ప్రధానికి లేఖాస్త్రాన్ని సంధించిన టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
లక్షలాదిగా ఉత్తరాలు రాయాలంటూ నేతన్నలకు పిలుపు
స్వాతంత్య్ర సంగ్రామంలో జాతిని ఏకతాటిపై నడిపిన చేనేతపై
పన్నేసిన ఘనత మీదేనని ఎద్దేవా గాంధీ సూత్రాలకు తూట్లు పొడుస్తున్నారంటూ ఆగ్రహం
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీజీ దోచుకున్నది చాలు.. ఇకనైన సెస్సులు రద్దు చేసి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు డిమాండ్ చేశారు. అసలు ముడి చమురు ధర పెరగనప్పుడు పెట్రోల్ ధరలు ఎలా పెరుగుతాయని ప్రశ్నించారు. వాటిపై కేంద్రం అడిషనల్ డ్యూటీలు, సెస్స్‌లను మోపడం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని కెటిఆర్ ఆరోపించారు. పెట్రో ధరల ప్రభావం పరోక్షంగా అన్ని రంగాలపై పడడంతో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ఇందన, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నుంచి రూ.30 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిందన్నారు. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్ రూపంలో లాక్కుంటున్నారని కెటిఆర్ విమర్శించారు.
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో శనివారం జరిగిన లారీ యజమానుల, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సంగర్భంగా ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో పన్నులు పెంచలేదన్నారు. రాష్ట్రంలో సరుకు రవాణా రంగం సమస్యలను అర్థం చేసుకున్నామన్నారు. కానీ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి సరుకు లేదు…సామర్థం లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఇడి, ఐటి దాడులు జరిపిస్తున్నారన్నారు. ఇది ఒక ప్రధానికి ఉండాల్సిన లక్షణమా? అని కెటిఆర్ నిలదీశారు. మోడీ పాలనలో ఇప్పటి వరకు పేదవర్గాలు, కార్మికుల కోసం ఒక్కటంటే ఒక్కటైనా మేలు జరిగే పథకాన్ని తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. పేదలకు మేలు చేయాలన్న ఆలోచన మోడీ ప్రభుత్వానికి ఎందుకు కలగడం లేదన్నారు. ధనవంతులు, బాడాబాబుల కోసం దేశం సంపను దోచిపెడుతున్న బిజెపికి మొదటి నుంచి పేదలంటే చూలకన అని కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఓట్లప్పుడే పేదలపై అంతులేని ప్రేమను వలకపోస్తూ…. తదనంతరం ధరల మోతతో మోడీ ప్రభుత్వం రాచి రంపాన పెడుతోందన్నారు.
బిజెపి ప్రభుత్వం నిర్వాహాకం కారణంగానే ఒకప్పుడు రూ.400 ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 1200లకు చేరిందని కెటిఆర్ అన్నారు. అయిన్పపటికీ ఆయిల్ కంపెనీలకు కేంద్రం రూ. 22 వేల కోట్ల రాయితీలు ఇచ్చిందన్నారు. ఆయిల్ కంపెనీలకు రాయితీలు ఇచ్చిన మోడీ…ఆడబిడ్డలకు ఎందుకు రాయితీలు ఇవ్వరు అని ప్రశ్నించారు. ఉచిత పథకాలు మంచిది కాదంటూనే కార్పొరేట్ గద్దలకు పదకొండున్నర లక్షల కోట్లు ఎలా మాఫీ చేశారని మోడీని నిలదీశారు. చివరకు దేశానికి అన్నం పెడుతున్న రైతులపై కూడా కక్షసాధింపు చర్యలకు బిజెపి ప్రభుత్వం పూనుకుంటున్నదని మండిపడ్డారు. ఇందులో భాగంగానే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు కేంద్రం వెనుకాడుతోందని కెటిఆర్ ధ్వజమెత్తారు. ఇలా అన్ని వర్గాలను మోడీ మోసం చేశారని విమర్శించారు. ఎనిమిదేండ్లలో ఆయన ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని…. దేశం కోసం బిజెపి ప్రభుత్వం చేసింది కూడా ఏమీలేదని ధ్వజమెత్తారు. పైగా దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని మోడీ ప్రభుత్వం అప్పనంగా అమ్ముతోందన్నారు. ఫలితంగా దేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోందన్నారు.
లారీ డ్రైవర్లను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం
లారీ డ్రైవర్లను, యజమానులను, కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని కెటిఆర్ స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి పేదలు కావాలి.. పెద్దలు కావాలన్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో….మునుగోడు ఉపఎన్నిక ముగిసేంత వరకు ఓపిక పట్టాలని కెటిఆర్ సూచించారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాపాడుకుంటూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధే మా కులం.. సంక్షేమమే మా మతం.. జనహితమే మా అభిమతమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఎనిమిదేండ్ల కింద తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సిఎం కెసిఆర్ చెప్పింది ఒక్కటేనని…. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూస్తేనే మన జన్మ ధన్యమైతదన్నారు. ప్రస్తుతం అదే విధంగా పాలన సాగిస్తున్నారన్నారు.
ఇది తెలంగాణ దమ్ముకు నిదర్శనం
ప్రపంచంలో ఉన్న నగరాలను దాటుకొని, మన హైదరాబాద్‌కు వరల్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చిందని కెటిఆర్ అన్నారు. ఇది మన తెలంగాణ దమ్ముకు నిదర్శనమన్నారు. ఇప్పటికే అనేక అవార్డులను…రివార్డులను సొంతం చేసుకున్నామన్నారు. ఇవన్నీ సిఎం కెసిఆర్ నాయకత్వ పటిమకు తార్కాణమన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో ప్రస్తుతం కరెంట్ తిప్పలు లేవన్నారు. విద్యుత్ లేక ఆగమాగం అయిపోయిన పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహ వినియోగానికి ఇవాళ నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు. కరెంట్, తాగునీటి సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. అలాగే దశాబ్దాల నుంచి ఉన్న ఫ్లోరోసిస్ వ్యాధిని శాశ్వతంగా రూపుమాపామన్నారు. నీటి ప్రాజెక్టులతో రాష్ట్రం కళకళాలాడుతోందన్నారు. దీంతో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకున్నామన్నారు. ప్రపంచం అబ్భురపడే రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామన్నారు. పాలమూరు ప్రాజెక్టు పనులు సైతం శర వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం మూడున్నర కోట్ల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఇవి ప్రతిపక్ష నేతలకు కంటకింపుగా మారిందని కెటిఆర్ విమర్శించారు. అలాంటే చిల్లరమల్లర రాజకీయాలు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. అలాంటి వారికి తగు రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రం ప్రశాంతంగా ఉంది
టిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. అలా ఉంటేనే రాష్ట్రంలో ఉత్పత్తి, సంపద గణనీయంగా పెరుగుతుందన్నారు. దీని కారణంగానే అనతి కాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా కొనసాగుతోందన్నారు. ఈ ప్రగతి కారణంగానే రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కొత్తగా పరిశ్రమలు వెలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుం తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. పేదరికమే ప్రతిపాదికగా పెద్దఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. పారిశ్రామికవేత్తల నుంచి మొదలుకొని కార్మికులు, శ్రామికుల బాగోగులు చూస్తున్నామన్నారు.
KTR Demands Centre to Decrease Fuel Prices