రాష్ట్రంలో సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలంగా ఉందని, గత ఎన్నికల్లో తమకు 88 సీట్లు రాగా, ఈ ఎన్నికల్లో గతంలో కంటే ఒక్క సీటు ఎక్కువే గెలుస్తామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ గాలి ఏమీ లేదు అని, అది కేవలం రాజకీయ వ్యూహకర్తలు సృ ష్టించిన ప్రాపగండ మాత్రమే అని పేర్కొన్నా రు. గత ఎన్నికల సమయంలోనూ చంద్రబా బు రాగానే.. వేవ్ వచ్చేసిందని ఒకటి, రెండు పత్రికలు ఇలాగే హడావుడి చేశాయని, ఈ సారి కనుగోలు వచ్చి ఇంకొంచెం గందరగో ళం సృష్టిస్తున్నారని తెలిపారు. స్ట్రా టజిస్టులు సృష్టిస్తున్న అయోమయమే అని, ఎన్నికల్లో అవన్నీ ఎదుర్కోక తప్పదని అన్నా రు. క్షేత్రస్థాయిలో తాము పర్యటిస్తున్న సం దర్భంలో ప్రజల నుంచే స్పందనలను బట్టి తమకు చాలా విషయాలు అర్థమవుతాయని, తన సభలు, సమావేశాలు, రోడ్ షోలకు ప్ర జల నుంచి విశేష స్పందన లభించిందని చె ప్పారు. కొడంగల్, హుజూరాబాద్, గోషామహల్‌లోనూ తామే గెలుస్తున్నామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో గోషామహాల్ సహా అన్ని సీట్లు గెలవబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ వేవ్ బలంగా ఉందని, నగరంలో క్లీన్ స్వీప్ చేస్తామని పేర్కొన్నారు. అలాగే ఉమ్మడి రంగారెడ్డిలో మెజార్టీ స్థానాలలో గెలుస్తామని అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమానికి హాజరైన మంత్రి కెటిఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సరళి, కెసిఆర్ ఆమరణ దీక్ష సందర్భంగా తమకు ఎదురైన అనుభవాలను విలేకరులతో పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని, మరోసారి బిఆర్‌ఎస్ విజయం సాధించి, కెసిఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ములుగు, గోషామహల్, హుజురాబాద్‌తో పాటు ఖమ్మం జిల్లాలోనూ ఆరు సీట్లు బిఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు. ఈటల రాజేందర్, రాజాసింగ్‌లపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పుకున్నారని, గెలిచిన తర్వాత ఏమీ చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి ఉందని చెప్పారు. అలాగే గోషామహల్ నియోజకవర్గాన్ని రాజాసింగ్ ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఆయన సామాజిక వర్గానికి చెందిన లోధ్ వర్గాలే పేర్కొంటున్నాయని అన్నారు. గోషామహల్‌లో బిజెపి అభ్యర్థి రాజాసింగ్ సామాజిక వర్గమైన లోద్ కమ్యూనిటీ ప్రతినిధులు వచ్చి తమతో మాట్లాడారని, రాజాసింగ్ ఎన్నిసార్లు గెలిచినా తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం లేదని చెప్పారని పేర్కొన్నారు. లోథ్ సామాజిక వర్గం తమకు పూర్తి మద్దతు తెలిపిందని, అలాగే మార్వాడి కమ్యూనిటీ వాళ్లు సైతం తమకే మద్దతు తెలిపారని వివరించారు. సీ ఓటర్ సర్వేకు విశ్వసనీయత లేదని, 2018లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందనే చెప్పిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆఫీస్‌లో తయారైన సర్వేలు చూస్తే అలాగే ఉంటాయని విమర్శించారు. సీ ఓటర్ సర్వే గతంలో మాదిరిగానే చెప్పడం తమకు శుభసూచకమని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డికి రెండు చోట్ల ఓటమి తప్పదు
కొడంగల్‌లో కూడా బిఆర్‌ఎస్ గెలవబోతుందని కెటిఆర్ జోస్యం చెప్పారు. అలాగే కామారెడ్డిలో కెసిఆర్ గెలుస్తున్నారని, రేవంత్‌రెడ్డికి రెండు చోట్ల ఓటమి తప్పదని అన్నారు. సిరిసిల్లలో చాలా టఫ్ ఉందని కాంగ్రెస్ సర్వేలు తప్పుడు ప్రాపగండా చేస్తున్నాయని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తమ నియోజకవర్గంలోని పార్టీ ప్రతినిధులతో మాట్లాడితే అలాంటిదేమీ లేదని తేలిందని చెప్పారు. తాము 2018లో 47 శాతం ఓట్లతో అధికారం చేపట్టగా, 2019లో నరేంద్ర మోడీ 37 శాతం ఓట్లతో కేంద్రంలో అధికారం చేపట్టారని తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులపై వ్యతిరేకత ఉందని గతంలో కూడా కొంతమంది ప్రచారం చేశారని, అయితే కొంత అసంతృప్తి ఉన్నా అది 49 శాతం లోపే ఉంటుందని చెప్పారు. తాము మళ్లీ అధికారం రావడానికి 51 శాతం ఓట్లు చాలని, తమకు అంతకుమించే అనుకూలత ఉందని స్పష్టం చేశారు.
మోడీ, అమిత్ షా ప్రచారం పార్లమెంట్ ఎన్నికల కోసమే
తెలంగాణలో బిజెపి అగ్రనేతలైన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా నిర్వహించిన ప్రచారం వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసమే అని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి గెలువదని వాళ్లకు కూడా తెలుసు అని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసిపోయాయని ఆరోపించారు. నాంపల్లిలో ప్రచారం చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పక్కనే ఉన్న గోషామహల్‌లో ఎందుకు ప్రచారం చేయలేదని ప్రశ్నించారు. కరీంనగర్, కోరుట్లలో రాహుల్, రేవంత్ ప్రచారం చేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు బిజెపితో లోపాయికారీ ఒప్పందం ఉందని, అందుకే గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగాగానే బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రాజాసింగ్‌లను గెలిపించడానికి ఆ మూడు స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బిజెపి పార్టీకి 110 సీట్లలో డిపాజిట్ రాదు అని పేర్కొన్నారు.
పొలిటికల్ టూరిస్టులు వస్తూ పోతూ ఉంటారు
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన అగ్రనేతలు వచ్చారని, పొలిటికల్ టూరిస్టులు వస్తూ పోతూ ఉంటారు..చివరి వరకు మిగిలింది కెసిఆరే అని కెటిఆర్ అన్నారు. గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే అని కెటిఆర్ తనదైన శైలిలో విశ్లేషించారు. మెదక్‌లో 10లో 9 సీట్లు గెలుస్తున్నామని, మహబూబ్‌నగర్‌లో 10 సీట్లు, ఖమ్మం జిల్లాలో ఆరుకుపైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
హరీశ్‌రావు తప్పు చేస్తే ఆయనపై చర్య తీసుకోవాలి..రైతులను ఎందుకు శిక్షిస్తారు
రైతుబంధు విషయంలో మంత్రి హరీశ్ రావు తప్పు చేస్తే.. ఆయనకు నోటీసు ఇచ్చి చర్య తీసుకోవాలి కానీ.. రైతుబంధు ఆపి రైతులను ఎందుకు శిక్షిస్తారని మంత్రి కెటిఆర్ నిలదీశారు. రైతుబంధు ఆపడం కోసం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. అయినా రైతుబంధు విషయంలో హరీష్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేముందని అడిగారు. పిఎం కిసాన్ ఇస్తే ఇసి ఎందుకు ఆపలేదని, దానిపై కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. రైతుబంధు కొత్త పథకం కాదు అని, ఇప్పటికే 11 సార్లు ఇచ్చామని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కచ్చితంగా రైతుబంధు ఇస్తామని వెల్లడించారు.టీ హబ్ విషయంలో తనకూ వ్యక్తిగతంగా నోటీసు ఇచ్చారని గుర్తు చేశారు.
నియామకాలపై తమ సవాల్‌కు ఎవరూ స్పందించలేదు
తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగ నియామకాలు చేసిన రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందా..? ఉంటే చూపాలని సవాల్ చేస్తే కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి ఒక్కరు కూడా స్పందించలేదని కెటిఆర్ అన్నారు. అశోకనగర్ వెళ్లి,బావార్చిలో బిర్యానీ తిని టైం పాస్ చేసిన రాహుల్ తాము ఇచ్చినన్ని ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చిందా అంటే సమాధానం చెప్పలేదు…చర్చకు రాలేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు పవరిస్తే, జనాలకు కరెంట్ కట్ చేస్తారని విమర్శించారు. కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్ వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తామని చెప్పడంతో కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదుతెలంగాణ ప్రజలకు అర్థమైందని అన్నారు. ఐదు గంటలు కరెంట్ ఇస్తామని చెప్పిన డికె శివకుమార్‌కు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని, కరోనాకు వ్యాక్సిన్ ఉంది…కానీ కాంగ్రెస్‌కు వ్యాక్సిన్ లేదని విమర్శించారు. కరోనా అనేది తెలవకుండా వస్తుంది… తెలిసి తెచ్చుకుందాం అనుకుంటే అది కాంగ్రెస్ వైరస్ అవుతుందని పేర్కొన్నారు.
కెసిఆర్‌పై ప్రజలకు విశ్వాసం ఉంది
గత తొమ్మిదిన్నరేళ్లలో కెసిఆర్ చెప్పినవే కాకుండా, చెప్పనివి కూడా చేశారని, అందుకే ప్రజలకు కెసిఆర్‌పై విశ్వాసం ఉందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఇన్ని చేసిన కెసిఆర్ మరింత చేస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అంటే గుంపు మేస్త్రీ అని అనేవాళ్లు కూడా ముఖ్యమంత్రులు అవుతారంట అని ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్లను ప్రజలు విశ్వసించడం లేదని అన్నారు. మూడు రోజులు వర్షం పడుతుంది అని వాతావరణ శాఖ చెప్పినందుకే సిఎం కెసిఆర్ హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సభ రద్దు చేశామని తెలిపారు. తాను కొన్ని ప్రాంతాలలో వర్షంలో తడుస్తూనే రోడ్ షోలు నిర్వహించానని చెప్పారు. వచ్చే ప్రభుత్వంలో తాను పర్యాటక శాఖ ఇవ్వమని సిఎం కెసిఆర్‌ను కోరతానని కెటిఆర్ తెలిపారు. సిఎం అంగీకరిస్తే దయతలచి ఇస్తే పర్యాటక శాఖ మంత్రిని అవుతా లేదంటే బిఆర్‌ఎస్ కార్యకర్తగా ఉంటానని చెప్పారు.