హైదరాబాద్: ఒక్క రూపాయి చెల్లించే అవసరం లేకుండా పేదలకు ఇళ్లను అందిస్తున్నామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. దుండిగల్ లో రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొని 2,100మంది అర్హులైన పేద లబ్దిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. “ఇళ్లు కట్టి చూడు.. పెళ్ళి చేసి చూడు అని పెద్దలు అన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఇళ్లు కట్టిస్తున్నాడు.. పెళ్లి చేస్తున్నాడు. ఒక్క రూపాయి చెల్లించే అవసరం లేకుండా పేదలకు ఇళ్లు అందిస్తున్నాం. అత్యంత పారదర్శకంగా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరిగింది. కాంగ్రెస్, బిజెపి పార్టీల కార్యకర్తలకు సైతం రెండు పడకల గదుల ఇళ్లు అందిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజే 13,300 ఇళ్లను అబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తున్నాం. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు అవుతుంది. కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇళ్లు నిర్మించాయా?. భవిష్యత్ లో అర్హులందరికీ రెండు పడకల గదుల ఇళ్లు ఇస్తాం. రూ.73వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేశాం” అని పేర్కొన్నారు.