Wednesday, January 22, 2025

ప్రజా వంచన యాత్ర

- Advertisement -
- Advertisement -

KTR criticise Bandi sanjay Yatra

బండి సంజయ్‌ది ముమ్మాటికీ
ప్రజలను మోసంచేసే నిర్వాకం
తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ
బిజెపి కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్
బోర్డు అనే శిఖండి సంస్థను ఏర్పాటు
చేసి కృష్ణ జలాల్లో పాలమూరు
వాటాను సందిగ్ధంలోకి
కుట్రపూరిత పార్టీ తెల్లారి లేస్తే
రాముడి పేరుతో రాజకీయం చేసే
నీచమైన బిజెపి భద్రాద్రి క్షేత్రానికి
ఏం తెలంగాణ ప్రజలకు
చెప్పాలి వరి పంటతో రాజకీయ
చలి మంటలు వేసుకొని
అన్నదాతను ఆగం చేయాలని
పన్నాగం పన్నింది మీరు కాదా?
వడ్లని కొనమని అడిగితే చేతులెత్తేసి
ఇప్పుడు మిడతల దండులా
యాత్రలకు బయల్దేరుతారా?
బండి సంజయ్ ప్రజా సంగ్రామ
యాత్రపై బహిరంగ లేఖలో
మంత్రి కెటిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : బండి సంజయ్ చేస్తున్న యాత్ర ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. బండికి మంత్రి కె. తారకరామారావు బహిరంగ లేఖ రాశారు. జూటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యా త్రగా మంత్రి కెటిఆర్ ఆ లేఖలో అభివర్ణించారు. పచ్చబడుతున్న పాలమూరుపై కక్షగట్టిన మీకు అక్కడ అడుగుబెట్టే హక్కులేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడీకి జై కొడుతూ పాలమూరు రైతుకు ద్రోహం చేస్తున్న మీరు సిగ్గూ, ఎగ్గూ లేకుండా యాత్రలు చేస్తారా అంటూ ఆయన ప్ర శ్నించారు. పాలమూరుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులపై బోర్డులు బెట్టి బోడిపెత్తనం చేస్తూ పండుతున్న పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్లు ఇప్పుడు కపట యాత్రలు చేస్తారా అని ఆయన మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. కర్ణాటక మీద కనికరం చూపిన మీరు, పాలమూరు మీద కక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నరో సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

అడుగడుగునా అన్యాయం, తెలంగాణ పుట్టకముందే కత్తిగట్టిన పార్టీ బిజెపి పార్టీకి విభజన హా మీలు నెరవేర్చే తెలివిలేదని, నీతి ఆయోగ్ చెప్పినా నిధులిచ్చే నీతి లేదని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు, ఉచిత కరెంట్ ఇస్తుంటే మోటర్లకు మీటర్ల పెట్టమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. పండించిన పంటలు కొనకుండా రైతును గోస పుచ్చుకుంటారని, సందు దొరికితే చాలు తెలంగాణ మీద బిజెపి నాయకులు విషం గక్కుతారన్నారు. తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ బిజెపి అని ఆయన ఆరోపించారు. కడుపులో ద్వేషం పెట్టుకొని కపట యాత్రలు చేస్తే ఏం లాభమని, వరిపంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని అన్నదాతను ఆగం చేయాలని పన్నాగం పన్నింది మీరు కాదా అని మంత్రి కెటిఆర్ ఆ లేఖలో ప్రశ్నించారు. రైతులతో రాబందుల్లా వికృత రాజకీయం చేసి వడ్లను కొనమని అడిగితే చేతగాదని చేతులెత్తేసిన మీరు ఇప్పుడు మిడతల దండులా యాత్రకు బయల్దేరుతరా అన్నారు. రైతు ద్రోహి, రాష్ట్ర ద్రోహి పాత్ర పోషిస్తున్న మీకు పాదయాత్ర చేసే నైతిక హక్కు లేనేలేదన్నారు. తన పాదయాత్రకు రైతు ద్రోహ యాత్ర అనో లేక రైతు ధోకా యాత్ర అని పేరు పెట్టుకుంటే మంచిదన్నారు. పాదయాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసి తెలంగాణకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి కెటిఆర్ ఆ లేఖలో డిమాండ్ చేశారు.

శిఖండి సంస్థను ఏర్పాటుచేసి

పాలమూరు జిల్లా వ్యవసాయానికి ఆయువుపట్టు అయిన కృష్ణా జలాలలో వాటా తేల్చకుండా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు పేరుతో ఒక శిఖండి సంస్థను ఏర్పాటుచేసి పాలమూరుకు న్యాయంగా దక్కాల్సిన నదీ జలాల వాటాను సందిగ్ధంలోకి నెట్టిన కుట్రపూరిత పార్టీ బిజెపి అని ఆయన ఆరోపించారు. పక్కనే ఉన్న కర్ణాటక అప్పర్ భద్రా ప్రాజెక్ట్‌కు జాతీయహోదా ఇచ్చి పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదో చెప్పిన తరువాతనే పాలమూరు గడ్డ మీద బండి సంజయ్ అడుగుపెట్టాలన్నారు. కర్ణాటక మీద కనికరం చూపిన మీరు పాలమూరు మీద కక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నరో సమాధానం చెప్పాలన్నారు. పాలమూరు రైతు చేసిన పాపం ఏంది..? పాలమూరు ప్రజల చిరకాల కోరిక అయిన గద్వాల, మాచార్ల రైల్వే లైన్‌ను ఎలా పూర్తి చేస్తారో బండి సంజయ్ స్పష్టం చేయాలని మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు.

తెల్లారి లేస్తే రాముడి పేరుతో రాజకీయాలు చేసే…

ఆదిశక్తి పీఠమైన జోగులాంబను దర్శించుకొని పాదయాత్ర ప్రారంభిస్తున్న బండి సంజయ్, రాష్ట్రంలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన దేవాలయాలకు అదనంగా ఎన్ని నిధులను తీసుకొచ్చారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. తెల్లారి లేస్తే రాముడి పేరుతో రాజకీయాలు చేసే నీచమైన భారతీయ జనతా పార్టీ, ఆ కోదండ రాముడు నడయాడిన భద్రాద్రి క్షేత్రానికి ఏం చేసిందో తెలంగాణ ప్రజలకు తెలపాలన్నారు. బండి సంజయ్, భారతీయ జనతా పార్టీలది దేవాలయాలను, దేవుళ్లను రాజకీయాలకు వాడుకునే తత్వం అని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. కానీ తాము అంచెంచలమైన భక్తి, అంకుఠిత దీక్షతో ఆ సేతు హిమాచలంలోనే అద్భుతమైన దైవక్షేత్రంగా యాదాద్రిని నిర్మించామన్నారు. ఈ దైవకార్యంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఏమన్నా ఉందా? దేవుళ్లు, దైవాన్ని రాజకీయాలకు వాడుకోవడాన్ని అలవాటుగా మార్చుకున్న భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రైతాంగాన్ని కూడా తన చిల్లర రాజకీయాలకు బలి చేస్తోందన్నారు. వడ్లు వేస్తే కేంద్ర ప్రభుత్వంతో కొనిపిస్తామని తెలంగాణ రైతాంగాన్ని తప్పుదోవ పట్టించి, పంట చేతికొచ్చినంక బండి సంజయ్ తప్పించుకు తిరుగుతున్నారన్నారు.

వరిపంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని…

తెలంగాణ రైతాంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిపై బండి సంజయ్ తన వైఖరిని స్పష్టం చేసినంకనే పాదయాత్ర ప్రారంభిస్తే మంచిదని ఆయన సూచించారు. వరిపంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని అన్నదాతను ఆగం చేయాలని పన్నాగం పన్నింది మీరు కాదా..? రైతులతో రాబందుల్లా వికృత రాజకీయం చేసి వడ్లను కొనమని అడిగితే చేతగాదని చేతులెత్తేసిన మీరు, ఇప్పుడు మిడతల దండులా యాత్రకు బయల్దేరుతరా? వడ్లు కొనమని అడిగితే నూకలు తినండని తెలంగాణ ప్రజల్ని అవమానించిన దురహంకారం బిజెపి పార్టీదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దశా దిశా లేని బిజెపి దరిద్ర విధానాలతో దేశంలో ఎన్నడూ లేని విధంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు.

తెలంగాణకు అడుగడుగునా బిజెపి అన్యాయమే…

తెలంగాణకు అడుగడుగునా బిజెపి అన్యాయమే చేసిందని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. పొత్తిళ్లలో ఉన్న తెలంగాణ పసిగుడ్డుపై కత్తిగట్టింది, అధికారం ఉందన్న అహంకారంతో తెలంగాణ 7 మండలాలను అన్యాయంగా ఆంధ్రాలో కలిపిన బిజెపి దౌర్జన్యాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. తెలంగాణ అంటేనే గిట్టని బిజెపి నాయకులు కడుపులో ద్వేషం పెట్టుకొని కపట యాత్రలు చేస్తే ఏం లాభమని, పాదయాత్రే కాదు మోకాళ్లపై దేక్కుంటూ యాత్ర చేసినా బండి సంజయ్, బిజెపిని తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. బిజెపి పార్టీ డిఎన్‌ఏలో ఉన్న వివక్ష, విభజన రాజకీయాలను తెలంగాణ ప్రజలు గుర్తించి తిరస్కరిస్తారని మంత్రి కెటిఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News