డీలిమిటేషన్ ప్రతిపాదన వలన ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరిగి మరికొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం వల్ల అనేక ప్రాంతీయ మధ్య అసమానతలు ఏర్పడి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో శనివారం జరగనున్న దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి హాజరయ్యేందుకు శుక్రవారం రాత్రి కెటిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రతినిధి బృందం చెన్నై చేరుకున్నది. ఈ సందర్భంగా చెన్నైలో కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. దక్షిణ భారతదేశానికి కేంద్రం ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులు మరింతగా తగ్గిపోతాయని చెప్పారు. కేంద్రం నుంచి అందే సహాయంతో పాటు దక్షిణాదికి రాజకీయ ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోతుందని అన్నారు.
భారతదేశ అభివృద్ధికి సహకరించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతనిధినిద్యం తగ్గడం అన్యాయం అని పేర్కొన్నారు. జనాభా నియంత్రణ కోసం పాటుపడిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, డిలిమిటేషన్ ప్రతిపాదనను తమ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తుందని వెల్లడించారు. భారతదేశ చరిత్రలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత కీలకమైనవి అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపైన అందరం గట్టిగా కొట్లాడాలి.. వ్యతిరేకించాలి అని, లేకుంటే భవిష్యత్తు తరాలు క్షమించవు అని పేర్కొన్నారు. ఇప్పుడు మౌనంగా ఉంటే చరిత్ర మనల్ని క్షమించదని అన్నారు. అత్యంత కీలకమైన ఈ సందర్భంలో అందరూ కలిసి ఐక్యంగా ముందుకు నడవాలని కోరారు. భవిష్యత్తు రాజకీయాలను సమూలంగా మార్చే ఈ పరిణామం పైన అందరూ మాట్లాడాలని అన్నారు.