డీలిమిటేషన్ అంశంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. దేశంలో అందరికంటే ముందు డీలిమిటేషన్ వల్ల తెలంగాణకి, దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టాల గురించి మాట్లాడింది తమ పార్టీ అని గుర్తు చేశారు. డిఎంకె పార్టీ కన్నా ముందే చాలా కాలం నుంచి డీ లిమిటేషన్ వల్ల దక్షిణాదికి జరగబోయే నష్టం గురించి జాతీయ వేదికలపైన తాము మాట్లాడుతున్నామని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం
సోమవారం పిలిచిన అఖిలపక్ష సమావేశ నిర్వహణపైన, కాంగ్రెస్ పార్టీ వైఖరిపైన వారికే స్పష్టత లేదని విమర్శించారు. దేశ ప్రయోజనాల కోసం పాటుపడిన దక్షిణాది రాష్ట్రాలకు డీ లిమిటేషన్ విధానం వల్ల నష్టం జరుగుతుందని తాము చెబుతూ వస్తున్నామని అన్నారు. డీ లిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పైన పోరాడుతామని స్పష్టం చేశారు. డీ లిమిటేషన్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఉన్న బాధ్యత ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న చెన్నైలో జరిగే డిఎంకె సమావేశానికి బిఆర్‌ఎస్ తరఫున తాను హాజరై తమ పార్టీ విధానాన్ని బలంగా వినిపిస్తామని తెలిపారు.