దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. అన్ని రంగాల్లో అప్రతిహత ప్రగతి
మంత్రి ఎర్రబెల్లిని అభినందించిన మంత్రులు కెటిఆర్, సత్యవతి రాథోడ్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని అందించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో పాటు రెగ్యులారిటీ కేటగిరీలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలవడం పట్ల సంబంధిత శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ కెటిఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశంలోనూ మొదటి స్థానంలో నిలిచి వివిధ కేటగిరీలలో మరో 13 అవార్డులను గెలుచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం మంత్రి ఎర్రబెల్లిని గురువారం ప్రగతి భవన్‌లోని తన కార్యాలయానికి పిలుపించుకుని కెటిఆర్ సత్కరించారు. ఆయనను శాలువాతో సత్కరించి, పూల మొక్క బహుకరించారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. కెసిఆర్ మేధోమథనం నుంచి పుట్టుకు వచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం అని అన్నారు. దీనిని సిఎం ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పకడ్బందీగా అమలు చేస్తూ మంత్రి ఎర్రబెల్లిని, ఆయన అధికారుల బృందాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులను ప్రశంసించారు. అందరి సహకారం, ప్రజల భాగస్వామ్యంతో అద్భుతంగా సాధించిన ఫలితంగానే ఈ అవార్డులు రివార్డులు దక్కాయని కెటిఆర్ అన్నారు. దేశంలో మరే రాష్ట్రం సాధించని విధంగా తెలంగాణ రాష్ట్రం అందునా పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి శాఖ సాధిస్తున్న ఫలితాలు తెలంగాణకే గాక, మొత్తం దేశానికే గర్వకారణమన్నారు. ఈ ఫలితాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రశంసించారు. మరింత బాధ్యతాయుతంగా పని చేసి, మరిన్ని ఆవార్డులు తేవాలన్నారు. రాష్ట్రానికి మంచి పేరు తెస్తూ, దేశానికి ఇదే విధంగా ఆదర్శంగా నిలవాలని కెటిఆర్ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సైతం ఎర్రబెల్లిని అభినందిస్తూ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేశ్ తదితరులు ఉన్నారు.
KTR Congratulates Errabelli over drinking water