Monday, December 23, 2024

మేడిగడ్డ కుంగుబాటు కాంగ్రెస్ కుట్ర

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మేడిగడ్డ బారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి కాంగ్రెస్ కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చెక్కుచెదరని బ్యారేజ్ ఎన్నికల ముందు అలా ఎందుకు అవుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే బ్యారేజ్ పరిస్థితి ఎందుకు అలా అవుతుందని, మున్ముందు బారేజ్‌కు ఏమీ జరిగినా ఈ ప్రభుత్వ కుట్ర ఫలితమే అని భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలున్నాయో తమకు తెలుసు అని, వారు బారేజ్‌ను ఏమైనా చేయగలరని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే యత్నం చేస్తోందని పేర్కొన్నారు. ఎన్‌డిఎస్‌ఎ రిపోర్టును అడ్డం పెట్టుకుని నీళ్లను ఎత్తిపోయడం లేదని మండిపడ్డారు. అది ఎన్‌డిఎస్‌ఎ రిపోర్టు కాదు అది ఎన్‌డిఎ రిపోర్టు అని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎల్లంపల్లి నుంచి నీరు ఎత్తిపోయడం సంతోషమే, అయితే 2 టిఎంసిల నీరు ఎత్తి పోస్తే సరిపోదని వ్యాఖ్యానించారు.

కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి ప్రభుత్వానికి అహం అడ్డు వస్తోందని చెప్పారు. బిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో శనివారం కెటిఆర్ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలనుకుని విఫలమయ్యారని కెటిఆర్ విమర్శించారు. తాము మేడిగడ్డ వెళ్ళినపుడు పది లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని, 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా మేడిగడ్డ బారేజ్ తట్టుకుని నిలబడిందని వివరించారు. కాంగ్రెస్, బిజెపిలు ఏ విషయంలో విభేదించినా కాళేశ్వరం మీద ఓకే వైఖరితో ఉన్నారని అన్నారు. ఉత్తమ్ ఎన్‌డిఎస్‌ఎ రిపోర్ట్ ఆధారంగా నడుచుకుంటారంటున్నారని, కానీ ఆయన బిజెపి చెప్పినట్టు నడుచుకుంటారని ఆరోపించారు. పోలవరం కాఫర్ డాం కొట్టుకుపోయినపుడు ఎన్‌డిఎస్‌ఎ రిపోర్టు ఎక్కడికి పోయిందని నిలదీశారు. 90 టిఎంసిల నీళ్లు గోదావరిలో వృధాగా పోతున్నాయని, 90 టిఎంసిల నీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో సమానమని అన్నారు.

కాళేశ్వరం అనేది కరువుకు ఇన్సూరెన్స్
భేషజాలకు పోకుండా ..కన్నె పల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలని కెటిఆర్ కోరారు. ఎల్లంపల్లిలో 16 టిఎంసిల నీళ్ళే ఉన్నాయని, పద్నాలుగు టిఎంసిల నీళ్లు హైదరాబాద్‌కు నిల్వ ఉంచాలని, రెండు టిఎంసిల నీళ్లు లిఫ్ట్ చేశాకే ఆపే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఎల్లంపల్లి నీళ్లు మిడ్ మానేరు, మిగతా రిజర్వాయర్లు నింపడానికి సరిపోదని చెప్పారు. కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదని పేర్కొన్నారు. ఇపుడు ఏ ఎన్నికలు లేవు అని, రాజకీయం చేయకండి అని కోరారు. కాళేశ్వరం అనేది కరువుకు ఇన్సూరెన్స్ అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే రాష్ట్రంలో వర్షపాతం 40 శాతం లోటు ఉందని, లిఫ్ట్‌లకు విద్యుత్ ఖర్చయితే అవుతుంది ..రైతులకు నీళ్లు ఇవ్వడం కంటే ఆ ఖర్చు ముఖ్యమా..? అని ప్రశ్నించారు. గల్ఫ్‌లో తాగు నీళ్ల కోసం ఎంతయినా ఖర్చు పెడతారని చెప్పారు.

అవినీతి కోసమే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టా..?
కాళేశ్వరం బహుళ ప్రయోజనాలున్న ప్రాజెక్టు అని, కాళేశ్వరంకు డబ్బులవుతున్నాయని బాధపడుతున్నవారు, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు లక్షా 50 వేల కోట్ల రూపాయలు అవసరమవుతుందంటున్నారని కెటిఆర్ పేర్కొన్నారు. అది ఎవరికి లాభం..? అని అడిగారు. అవినీతి కోసమే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టా..? అని ప్రశ్నించారు. నీళ్లున్నపుడే ఖాళీ ప్రాజెక్టులు నింపి పెట్టుకోవాలని, ఆగస్టు 2 తర్వాత కెసిఆర్‌తో చర్చించి కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్ల విడుదల కోసం కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. బారేజ్ గేట్లు తెరిచి ఉన్నా నీళ్లను లిఫ్ట్ చేసుకోవచ్చని ఇంజినీర్లు చెబుతున్నారని, సెప్టెంబర్‌లో నీళ్లు లిఫ్ట్ చేయాలనీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుందని, అది సరికాదని అన్నారు.

తాము కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టినా సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయామని చెప్పారు. చేసింది సరిగా చెప్పుకోలేకే ఎన్నికల్లో ఓడిపోయామని తెలిపారు. మెట్రో అలైన్‌మెంట్‌ను ఎంఐఎం మార్చమని ఒత్తిడి చేయడం వల్లే పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగలేదని పేర్కొన్నారు. ఈ సిఎం ప్రతిపక్షనేత అనే మూడ్‌లోనే ఉన్నారని తెలిపారు. ఎల్ అండ్ టి గురించి సిఎం అసెంబ్లీలో మాట్లాడిన తీరు బాగాలేదని, ఇది పెట్టుబడిదారులకు తప్పుడు సందేశం వెళ్లేలా చేసిందని ఆరోపించారు. ఎల్ అండ్ టి చిన్నా చితకా కంపెనీనా..? అని అడిగారు. సిఎం అలా మాట్లాడితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని క్యాన్సర్,ఎయిడ్స్‌తో ఏ సిఎం అయినా పోలుస్తారా..?
సిఎంకు అన్నింటిలో స్కాంలు కనిపిస్తున్నాయని కెటిఆర్ ఆరోపించారు. కోటి బతుకమ్మ చీరల పంపిణీలో స్కాం ఎక్కడ కనిపిస్తోందని అడిగారు. సిఎం రేవంత్ బతుకమ్మ చీరలతో సహా దేంట్లోనైనా విచారణ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని క్యాన్సర్,ఎయిడ్స్‌తో ఏ సిఎం అయినా పోలుస్తారా..?… ఇంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉంటుందా..? అని ప్రశ్నించారు. షా వలి దర్గాపై తాము సుప్రీం కోర్టులో ఇచ్చిన అఫిడవిట్ కరెక్టే అని, రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా వెళుతారా..? అని అడిగారు. ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టులో రెయిల్ కారిడార్ ఉందని,భూసేకరణలో ఇబ్బందులు ఉండవని ఎయిర్ పోర్టుకు ఆ మార్గంలో మెట్రో ప్రతిపాదించామని తెలిపారు. సిఎంకు పేర్లు మార్చే పిచ్చి ఉందని, పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని విమర్శించారు. హైడ్రా కూడా అంతే అని పేర్కొన్నారు. సిఎం సోదరులు కొండల్ రెడ్డీ,తిరుపతి రెడ్డీ ఏం చేస్తున్నారో తమకు తెలుసు అని, అవసరమైనపుడు అన్నీ బయటపెడుతున్నామని అన్నారు. ఉదయ సింహ,ఫహీమ్ ఖురేషి,అజిత్ రెడ్డి,వేం నరేందర్ రెడ్డి షాడో కేబినెట్ నడుపుతున్నారని ఆరోపించారు.

ధరణి స్తానంలో ఏదీ వచ్చినా భూమేతే అవుతుంది
ధరణి స్తానంలో ఏదీ వచ్చినా భూమేతే అవుతుందని కెటిఆర్ అన్నారు. ఎక్కడేం జరుగుతుందో తమకు తెలుసు అని, అన్నీ బయటకు వస్తాయని చెప్పారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు వ్యయం పది రెట్లు పెంచుతున్నారు ..ఏం చేస్తారో చూద్దామని తెలిపారు. ఈ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి సమయం పూర్తి చేయాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మోటర్లకు మీటర్లు పెడుతారనే విషయంపై ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతోందని మండిపడ్డారు. సిఎం రేవంత్ అసెంబ్లీలో విడుదల చేసిన పత్రంలో శోధించి సాధించిందేమీ లేదని, ఉదయ్ స్కీం గురించి పత్రం విడుదల చేసి మోటార్లకు మీటర్లకు సంబంధించిన ఒప్పందం అని రేవంత్ అంటున్నారని అన్నారు. మోటార్లకు మీటర్ల నిబంధన కరోనా సమయంలో కేంద్రం పెట్టిందని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రతి రోజూ తెలంగాణ భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా అందుబాటులో ఉంటానని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News