Tuesday, November 5, 2024

బిజెపిపై పోరు దేశం ముందున్న ప్రధాన సమస్య: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని భావిస్తున్న ప్రతిపక్షాలు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల ఆధారంగా పోరాడాలని, అయితే దురదృష్టవశాత్తు అవి ఎవరినో గద్ద్దె దించాలన్న తపనతో అవి ఉన్నట్లు కనిపిస్తోందని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అభిప్రాయ పడ్డారు. దేశ సంక్షేమం విషయంలో బిఆర్‌ఎస్ ఎప్పుడూ రాజీ పడబోదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసే ఉమ్మడి అజెండా కలిగి ఉన్నాయని భావించే పార్టీలతోనే తమ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ‘ బిజెపిపై పోరు దేశం ముందున్న ప్రధాన సమస్యల ఆధారంగానే ఉండాలి. దురదృష్టవశాత్తు మనం అక్కడే తప్పటడుగు వేస్తున్నాం. ఒకరిని గద్దె దింపి మరొకరిని ఆ స్థానంలో కూర్చోబెట్టాలన్న తపనతో అవి ఉన్నట్లు కనిపిస్తోంది.

అది అజెండా కారాదు. దేశ మౌలిక ప్రాధాన్యాలను ఎలా తీర్చాలన్నదే అజెండా కావాలి’ అని ఆయన అన్నారు. అంతేకాదు ఎవరికో వ్యతిరేకంగా మీరు సంఘటితం కారాదు. ఏదో ఒకదాని కోసం సంఘటితం కావాలి. అది ఏమిటి? అదేమిటో ఎవరూ చెప్పలేకపోతున్నారు’ అని అన్నారు. పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి బిఆర్‌ఎస్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి బిఆర్ ఎస్ సిద్ధంగా ఉందని, గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకోవడమే లక్షంగా ప్రభావవంతమైన ప్రారంభం మొదలు పెట్టడానికి యత్నిస్తుందని చెప్పారు. కాంగ్రెస్, బిజెపిలను టార్గెట్ చేసిన కెటిఆర్.. ఈ జాతీయ పార్టీలు దేశానికి విపత్తుగా పరిణమించాయని, కాంగ్రెస్ లేదా బిజెపి ప్రధాన పార్టీగా ఉన్న ఏ కూటమి కూడా విజయం సాధించదని ఆయన పునరుద్ఘాటించారు. దేశానికి ముఖ్యమైన సంక్షేమ అజెండాతో రాజకీయ పార్టీలు కలవాలని ్పష్టం చేశారు.

నేడు దేశానికి కావలసింది ఉపాధి కల్పన, రైతులకు సంపద, సాగునీరు, గ్రామీణ జీవనోపాధే తప్ప హిజాబ్ లేదా హలాల్, మతం చుట్టూ తిరిగే చెత్త కాదన్నారు. భారత దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించే పార్టీలకు బిఆర్‌ఎస్ దూరమన్నారు. ‘కాంగ్రెస్ 50 ఏళ్లు, బిజెపి 15 ఏళ్లు దేశాన్ని పాలించాయి, రెండు పార్టీలు సక్రమంగా పని చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. గత 75 ఏళ్లలో దేశం వెనుకబడి ఉండడానికి ఈ రెండు పార్టీలే కారణం’ అని కెటిఆర్ అన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ అతి తక్కువ కాలంలో సంక్షేమ రంగాల్లో పురోగతి సాధించిందన్నారు. పాటాలో జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశానికి బెంగాల్ సిఎం మమత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లాంటి ప్రాంతీయ పార్టీ నేతలు హాజరు కావడం గురించి అడగ్గా ‘ వారికి వాళ్ల సొంత అజెండాలు, దేశం కోసం సొంత దార్శనికత ఉందని మీరు అర్థం చేసుకోవాలి. వాళ్లను నేను తప్పుబట్టలేను’ అని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News