Monday, January 27, 2025

ఇట్లయితే పథకాల అమలుకు 60 ఏండ్లయినా సరిపోదు

- Advertisement -
- Advertisement -

మండలానికో ఊరు పేరిట
ప్రభుత్వ పథకాల అమలు
ప్రజలను మోసగించడమే
ఎన్నికలప్పుడు ఊదరగొట్టి
ఇప్పుడు నయవంచన
పథకాలు రాని గ్రామాల్లో
ప్రజా రణరంగమే అవుతుంది
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కెటిఆర్ హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నాన్చి, నాన్చి కేవలం మండలానికి ఒక గ్రామంలోని పథకాలను ప్రారంభించడం పైన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ అనేక గడువులు పెట్టి, వాయిదాల మీద వాయిదాలు పెట్టి, చివరికి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తీరు దుర్మార్గం అని మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రచారంలో కానీ, శనివారం సాయంత్రం వరకు కూడా ఏ రోజు కేవలం మండలానికి ఒక గ్రామంలోనే పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పలేదని, తీరా ఆదివారం చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో గ్రామంలో మాత్రమే పథకాలను ప్రారంభించి చేతులు దులుపుకుందని విమర్శించారు.

ఇది ముమ్మాటికి యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేయడమే అని పేర్కొన్నారు. ఈ స్పీడుతో ప్రభుత్వం పథకాలను అమలు చేసుకుంటూ పోతే 60 సంవత్సరాలైనా తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వాలను అమలు చేయలేదని విమర్శించారు. ఈ మేరకు కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. మండలానికి ఒక గ్రామంలోనే మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పంచారా..?, మండలానికి ఒక గ్రామంలోనే కాంగ్రెస్ తన గ్యారెంటీ కార్డులను పంచిందా..? అని అడిగారు. ఎన్నికల ముందు కూడా ఇదే మాదిరిగా మండలానికి ఒక ఊరిలో ప్రచారం చేసి ఆ మేరకే హామీలు ఇచ్చి, ఆయా గ్రామాల్లోని ప్రజలను ఓట్లు వేయమని అడిగారా..? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి ఓటు వేసిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోవద్దని అన్నారు. ఎన్నికలప్పుడు అప్పటి తమ ప్రభుత్వం పథకాలను కేవలం కొంతమందికే ఇస్తుందని అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు చెప్పిన ‘అందరికీ అన్నీ’ మాట మరిచి,
నేడు ‘కొందరికే కొన్ని’.. పేరిట మభ్యపెడితే నాలుగు కోట్ల తెలంగాణ కాంగ్రెస్ నయవంచనను క్షమించదని పేర్కొన్నారు.
పథకాలు రాని గ్రామాల్లో ప్రజా రణరంగమే జరుగుతుంది

ఎన్నికలప్పుడు.. రాష్ట్రంలోని ప్రతి మండలం..ప్రతి గ్రామంలోని.. ప్రతి ఇంటా.. అబద్ధపు హామీలను ఊదరగొట్టి.. ‘వన్ ఇయర్’ తరువాత ‘వన్ విలేజ్’ అనడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమే అని మండిపడ్డారు. ప్రతిపక్షంగా ఇంకో నాలుగేళ్లు.. ఓపిక పట్టడానికి తాము సిద్ధం కానీ, ఏరు దాటాక తెప్ప తగలేసే కాంగ్రెస్ ఏడాది దగా పాలన చూసిన తరువాత ఆగడానికి ప్రజలు మాత్రం సిద్ధంగా లేరని కెటిఆర్ పేర్కొన్నారు. ‘పథకాలు రాని గ్రామాల్లో..రేపటి నుంచి.. ప్రజా రణరంగమే జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి గ్రామానికి, ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ దుర్మార్గానికి మోసానికి అనేక రకాలుగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే మండలానికి ఒక ఊరు అన్న మోసపూరిత విధానాన్ని పక్కనపెట్టి అన్ని గ్రామాల్లో స్యాచురేషన్ పద్ధతిలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు బహిష్కరిస్తారని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News