హైదరాబాద్: ఫార్ములా ఈ కారు రేసు కేసు లొట్టపీసు కేసు అని, లొట్టపీసు ముఖ్యమంత్రి అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఘాటు విమర్శలు చేశారు. ఎసిబి కేసుతో వచ్చిన ఇబ్బందేమీ లేదని దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆగమ్యగోచరంగా ఉందని, చావునోట్ల తలపెట్టి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించారని ప్రశంసించారు. బిఆర్ఎస్ డైరీ ఆవిష్కరణ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిన్నామని, అప్పుడు ఉన్న ఇబ్బందులతో పోలీస్తే ఇవేమీ పెద్దవి కావని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని ధ్వజమెత్తారు. కెసిఆర్ తయారు చేసిన సైనికులమని కేసులకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఏడాది పాలన గడిచినా కాంగ్రెస్ ఇచ్చి హామీలు అమలు కావడంలేదని కెటిఆర్ విమర్శలు చేశారు. రైతు భరోసా కోసం ఎక్కడికక్కడ రైతులు నిలదీయాలని, రేవంత్ సర్కార్ రూపాయి కూడా రైతు బంధు ఇవ్వలేదని దుయ్యబట్టారు. రుణమాఫీ అంతా మోసంలా ఉందని, రుణమాఫీ జరగలేదని, దేవుళ్లపై సిఎం రేవంత్ రెడ్డి ఒట్టు పెట్టి మాట తప్పారని కెటిఆర్ మండిపడ్డారు. అప్పులు చేశామని తమపై తప్పుడు ప్రచారం చేశారని, భూకంపం వచ్చినా మేడిగడ్డ బ్యారేజ్‌కు ఏమీ కాదన్నారు. మరమ్మతులు చేసి నీళ్లు ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదని కెటిఆర్ ప్రశ్నించారు.