రైతుభరోసాతో సగం మందికి ధోకా చేసే కుట్ర
పిఎం కిసాన్ మార్గదర్శకాలు పెద్ద దగా పంట
పెట్టుబడి రైతు హక్కు.. భిక్ష కాదు అన్నదాతలకు
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : అన్నదాతలారా రైతు భరోసా ఎగవేతల మోసాన్ని ఎదిరించండి అంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలంగాణ రైతాంగానికి ఆదివారం బహిరంగ లేఖ రాశారు.ఆంక్షలు.. కోతలతో సగం మందికి ఎగనామం పెట్టే ఎత్తులను చిత్తుచేయాలని పేర్కొన్నారు. శాసనసభలో రైతు భరోసా మీద జరిగిన చర్చను మీరు చూసే వుంటారు.. రైతు భరోసా పైనా ఏమీ చెప్పకుండా..ఎటూ తేల్చకుండా సంబంధంలేని అంశాలపైకి చర్చను మళ్లించి అసలు సంగతిని అతి తెలివితో ముఖ్యమంత్రి పక్కదారి పట్టించారని అన్నారు. సిఎంకు బాగా అలవాటైన అటెన్షన్ డైవర్షన్ జిమ్మిక్కులను ప్రదర్శించారని విమర్శించారు. రైతు భరోసా పథకంపైన ఆంక్షలు.. అనుమానాలు.. సందేహాలు వేటికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం దాట వేసిందని పేర్కొన్నారు.
అంతేకాదు.. కాంగ్రెస్ మంత్రులు, ఎంఎల్‌ఎలు రైతుబంధు పథకంపై పచ్చి అబద్ధాలతో కూడిన దుష్ప్రచారం చేశారని, అన్నంపెట్టే రైతును దొంగలా చిత్రించే దుర్మార్గానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వరుస చూస్తే..కోతలు కొర్రీలు పెట్టి రైతు భరోసాను సగానికి సగం ఎగవేసే ఎత్తుగడతో ఉన్నట్టు అర్థమైందని తెలిపారు. తిండి పెట్టే రైతుకు తొండి చేసి పైసలు ఎగ్గొట్టే పన్నాగం ప్రారంభమైందని, విధివిధానాలు..మార్గదర్శకాలు ఏమీ సభలో చెప్పకుండా సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తాం అని ఒక మాట చెప్పి సర్కార్ తప్పించుకుందని ఆరోపించారు.
అన్నదాతలారా తస్మాత్ జాగ్రత్త : రైతుబంధును బొంద పెట్టి పనికిమాలిన షరతులు విధించి అరకొరగా రైతు భరోసా అమలు చేసి మిమ్ముల్ని నిండాముంచే ఒక పెద్ద దోఖా జరగబోతున్నదని రైతులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అప్రమత్తంగా వుండాల్సిన సమయం ఇది…మోసపోకుండా జాగ్రత్తగా వుండాల్సిన సందర్భం ఇది అని పేర్కొన్నారు. కుప్పకూలిన వ్యవసాయాన్ని నిలబెట్టాలన్న సంకల్పంతో తేడా చూపకుండా ప్రతి రైతుకూ పెట్టుబడి పైసలు ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. మొత్తం 11 సీజన్లలో 73 వేల కోట్ల రూపాయలను కర్షకుల ఖాతాల్లో జమ చేసింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు.
పీఎం కిసాన్ మార్గదర్శకాలు పెద్ద దగా
ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదని, అందరి రైతులకు ఇస్తారా లేదా అని శాసన సభలో ప్రశ్నిస్తే సప్పుడు లేదు సమాధానం లేదని కెటిఆర్ విమర్శించారు. పైగా రాళ్లూ రప్పలకు ఇచ్చి రైతుబంధు ఇచ్చి దుర్వినియోగం చేసారని కాంగ్రెస్ మంత్రులు, ఎంఎల్‌ఎలు అడ్డగోలుగా వాదించారని అన్నారు. ఇప్పుడు వేయాల్సింది ఎకరానికి రూ,7500 కాదు..రూ.17500 అని అన్నదాతలు గట్టిగా అడిగితీరాలని చెప్పారు. రైతు భరోసా విధి విధానాలు నిర్ణయిస్తామని కేబినెట్ సబ్ కమిటీ వేసి కాలయాపన చేశారని ఆరోపించారు.
ఎన్నికలు ఏరుదాటగానే తెప్ప తగలేస్తున్నారా..? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ మార్గదర్శకాలనే రైతు భరోసా కూడా వర్తింపజేస్తామని చెబుతున్నారని, అదే..గనుక జరిగితే రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా పెట్టుబడి పైసలు రావు అని పేర్కొన్నారు. 70 లక్షలకు పైగా రైతన్నలు వుంటే..30 లక్షల మందికి కూడా పీఎం కిసాన్ రావట్లేదని చెప్పారు. ప్రతియేటా లబ్ధిదారుల సంఖ్య పడిపోతూనే వుందని అన్నారు. పిఎం కిసాన్ గైడ్ లైన్స్ పెద్ద దగా.. కాంగ్రెస్ దగాకోరులు ఢిల్లీలో పీఎం కిసాన్ మార్గదర్శకాలు వద్దంటారు..గల్లీలో వాటినే ముద్దంటున్నారని ఘాటు విమర్శలు చేశారు.
పంట పెట్టుబడి రైతు హక్కు.. భిక్ష కాదు
పంట పెట్టుబడి రైతు హక్కు.. భిక్ష కాదు అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. రైతుకు ఏమిచ్చినా ఎంతిచ్చినా తక్కువే అని పేర్కొన్నారు. చైతన్యవంతమైన తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ సర్కారు ఎత్తులను నక్కజిత్తులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులకు గల్లా పట్టి నిలదీయాలని అన్నారు. ఎన్నికల్లో చెప్పిన మాటలేంటి.. ఇప్పుడు చేస్తున్న మాయలేంటని మంత్రులను, ఎంఎల్‌ఎలను నిగ్గదీసి ప్రశ్నించాలని పేర్కొన్నారు. రైతుల ఆకాంక్ష ఏంటో.. అభిప్రాయం ఏంటో తెలిసేలా సెగ పుట్టించాలి.. మౌనంగా వుంటే దగా పడతాం.. నోరు విప్పకుంటే అన్యాయమైపోతామని చెప్పారు. సాధించుకున్న పెట్టుబడి హక్కు గంగలో కలిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతులతో కలిసి తాము నడుస్తాం.. రైతుల ఆందోళనకు అండగా వుంటామని తెలిపారు. రైతులకు నమ్మించి నట్టేట ముంచే వంచన చేయడానికి చూస్తున్న కాంగ్రెస్‌ను పల్లెల్లో దంచికొడదామని పిలుపునిచ్చారు. కొట్లాట మనకు కొత్తగాదు, బిఆర్‌ఎస్ అంటే.. భారత రైతు సమితి అని వ్యాఖ్యానించారు. రైతుకు కెసిఆర్ సర్కారు ఇచ్చిన రక్షణ కవచాలను కాంగ్రెస్ ప్రభుత్వం కబళిస్తుంటే చూస్తూ వూరుకోమని హెచ్చరించారు. మేలుకో.. తెలంగాణ రైతన్న… జై కిసాన్..జై తెలంగాణ అని కెటిఆర్ పేర్కొన్నారు.