Thursday, December 19, 2024

బిఆర్ఎస్ ఎంఎల్‌ఎలను చేర్చుకోవడంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌ఎ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. కెటిఆర్ ఆధ్వరంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు గవర్నర్‌ సిపి రాధాకృష్ణన్ ను కలిశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల అంశంపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. అప్రజాస్వామికంగా విద్యార్థులపై దాడులు, కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఉద్యమ సమయంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని, గ్రంథాలయాల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని, అక్రమంగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని కెటిఆర్ ధ్వజమెత్తారు.

ఎంఎల్‌ఎలను చేర్చుకోవడంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, ఫిరాయింపుపై న్యాయ ప్రక్రియ నడుస్తుందని గవర్నర్‌కు తెలిపామన్నారు. వెంటనే గవర్నర్ స్పందించి, ఫిరాయింపులపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారన్నారు. మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలు అయ్యిందంటూ చిల్లర ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. అక్కడ జరిగిన చిన్న విషయంపై తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేశారని,  ఇప్పుడు వరదలాగ నీళ్లు వస్తున్న మేడిగడ్డ తట్టుకోవటమంటే అదే కాళేశ్వరం గొప్పతనమని ప్రశంసించారు. త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తామని ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్లు లాభం వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని, ఇప్పుడు నాలుగు నెలలు వాయిదా వేశారని, ఇప్పుడు నాలుగు వందల కోట్లు లాభాలు వస్తున్నాయా? అని  ప్రశ్నించడంతో పాటు అందులో సిఎం వాటా ఎంత? అని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News