రానున్న లోక్ సభ ఎన్నికల్లో పదేళ్ల నిజం, వందరోజుల అబద్ధం, పదేళ్ల విషం పోటీ పడుతున్నాయని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. పదేళ్ల నిజం బీఆర్ఎస్ అయితే వందరోజుల అబద్ధం కాంగ్రెస్ అనీ, పదేళ్ల విషం బిజేపీ అని ఆయన అబివర్ణించారు. తెలంగాణ భవన్ లో మల్కాజగిరి ఎంపీ సెగ్మెంట్ నేతలతో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్కాజిగిరినుంచి పోటీకి రమ్మని సవాల్ చేస్తే రేవంత్ రెడ్డి భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గానికి రేవంత్ చేసిందేమీ లేదన్నారు. రేవంత్ మాట్లాడటమే ఎక్కువనీ, చేతలు తక్కువేనని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదన్నారు. ఊళ్లలో రైతులు ఈ ప్రభుత్వాన్ని తిడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులంతా ఒక్క తాటిపైకి వచ్చి, మల్కాజిగిరిలో పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఇతర నాయకులతోపాటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కూడా హాజరయ్యారు.