హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఇడి దాడులు చేసి నెలరోజులు కావస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. బిజెపి, కాంగ్రెస్ నుంచి ఒక్క మాట ఎందుకు రాలేదని ప్రశ్నించారు. భారీగా డబ్బులు దొరికినట్టు మీడియాలో వార్తలు వచ్చినా కూడా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇడి దాడులు ముగిసిన వెంటనే అదానీతో మంత్రి పొంగులేటి రహస్యంగా సమావేశమయ్యారని ఆరోపణలు చేశారు.
తెలంగాణలో బకాసుర రాజ్యం నడుస్తున్నదని, కాంగ్రెస్ పాలన పేదలపాలిట భస్మాసుర హస్తంగా మారిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తన ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. కూకట్‌పల్లికి చెందిన బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, హైడ్రా అనే అరాచక సంస్థతో సిఎం రేవంత్ చేయించిన హత్య అని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి బుచ్చమ్మ కుటుంబాన్ని కెటిఆర్ సోమవారం పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘మీ ఇంటికి ఏ ఇబ్బందీ రాదు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాం. మీరు అధైర్య పడకండి.. అన్ని విధాలా సాయం చేస్తాం’ అని కెటిఆర్ ధైర్యం కల్పించారు.