Saturday, November 23, 2024

పట్టణ ప్రగతిలో ‘టాప్’

- Advertisement -
- Advertisement -

KTR expressed happiness over arrival of 12 awards to Telangana

ఏడున్నరేళ్లలో సాటిలేని అభివృద్ధి

ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకొచ్చిన సమూల మార్పుల ఫలితంగానే రాష్ట్రానికి అఖిల భారత ఖ్యాతి

అన్ని రంగాల్లోనూ సర్వతోముఖ అభివృద్ధి సాధించాం ఆదర్శవంతమైన
పట్టణాలను రూపొందించడానికి కొత్త మున్సిపల్ చట్టాన్ని ముఖ్యమంత్రి
తీసుకొచ్చారు మున్సిపాల్టీలకు నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాం
మున్సిపాల్టీల సంఖ్యను 65 నుంచి 142కు పెంచాం కార్పొరేషన్ల
సంఖ్య 6 నుంచి 13కు పెరిగింది దేశంలో ఎక్కడాలేనివిధంగా గ్రీన్
బడ్జెట్‌ను ప్రవేశపెట్టి హరిత పట్టణాలను తయారుచేసేందుకు కృషి చేస్తున్నాం
శానిటేషన్‌లో దేశంలోని 4300 నగరాలు, పట్టణాలు పోటీపడితే
రాష్ట్రానికి 12కు పైగా అవార్డులు రావడం సంతోషకరం : మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలవడం, కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు రావడంపై రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మాసబ్‌ట్యాంక్‌లోని సిడిఎంఏ కార్యాలయంలో మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. మఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో ఏడున్నర సంవత్సరాలుగా రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందన్నారు. అందు లో భాగంగా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తూ అభివృద్ధిలో ముందుకు పోతున్నామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. పట్టణాలు అభివృద్ధి చెందాలన్న ఉద్ధేశంతో సిఎం కెసిఆర్ పట్టణాభివృద్ధిలో సమూలమైన మార్పులు తీసుకువచ్చారన్నారు. ఆదర్శవంతమైన పట్టణాలను ,నగరాలను రూపొందించేందుకు కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చారని, దీంతోపాటు పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా అమలు చేశారన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన తరువాత మున్సిపాలిటీల సంఖ్యను 65 నుంచి 142కు, అలాగే 6 కార్పొరేషన్‌లను 13కు పెంచామని మంత్రి కెటిఆర్ తెలిపారు. మున్సిపాలిటీలకు నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నామని, ఇప్పటి వరకు వివిధ పురపాలక సంఘాలకు రూ. 2,950 కోట్లను విడుదల చేశామన్నారు. పార్కులు, మోడల్ మార్కెట్లు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు, ఎల్‌ఈడీ లైట్లు, పబ్లిక్ టాయిలెట్స్, వైకుంఠధామాలు, ఓపెన్‌జిమ్స్, అర్బన్ లంగ్ స్పేస్‌ల కోసం నిధులు ఖర్చు పెట్టామని మంత్రి కెటిఆర్ తెలిపారు. దీంతోపాటు మౌలిక వసతుల మీద దృష్టి సారించామన్నారు. అర్భన్ మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా నీటి సమస్యను పరిష్కరించామని, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి సమగ్రమైన ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు. కొత్త డంప్ యార్డులు ఏర్పాటు చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా చట్టంలోనే గ్రీన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, హరిత పట్టణాలను తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. టిఎస్ బిపాస్ చట్టాన్ని పకడ్భందీగా అమలు చేశామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.

20న విజ్ఞాన భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా

ఇప్పటి దాకా తీసుకొచ్చిన చట్టాలన్నీ పౌరుడి కేంద్రంగా తీసుకువచ్చామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దీనివల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు. మన కార్యక్రమాలకు వివిధ సందర్భాల్లో కేంద్రం గుర్తింపు ఇచ్చిందన్నారు. తాజాగా శానిటేషన్ ఛాలెంజ్లో భాగంగా 4,300 నగరాలు, పట్టణాలు పోటీ పడితే తెలంగాణకు 12 పైచిలుకు అవార్డులు రావడం సంతోషకరమన్నారు. ఈ విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ దుర్గాశంకర్ మిశ్రా ట్వీట్ చేశారని మంత్రి తెలిపారు. ఈ అవార్డులు రావడం పట్టణ ప్రగతి అమలుకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. ఈ నెల 20న విజ్ఞాన భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోబోతున్నామని ఆయన తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు గర్వకారణం. మున్సిపల్ అధికారులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ అవార్డులు రావడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని మంత్రి కొనియాడారు. అవార్డుకు ఎంపికైన మున్సిపాలిటీ అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవంలో శాఖ అధికారులు పాల్గొంటారని వెల్లడించారు.

రాష్ట్రాల కేటగిరీలోనూ సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్ అవార్డు

జాతీయ స్థాయిలో మాత్రమే కాకుండా రాష్ట్రాల కేటగిరీలోనూ సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్‌లోనూ అవార్డు సాధించామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్‌లో తొలిసారి రాష్ట్రానికి అవార్డు వచ్చిందని మంత్రి తెలిపారు. సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్‌లో టాప్ పట్టణాలను గాను కరీంనగర్ కార్పొరేషన్‌కు కూడా అవార్డు వచ్చిందన్నారు. గార్బెజ్ ఫ్రీ సీటి కింద గ్రేటర్ హైదరాబాద్‌ను గుర్తించగా, గ్రేటర్ హైదరాబాద్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు సైతం వరించిందని ఆయన తెలిపారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నం, సిరిసిల్ల, ఘట్‌కేసర్, కోస్గీ, హుస్నాబాద్, సిద్దిపేట మున్సిపాలిటీలతో పాటు కంటోన్మెంట్ విభాగంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం వల్లే ఈ అవార్డులు వచ్చాయని, తెలంగాణకు మొత్తం 12 అవార్డులు రావడం సంతోషంగా ఉందని కెటిఆర్ స్పష్టం చేశారు.

8 మున్సిపాలిటీలకు ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ గుర్తింపు

రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 101 మున్సిపాలిటీలను ఓడిఎఫ్ ప్లస్ కేటగిరీలుగా కేంద్రం గుర్తించిందని, 8 మున్సిపాలిటీలకు ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ గుర్తింపు వచ్చిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. దీంతోపాటు హైదరాబాద్‌ను వాటర్ ప్లస్ సిటీగా కేంద్రం గుర్తించిందన్నారు. స్ట్రీట్ వెండర్స్ రుణాలను ఇవ్వడంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. ప్రతి విషయంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందంటే కేవలం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే దానికి కారణమని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. రూరల్, అర్బన్ డెవలప్‌మ్మెంట్ అద్భుతంగా జరుగుతుందని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. గత పాలకులు జిహెచ్‌ఎంసి కార్మికులకు 4 నెలల పాటు జీతాలను ఆపేవారని ప్రస్తుతం తాము అధికారంలోకి వచ్చిన ప్రతినెలా ఠంచన్‌గా జీతాలను చెల్లించడంతో పాటు ఒక్కో కార్మికుడి జీతాన్ని రూ.12 వేలుగా చెల్లిస్తున్నామన్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలోనూ అచీవ్ మెంట్ సాధించాం

డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలోనూ తాము అచీవ్ మెంట్‌ను సాధించామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కన్నా తాము నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు ప్రయోజనకరంగా ఉన్నాయని అధునాతన వ్యవస్థతో వీటిని నిర్మిస్తున్నామని ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు రూ.9 లక్షల ఖర్చు అవుతుందని మంత్రి తెలిపారు. ప్రజల ఫీడ్ బ్యాక్ ఆధారంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రజల ఆలోచన, సలహాల మేరకు ట్యాంక్ బండ్‌పై, చార్మినార్‌ల వద్ద ‘సన్ డే ఫన్ డే’ కార్యక్రమాలను చేపట్టామన్నారు.

కంటోన్మెంట్ అధికారుల తీరును తప్పుబట్టిన మంత్రి

కంటోన్మెంట్ అధికారుల తీరును మంత్రి కెటిఆర్ తప్పు పట్టారు. కంటోన్మెంట్ అధికారులు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. కంటోన్మెంట్ రోడ్లకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, ఇష్టారీతిన రోడ్లు మూసివేస్తున్నారని, కంటోన్మెంట్ భూముల్లో రహదారులకు అంగీకరించడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర వైఖరిపై రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయాల్సిందే

రాష్ట్ర అభివృద్ధి పట్ల కేంద్రం నుంచి అవార్డులు, ప్రసంశలు వస్తున్నాయి కానీ, పైసలు మాత్రం రావడం లేదని మంత్రి కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుంటే రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. కంటోన్మెంట్‌లో అభివృద్ధికి కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నామని, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం తమ విజ్ఞప్తులను పదుల సంఖ్యలో బుట్టదాఖలు చేసిందని ఆయన ఆరోపించారు.

పాతబస్తీ అభివృద్ధి ఇప్పటికే రూ.1500 కోట్లను కేటాయించాం

హైదరాబాద్‌లో వర్షం వచ్చినప్పుడు నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వరద నీటికి సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. నగరంలో రెండు కాలనీల్లో నీళ్లు ఉంటే హైదరాబాద్ మొత్తం మునిగిపోయిందని వార్తలు వేయడం సరికాదన్నారు. వరద పరిస్థితిని మెరుగుపరుస్తున్నామన్నారు. రాష్ట్ర విస్తీర్ణం 1,12,000ల చదరపు కిలోమీటర్లని అందులో హైదరాబాద్ విస్తీర్ణం 675 చదరపు కిలోమీటర్లని వైశాల్యం కన్నా జనాభా అధికంగా సుమారు కోటి 25 లక్షల మంది వరకు జీవిస్తున్నారని అందుకే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. పాతబస్తీ అభివృద్ధి ఇప్పటికే రూ.1500 కోట్లను కేటాయించామన్నారు. జిఓ 111పై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News