Sunday, January 19, 2025

కొణతం దిలీప్ అరెస్ట్‌ను ఖండించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్టుపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఖండించారు. తెలంగాణవాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమ కేసులు బనాయించి అదుపులోకి తీసుకున్నారని దుయ్యబట్టారు. గత కొంతకాలంగా ప్రభుత్వ చేతగానితనాన్ని దిలీప్ ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోతోందని విమర్శించారు. కొన్ని రోజుల క్రితం కూడా కొణతం దిలీప్‌ను రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టిందని కెటిఆర్ దుయ్యబట్టారు. అయినా ప్రభుత్వానికి బుద్ధి రాలేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆక్షేపించారు. ప్రజాపాలన అంటే ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కడమేనా..? అని కెటిఆర్ నిలదీశారు. అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చనుకుంటే అది భ్రమే అవుతుందని, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్భందాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింతగా పుట్టుకొస్తారని అన్నారు. అక్రమంగా దిలీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తొమ్మిది నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదని, నిరంకుశ పాలన సాగుతోందని కెటిఆర్ ఆరోపించారు.

వరద సాయం విషయంలో ప్రశ్నించినందుకే దిలీప్‌ను అరెస్ట్ చేశారు
తెలంగాణ బిడ్డలను చట్టవిరుద్దంగా, అక్రమంగా, నిరంకుశంగా అరెస్ట్ చేసి భయపెట్టవచ్చని ముఖ్యమంత్రి భ్రమిస్తే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదని పేర్కొన్నారు. వరద సాయం విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే కొణతం దిలీప్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కొన్ని రోజులుగా రుణమాఫీ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారని, ఆరు గ్యారంటీల డొల్లతనాన్ని బయటపెట్టి ప్రజల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడేలా చేస్తున్నారని, దాన్ని భరించలేకనే దిలీప్‌ను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు.

ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎన్ని చేసిన సరే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఆకృత్యాలను తాము ప్రశ్నిస్తూనే ఉంటామని, ప్రభుత్వ తప్పిదాలను ప్రజల ముందు పెడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేతగాని పాలన, అవినీతి, అక్రమాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో మీకు కచ్చితంగా బుద్ది చెబుతారని అన్నారు. కాగా, కొణతం దిలీప్‌కు అరెస్‌ను మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి, బిఆర్‌ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ తదితరులు ఖండించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News