Sunday, January 19, 2025

కొండా సురేఖపై కెటిఆర్ పరువు నష్టం దావా

- Advertisement -
- Advertisement -

మంత్రి కొండా సురేఖ పైన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు గురువారం నాంపల్లి క్రిమినల్ కోర్టులో కెటిఆర్ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. బిఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌లను సాక్షులుగా పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం దురుద్దేశపూర్వకంగా, అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తగిన శిక్ష వేయాలని కోర్టులో కెటిఆర్ తన న్యాయవాదుల ద్వారా కేసు దాఖలు చేశారు. ఇప్పటికే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన పరువు నష్టం దావా వేస్తానని కెటిఆర్ లీగల్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వారం రోజులలోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని కెటిఆర్ తన లీగల్ నోటీసులలో పేర్కొన్నారు. అయితే లీగల్ నోటీస్ గడువు తీరిన నేపథ్యంలో చట్ట ప్రకారం గురువారం కొండా సురేఖ పైన కెటిఆర్ క్రిమినల్ డెఫమేషన్ కేసు నమోదు చేశారు.

కొండా సురేఖ గతంలో కూడా అసత్య ఆరోపణలు, అడ్డగోలు వ్యాఖ్యలు చేసినప్పుడు భారత ఎన్నికల సంఘం ఆమెకి చివాట్లు పెట్టి, మొట్టికాయలు వేసిన విషయాన్ని కెటిఆర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయపరమైన వ్యాఖ్యలు మాత్రమే కావని, తన పరువుకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా, ప్రణాళిక బద్ధంగా చేసిన కుట్రగా చూడాలని కెటిఆర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సురేఖ చేసిన వ్యాఖ్యలను, వాటి వెనుక ఉన్న నేరపూరిత దురుద్దేశాల పరిగణలోకి తీసుకొని, ఆమెకి చట్ట ప్రకారం శిక్ష వేయాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యల చరిత్రను పరిగణలోకి తీసుకొని క్రిమినల్ పరువు నష్టం చట్టాల ఆధారంగా కఠిన శిక్ష వేయాలని కోరారు. త్వరలోనే వీటితోపాటు పరువు నష్టం తాలూకు సివిల్ దావాను కూడా కెటిఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News