్శనం : కెటిఆర్
కెసిఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టిందనడానికి తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ లెక్కలే నిదర్శనమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. పేదరిక నిర్మూలనలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సహా సుస్థిర అభివృద్ధి కోసం కెసిఆర్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. తెలంగాణ మోడల్ సాధించిన ఘన విజయాలను కేంద్ర సంస్థలు ఎన్నో సందర్భాల్లో ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. చాలా రంగాల్లో రాష్ట్రం సాధించిన మార్కులు జాతీయ సగటును మించి ఉండటం గత పదేళ్ల అభివృద్ధిని ప్రతిబింబిస్తుందన్నారు. తక్కువ క్లీన్ ఎనర్జీని అందించటంలో తెలంగాణ వందకు వంద మార్కులు తెచ్చుకోవటం విశేషమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News